మాటిమాటికీ తిరగబెడుతున్న సమస్య, ఏం చేయాలి?
నాకు 38 ఏళ్లు. ప్రతిసారీ నేను సెక్స్ చేసేప్పుడు నాకు పురుషాంగంలోనూ, నా భార్యకు యోనిలో మంట వస్తోంది. ఈ మంటతో ఒక్కోసారి నెలల తరబడి సెక్స్‌కు దూరంగా ఉంటున్నాము. ఇద్దరం చాలాసార్లు యాంటీబయాటిక్స్ వాడాం. వాడినప్పుడు ఒక వారం పాటు బాగానే ఉండి, మళ్లీ సమస్య వస్తోంది. దయచేసి మంచి సలహా ఇవ్వగలరు.
- ఒక సోదరుడు, సామర్లకోట
కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మాత్రమే గాకుండా క్లమిడియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా అయ్యే అవకాశం ఉంది. మీ సమస్య నిర్ధారణ కోసం కొన్ని రక్తం, మూత్ర పరీక్షలు చేయించి, ఆరు వారాల పాటు దానికి తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. ఈ ఆరు వారాల పాటు కండోమ్ వేసుకునే సెక్స్ చేయాలి. దాంతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు సిస్టోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చని అనిపిస్తోంది. ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్ లేదా యాండ్రాలజిస్ట్‌ను కలవండి.
నాకు 62 ఏళ్లు. షుగర్, బీపీ సమస్యలు లేవు. నేను నా భార్యతో ఇప్పటికీ సెక్స్ చేస్తూ ఉంటాను. నాకు అంగస్తంభన విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. కాకపోతే రాత్రి పూట మూత్రం ఎక్కువగా వస్తోందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందని అంటున్నారు. సెక్స్ ఎక్కువగా చేయడం వల్ల ప్రోస్టేట్ పెరుగుతుందా? అరవైఏళ్లు పైబడ్డాక సెక్స్ చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
- ఎస్.కె.బి., నేలకొండపల్లి
సెక్స్‌కు వయోపరిమితి లేదు. అరవై ఏళ్ల తర్వాత సెక్స్ చేయగలగడమే మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడా నికి, సెక్స్ ఎక్కువగా చేయడానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. జన్యుపరంగా కొందరిలో ప్రోస్టేట్‌గ్లాండ్ వయసు పైబడిన వారిలో పెరిగి, మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువమందిలో మందులతోనే నయం చేయవచ్చు. ఒకవేళ మూత్రం అస్సలు సరిగా రాకపోతే ఆపరేషన్ లేకుండానే ప్రోస్టేట్‌గ్లాండ్‌ను లేజర్‌తో తొలగించినా, సెక్స్ సమస్యలు ఉండవు. కేవలం వీర్యం తక్కువగా వస్తుంది. ఇది మినహా సెక్స్‌లో ఎలాంటి లోపం ఉండదు. ఎనభై ఏళ్లు పైబడిన వారిలో కూడా సెక్స్ చేసేవారిని తరచూ చూస్తూనే ఉంటాం. కాబట్టి సెక్స్ విషయంలో అన్ని అపోహలు వదిలేసి, ప్రోస్టేట్ విషయంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 9 2015 12:51 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement