పాటే పురుగు మందు...
బాలీవుడ్ బాత్
‘పానీ... పానీ’... వంటి సూపర్ హిట్ ర్యాప్ సాంగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హనీ సింగ్ ఆ తర్వాత దేశంలో ఒక పెద్ద సునామీనే లేవనెత్తాడు. ఇతగాడి పాటలు, రీ మిక్స్‌లు కొత్త తరాన్ని ఉర్రూతలూగించాయనే చెప్పాలి. అయితే ఇతడంటే చిరాకు పడేవాళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నారనేది వాస్తవం. పంజాబీ గాయకులలో గతంలో ఎవరికీ రాని వ్యతిరేకత ఇతడు మూట గట్టుకుంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల ఉత్తరాఖండ్ రైతులకు మాత్రం హనీసింగ్ ఆపద్బాంధవుడు అయ్యాడు.
అక్కడి బంగాళాదుంప పంట అడవి పందుల బారిన పడుతుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న రైతులు దీనికి విరుగుడు కనిపెట్టారు. పొలాల్లో సౌండ్ బాక్స్‌లు పెట్టి పెద్ద ఎత్తున హనీసింగ్ పాటలు రేయింబవళ్లు వినిపిస్తుంటే అడవి పందులు కాదు కదా పురుగూ పుట్ర, నక్కలు గిక్కలు ఏవీ రావడం లేదట. ఇది విని హనీ సింగ్ ఏడ్వాలా సంగీత ప్రియులు నవ్వాలా వేయి వాద్యాల ప్రశ్న!