బాలల హక్కుల సంఘం చిల్డ్రన్స్
గర్ల్స్.. నాట్ బ్రైడ్స్
ఏమిటి?
10వేల మంది బాలికలతో ‘వాక్’
ఎప్పుడు?
4ఫిబ్రవరి 2018
ఎందుకు?
బాలికల కనీస వివాహ వయసును 18 నుండి 21కి పెంచాలని.
ఎక్కడ?
హైదరాబాద్ (లాల్ దర్వాజా నుంచి చార్మినార్ వరకు)
ఎవరు?
బాలల హక్కుల సంఘం చిల్డ్రన్స్ స్పర్శ్ ఫౌండేషన్
‘‘అక్కా.. నందిని మొహంలో మళ్లీ మునపటి కళ కనిపిస్తుందే..’’ అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన నందినిని చూస్తూ అన్నాడు శ్రీరామ్. ‘‘అవున్రా.. అది అట్లా నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ సరదాగా ఉంటే ఇల్లే సందడిగా ఉంది. పాతరోజులు గుర్తొస్తే ఎంత తప్పు చేశాం? అనిపిస్తుంటుందిరా..’’ తమ్ముడికి టీ కప్ అందించి అతని పక్కనే కూర్చుంటూ అన్నది అనంతలక్ష్మి. నిట్టూర్చాడు ఆమె తమ్ముడు! నందిని గతం.. ఒక గందరగోళం! నందిని చిన్నప్పటి నుంచీ చురుకైన పిల్ల. ఆటలంటే ఆసక్తి. ఉత్సాహంగా ఉండేదెప్పుడూ. టెన్త్‌లో స్కూల్ టాపర్. మేథమెటీషియన్ కావాలని ఆ పిల్ల కోరిక. చదువంటే బిడ్డకున్న ఇంట్రెస్ట్ చూసి మురిసిపోయాడు ఆయన. కాని ఆ వారమే పిల్ల ఆశను తుంచేసే నిర్ణయం తీసుకుంటాడని ఆ క్షణంలో అతనికి తెలియదు.
ఏమైంది?
నందిని మేనత్త ఓ సంబంధం తీసుకొని వచ్చింది. బాగా ఆస్తిపరులు, అబ్బాయికి సర్కార్ కొలువు. బంధువుల పెళ్లిలో నందినిని ఆ అబ్బాయి చూశాడు. మనసు పారేసుకున్నాడు. నందినినే చేసుకోవాలనుకుంటున్నాడు. అదీ ఆమె రాయబారం. ‘‘పెళ్లి వయసా దానిది? సమస్యే లేదు’’... నందిని తండ్రి కళ్లెర్రజేశాడు చెల్లి మీద. అయినా ఆమె ప్రయత్నం వీడక తన తల్లి ద్వారా విషయాన్ని ముందుకు కదిల్చింది. నువ్వు కట్నకానుకలిచ్చే పరిస్థితుల్లో లేవు. దాని వెనక ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారసుడి కోసం ముగ్గురు ఆడపిల్లలను కంటివి. ఈ ముగ్గురికీ చదువులు, కట్నాలు ఇచ్చి పెళ్లి్ల చేయగల స్థితిలో ఉన్నావా? నా మాటవిని.. ఉష తెచ్చిన సంబంధానికి ఊ అను’’ అని పోరింది నందిని నానమ్మ. ఈ నసకు నందిని, ఆమె తల్లి అనంతలక్ష్మి భయపడిపోయారు. నందిని తండ్రి ఆలోచనలో పడ్డాడు. ‘‘నందినికి చదువుకోవాలనుంది. చదివిద్దాం. దాని భవిష్యత్ అది చూసుకుంటుంది’’అంది రాత్రి భోజనాలయ్యాక భర్తతో అనంతలక్ష్మి. ‘‘నాకెందుకో మా అమ్మ చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. దానికి చదువు మీద మోజు ఉంది కాని చదివించి, అంతే ఖర్చుతో పెళ్లిచేసే స్థోమత మనకుండొద్దూ..? నందిని విషయంలో అమ్మ చెప్పినట్టే చేద్దాం’’ అని అటు తిరిగి పడుకున్నాడు అతను. అవాక్కయింది అనంతలక్ష్మి.
పెళ్లయింది!
నందినికి చేసిన ప్రామిస్‌ను ఆ తండ్రి ఆ రకంగా బ్రేక్‌చేసి ఆమెను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు బలవంతంగా.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో. కళ్లనిండా నీళ్లతో తలవంచి తాళి కట్టించుకుంది నందిని. భవిష్యత్ కలలు, లక్ష్యాలన్నిటినీ పమిట చెంగుకు కట్టేసుకొని మౌనంగా కాపురానికి బయలుదేరింది. ఏమీ తెలియని అమ్మాయిని ఏమేమో అడిగాడు ఆమెకన్నా సగం వయసు ఎక్కువున్న భర్త. బిక్క మొహం వేసింది నందిని. కొట్టాడు. భరించింది. కాపురం చేయడం చేతకాదని చీత్కరించాడు. అంటే ఏంటో అర్థంకాని అమ్మాయి తప్పు తనదేకామోసని నోర్మూసుకుంది. దాదాపు రోజూ లైంగికంగా దాష్టీకమే. పెళ్లయి ఆర్నెల్లయినా గర్భం రాలేదని అత్తగారి పోరూ ప్రారంభమైంది. ఆ వంకతో అత్త, భర్త చేయిచేసుకున్నారు. మనసుకు, శరీరానికి తగిలిన గాయాలతో పుట్టిల్లు చేరింది.నందినిని చూసిన తల్లి మనసు తరుక్కుపోయింది. ఇక్కడ మళ్లీ మేనత్త, నానమ్మ పెత్తనం తీసుకొని ‘అత్తింట్లో అవన్నీ మామూలే, సర్దుకోవడం నేర్పించు పిల్లకు’ అని అనంతలక్ష్మికి చెప్పి, నందిని తిరిగి అత్తింటికి పంపించారు. అక్కడా షరా మామూలే. ఈసారి పిల్లలు పుట్టడం కోసం మందులు, మాకులు ఇప్పిస్తామని నాటువైద్యుల చుట్టూ తిప్పారు. పిల్ల ఆరోగ్యం చెడింది. పుట్టింటికి పంపారు. ఆరునూరైనా సరే వెళ్లనని భీష్మించుకుంది నందిని. చదువుకుంటానని తండ్రి కాళ్లు పట్టుకుంది. ఈసారి అనంతలక్ష్మీ గట్టిగా ఉంది తన పట్టు మీద. తండ్రికీ బిడ్డ పరిస్థితి అర్థమైంది. కోర్టుకు వెళ్లాలనుకున్నారు. బాల్య వివాహంకింద వీళ్లకూ అక్షింతలు పడ్తాయని బంధువుల్లో ఒకరు బెదిరించడంతో కుల పెద్దలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించుకున్నారు. నందిని అత్తింటికి వెళ్లకుండా కాలేజ్‌కు వెళ్లడం మొదలుపెట్టింది.
ఇది నిజంగా జరిగిన ఘటన. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు. హైదరాబాద్‌లోనే. ఇదొకటే కాదు, బాల్య వివాహాల సంఖ్య రెండు రాష్ట్రాల్లో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదని ‘బాలల హక్కుల సంఘం’ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాల్య వివాహాల వల్ల గృహహింస కూడా పెరుగుతోందని, అందుకే బాలికల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు ఉండాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇందు కోసం పదివేల మంది బాలికలతో ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో ‘వాక్’ నిర్వహిస్తోంది. చిల్డ్రన్స్ స్పర్ష్ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు ప్రతిబింబంగా పిల్లల వేషధారణ కూడా ఉంటుంది.
21 ఏళ్లే సరైన వయసు
శారీరకంగానే కాదు మానసికమైన పరిపక్వత కూడా చాలా అవసరం. ఇప్పటి పిల్లలు చాలా ప్రేమగా పెరుగుతున్నారు. పద్దెనిమిదేళ్లొచ్చినా ఇంకా అమ్మానాన్నను పట్టుకునే ఉంటున్నారు. పైగా చదువూ ఇంటరే కదా! లోకం తెలియని వయసు. అంతేకాదు వాళ్ల జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తిని యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి 21 ఏళ్లు అనేది అమ్మాయిల పెళ్లికి కరెక్ట్ ఏజ్. అప్పటికీ ఓ డిగ్రీ వస్తుంది. వాళ్ల జీవితాన్ని వాళ్లు లీడ్ చేసుకునే శక్తీ వస్తుంది. డగ్రీ వరకు చదువుంటే మ్యారేజ్ తర్వాత ఏవైనా సమస్యలు వచ్చి రిలేషన్ బ్రేక్ అయినా ధైర్యంగా బతకగలరు. కాబట్టి ఫ్యామిలీపరంగా.. సోషల్లీ 21 ఏళ్లు సరైన వయసు. ఫిజికల్లీ.. మెంటల్లీ కూడా 21 ఏళ్లు అమ్మాయిలకు కరెక్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్.
– డాక్టర్ వి. శోభ, గైనకాలజిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్, హైదరాబాద్
చట్టం వైపు ‘వాక్’
పద్దెనిమిదేళ్లు అంటే ఇంకా చదువు సగంలోనే ఉంటుంది. 21 ఏళ్లకు ఒక సెటిల్‌మెంట్ వస్తుంది. జీవితం పట్ల ఓ దృక్పథం ఏర్పడుతుంది. మెంటల్లీ, ఫిజికల్లీ మెచ్యూరిటీ వస్తుంది. ఫైనాన్షియల్‌గా, సోషల్‌గా నిర్ణయాలు తీసుకోగలరు. పైగా ఓ డిగ్రీ వరకు చదువూ ఉంటుంది. అందుకే అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 మార్చాలి. ఇలాంటి ఈవెంట్‌ల ద్వారా ‘చట్టం’లో మార్పు తెచ్చుకునే వీలుంటుంది.
– పద్మజ, డీసీపీ
భద్రత కోసం అభద్రతలోకి!
‘‘పెళ్లికాని అమ్మాయికి సెక్యూరిటీ లేదు. పెళ్లిచేసి ఓ అయ్య చేతిలో పెడితే అన్నీ వాడే చూసుకుంటాడు’’ అని అంటారు! అమ్మాయి మన బాధ్యత కాదా? రక్షణ లేకపోవడం వ్యవస్థ తప్పు. అందుకని అమ్మాయిల జీవితాలు బలి కాకూడదు కదా. ఒక దాన్నుంచి భద్రత కావాలని ఇంకో అభద్రతలోకి నెట్టడం ఎంతవరకు కరెక్ట్? కనీసం 21 ఏళ్లకు గానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి రాదు. సమాజానికీ ఆలోచన రావాలంటే ఇలాంటి ‘వాక్’లు అవసరం.
– పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్
అవగాహన, మద్దతు కావాలి
చట్టాలు చేసినప్పుడు.. ప్రభుత్వం అందుకు తగ్గ సౌకర్యాలు కూడా కల్పించాలి. అమ్మాయి నిరాటంకంగా చదువుకునేలా.. లేదా ఆర్థిక స్వావలంబన కోసం ఆమెకు నచ్చే ఏ రంగం ఎంచుకున్నా అందుకు తగిన వెసులుబాటు కల్పించాలి. అందుకే ఈ వాక్. ఆడపిల్లల హక్కులు, వాళ్ల చాయిస్‌కు çసంబంధించి సమాజంలో ఒక అవగాహన, దాని నుంచి ఒక మద్దతు కలిగించేలా ఇలాంటి వాక్స్ ఉపయోగపడ్తాయి.
– రేవతీదేవి, ఎస్‌పీసీఆర్ సభ్యురాలు
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment