
మరి రోజుకు ఎన్ని కప్పుల కాఫీని ఎంజాయ్ చేయవచ్చు?
అతి సర్వత్ర వర్జయేత్ అని ఓ సామెత ఉంది లెండి. ఏది కూడా అతిగా చేయడం మంచిది కాదని దీని అర్థం. కాఫీ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. మరి రోజుకు ఎన్ని కప్పుల కాఫీని ఎంజాయ్ చేయవచ్చు? ఇప్పటికే జరిగిన దాదాపు 200 పరిశోధనలను పరిశీలించినప్పుడు రోజుకు మూడు నాలుగు కప్పులు లాగించినా ఇబ్బంది లేదని, అస్సలు కాఫీ తాగని వారితో పోలిస్తే వీరికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువేనని తెలిసింది. అంతేనా.. చాలా రకాల జబ్బులు రాకుండా నివారించేందుకూ కాఫీ పానీయం మేలు చేస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ పూలే అంటున్నారు.
అయితే... మహిళలు.. ముఖ్యంగా గర్భంతో ఉన్న వారు కాఫీ ఎక్కువగా తాగడం మాత్రం చేటు చేస్తుందని వీరు హెచ్చరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కాలేయానికి వచ్చే వ్యాధి సైరోసిస్, పార్కిన్‌సన్స్, డిప్రెషన్, ఆల్జైమర్స్ వంటి వ్యాధులకు కూడా కాఫీతో మేలు జరుగుతుందని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాఫీలోని ముఖ్యమైన పదార్థం కెఫీన్‌ను తొలగించి చూసినప్పుడు కూడా ఈ లాభాల్లో కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఉంటుందని రాబిన్ అంటున్నారు. ఈ ఫలితాలన్ని ఇప్పటికే జరిగిన అధ్యయనాల ఆధారంగా చేసిన అంచనాలు కాబట్టి మరిన్ని పరిశోధనలు జరపడం ద్వారా వీటిని నిర్ధారించుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొత్తమ్మీద చూస్తే ఒక మోస్తరుగా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించదన్నది ఈ అధ్యయనాల సారాంశంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.