చెండాడే ఎండ..!
వైల్డ్ సమ్మర్... చైల్డ్ కేర్!
వేసవిలో స్కూళ్లకు సెలవలు వచ్చేది ఎందుకు? తాము ఎండలో ఆడుకునేందుకే అనేది పిల్లల మాట. ఎండాకాలం మొదలు కాగానే... ‘ఒరేయ్... ఎండలోకి వెళ్లకు’ అన్న అరుపులు ప్రతి ఇంటా వినిపిస్తుంటాయి. కానీ... వింటే వాళ్లు పిల్లలెందుకవుతారు? క్రికెట్ ఆడే కుర్రకారుకు... షాట్‌ను లాగికొట్టాక దిగంతపు బౌండరీలైన్‌కు అవతలకు కుంగిపడేపోయే ముందు ఎర్రటి గ్లేజ్‌బాల్‌లా ఆకాశంలో కనిపిస్తుంటాడు సూర్యుడు. అదే వాలిబాల్ ఆడేవాళ్లకు మాత్రం మునివేళ్లతో ఎగరేశాక సరిగ్గా నెట్ మీద ఉన్నట్లు కనిపిస్తాడు మాధ్యందిన మార్తాండుడు.అందుకే పిల్లలకు ఎండ తెలీదూ, దాని ప్రభావం తెలియదు. కానీ డాక్టర్లకు తెలుసు. పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులకూ తెలియాలి.
ఎండల తీవ్రతతో పెద్దలకంటే పిల్లలకే ఎక్కువ ప్రమాదం...
ఆటల్లో మునిగిపోయిన పిల్లలకు ఎండ తీవ్రత అర్థం కాదు. అందునా ఏ క్రికెట్‌లోనో, మరే కబడ్డీలోనో నిమగ్నమైపోతే వాళ్లకు అసలు ఎండ అనేది ఒక సమస్యే కాదు. కానీ అంత ఎండలో ఆడుతున్నప్పుడు పిల్లలకు వడదెబ్బ మొదలుకొని, డీహైడ్రేషన్ వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...
మజిల్ క్రాంప్స్ : క్రికెట్ ఆడే సమయంలో ఆటగాళ్లకు కండరాలూ, పిక్కలు పట్టేసి ఒక్కోసారి ఆటస్థలం నుంచి నిష్ర్కమిస్తుండటం తెలిసిన విషయమే. దీనికి కారణం... శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలందాలి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు ఆదేశాలిస్తాయి. ఎండవేడిమి తీవ్రతతో నీటిని తీవ్రంగా కోల్పోయి, దాంతో పాటూ లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు సరైన ఆదేశాలందవు. దాంతో నీరు కోల్పోయి డీ-హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు పోతాయి. వీటినే మజిల్‌క్రాంప్స్‌గా అభివర్ణిస్తారు. ఇలా మజిల్‌క్రాంప్స్‌కు గురైనప్పుడు శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయాలి.
మజిల్ క్రాంప్స్ వస్తే చికిత్స: పిల్లలకు మజిల్‌క్రాంప్స్ వచ్చి, వాళ్ల కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్-రీ-హైడ్రేషన్ (ఓఆర్‌ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ఒకవేళ అది లభ్యం కాకపోతే తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక లీటరు నీళ్లలో చిటికెడంత ఉప్పు, చారెడంత పంచదార వేసి బాగా కలిపి కూడా అప్పటికప్పుడు ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణాన్ని తయారు చేసి తాగించాలి. మనం తయారు చేయించాల్సిన అవసరం లేకుండానే అన్ని మెడికల్ దుకణాలలోనూ ఓఆర్‌ఎస్ ద్రావణపు పౌడర్ ఎన్నో ఫ్లేవర్లలో లభ్యమవుతోంది.
ఓఆర్‌ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తినిపించి, మంచినీళ్లు తాగించాలి. అరటిపండులో పొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు, నీటితో అవి చాలావరకు భర్తీ అవుతాయి. వడదెబ్బ : వినడానికి పెద్ద ప్రమాదకరంగా అనిపించకపోయినా ఒక్కోసారి ప్రాణాంతకం అయ్యే పరిస్థితే ఈ వడదెబ్బ. మన శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ పిల్లలు వడదెబ్బకు లోనైతే వారి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగిపోతుంది. దాంతో పాటు మరిన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి...
వికారం వాంతులు కళ్లు తిరగడం నీరసం స్పృహతప్పడం; ఫిట్స్ రావడం చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు.
ఒంటి ఉష్ణోగ్రత 104 డిగ్రీ ఫారెన్‌హీట్‌కు చేరడం. శరీర ఉష్ణోగ్రత ఈ స్థాయికి పెరిగితే అది మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే అలా జరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థాయికి (నార్మల్‌కు) తీసుకోరావడం అవసరం.
వడదెబ్బకు చికిత్స:
ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్‌కు మించుతున్నట్లు తెలియగానే వెంటనే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు). దుస్తులను వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఒకవేళ బట్టలు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, బట్టలన్నీ తీసేయాలి.ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
కేస్ స్టడీ...
ఇటీవలే వడదెబ్బ తగిలిన రమేశ్ అనే ఓ అబ్బాయిని దాదాపు కొలాప్స్ అయిన దశలో మా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. మరికాస్త ఆలస్యం అయితే ఎంతో ప్రమాదం జరిగి ఉండేది. ఆ సందర్భంలో మేం ఎంతో అప్రమత్తతతో వ్యవహరించి ఆ ప్రమాదాన్ని నివారించాం.
ఎండ తాలూకు దుష్ర్పభావాల నివారణ ఇలా...
ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లోనే ఆడుకునేలా ప్రోత్సహించాలి.
ఎండవేళల్లో ఇన్‌డోర్ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేయాలి.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి.
పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్నా పిల్లలకు వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి.
ఆటల్లో పూర్తిగా నిమగ్నమైపోయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. మధ్యమధ్యలో కొబ్బరినీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే... పిల్లలకు ఎండదెబ్బ తాలూకు దుష్ర్పభావాలనుంచి రక్షించుకోవచ్చు. దాంతో పాటు నట్టింట్లో పిల్లల సందడినీ ఆస్వాదించవచ్చు. సాయంత్రం చల్లబడ్డ తర్వాతనే వాళ్లకు గల్లీ క్రికెట్, ఇరత ఔట్‌డోర్ గేమ్స్‌కు అనుమతించాలి.