
ప్రతీకాత్మక చిత్రం
‘ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా వినిపించుకోరు. ఏం మనుషులో ఏమో!’ విసుక్కున్నట్టు గట్టిగాపైకే అంటున్న ఆమె కేసి మళ్లీ చూశాను. చేతులు గాల్లోకి తిప్పి తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది. మధ్య మధ్య కన్నీళ్లు తుడుచుకుంటోంది.
‘చెప్పుతో కొట్టాలి.. ’ అనే మాటతో ఉలిక్కిపడి చూశాను. కిటికీ పక్కన కూర్చున్న ఆవిడ ఇంకా ఏవో మాటల్ని తనలో తను అనుకున్నట్టు బైటికే అంటోంది. ఉండుండి తల రుద్దుకుంటోంది. కిటికీ నుంచి బయటకే చూస్తోంది. కొంచెం భయంగా అనిపించి, కాస్త పక్కకు జరిగాను. ఆమెలో మార్పేమీ లే దు. ‘ఈవిడ మతిస్థిమితం తప్పినావిడ కాదు కదా!’ అనుకుంటూ ఒకసారి చుట్టూ చూశాను. అన్ని సీట్లు ఫుల్‌గానే ఉన్నాయి. దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లలో తలలు పెట్టి బిజీగా ఉన్నారు. ముందు సీట్లో కండక్టర్ మాత్రం.. టికెట్ మిషన్‌ను ఒకసారి, బ్యాగులో డబ్బులొకసారి చూసుకుంటున్నాడు. బ్యాగు సర్దుకుంటున్నాడు.అది సిటీ బస్సు. ఆదివారం బంధువులింట్లో ఫంక్షన్. తప్పనిసరి అయి బయల్దేరాను. ‘ఛీ.. ఛీ.. ఎంత చెప్పినా వినిపించుకోరు. ఏం మనుషులో ఏమో!’ విసుక్కున్నట్టు గట్టిగా పైకే అంటున్న ఆమె కేసి మళ్లీ చూశాను. చేతులు గాల్లోకి తిప్పి తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది. మధ్య మధ్య కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె కట్టు, బొట్టు చూస్తుంటే ఓ మధ్యతరగతి ఇల్లాలు అని అర్థమవుతోంది. ఆమె చెవుల్లో ఇయర్ ఫోన్స్, చేతిలో ఫోన్ లేదని రూఢీ చేసుకున్నాక... ‘ఎక్కడకు వెళ్లాలి మీరు’ అని మాటలు కలిపాను.
ఆమె ఉలిక్కిపడి నా వైపు చూసింది. కన్నీళ్లను తుడుచుకుంటూ ‘మారేడుపల్లి..’ అంది. ‘రిలేటివ్స్ ఇంటికి వెళుతున్నారా..’ అడిగాను. ‘అవును. నిన్న మా ఆడపడుచు వాళ్లింటికి వెళ్లాం. మా ఆయనకు ఏదో పని పడిందట. వెళ్లిపోయాడు..’ అంటూ ఇంకా రాలుతున్న కన్నీటిని తుడుచుకుంటుంది.‘ఏమైనా ప్రాబ్లమా!’ అడిగాను.‘మా తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. మా ఆయనకు మా అమ్మవాళ్లకు డబ్బు విషయమై గొడవలు. వాళ్లు ఇటు రావద్దు, నేనటు వెళ్లొద్దు. అమ్మవాళ్లు ఫోన్ చేసినా కోపమే! నా దగ్గర ఫోన్ కూడా లేకుండా చేశాడు. ఐదేళ్లు అవుతోంది వాళ్లతో మాట్లాడి. మా తమ్ముడి గురించి చెబుతుంటే వినిపించుకోకుండానే వెళ్లిపోయాడు. ఏం చెప్పినా అంతే! నోర్మూసుకో అంటాడు...’ చిన్న పలకరింపుతో ఆమె తన ఇంటి విషయాలు చెబుతూ పోతోంది!‘ఇద్దరు మగపిల్లలు. చిన్నోడు టెన్త్‌క్లాస్, పెద్దోడు ఇంటర్మీడియెట్. హాస్టల్‌లో ఉండి చదువుకుంటారు. ఇంట్లో ఉంటే చదవడం లేదని హాస్టల్‌లో వేశాడు మా ఆయన..’ ‘మీలో మీరు మాట్లాడుకుంటున్నారు ఎందుకు?’ అడగాలనిపించినా ఆగిపోయాను. అసలు ఆమె బాధ ఏంటో వినేవారే లేరని అర్థమైంది.
స్టాప్ వచ్చింది. మారేడుపల్లిలో ఆవిడ బస్సు దిగిపోయింది.‘ఏయ్! దూరంగా నిలబడు ..’ ఎందుకలా మీద మీదకు వస్తావ్! సిగ్గు లేదు, ఎద్దులా పెరిగావు.. ఏం నేర్చుకున్నావ్!’ ముందు సీటు లెఫ్ట్‌సైడ్‌లో కూర్చున్న ఓ పెద్దావిడ.. పక్కన నిల్చున్న అమ్మాయి మీద కస్సుమంటోంది. ఆమె వాయిస్ అంతటి బస్సు సౌండ్‌లోనూ గట్టిగా వినిపిస్తోంది. వెనకసీట్లో ఉన్నావిడ ‘అదేంటమ్మా! ఆ అమ్మాయి బాగానే నిలబడింది కదా.’ అనేసరికి ‘యు షటప్.. నువ్వెవరు నన్ను క్వొశ్చన్ చేయడానికి..’ అంటూ గయ్యిమని లేచింది. తన వస్తువులను దగ్గరకు సర్దుకుంటోంది. సరిగ్గా ఉన్న వాటిని కూడా మళ్లీ జరిపి పెడుతోంది. మళ్లీ గట్టి గట్టిగా తిడుతూనే ఉంది, చేతులు గాల్లోకి లేపి ఎవరికో వార్నింగ్ ఇస్తోంది. ఎవరు బస్సు ఎక్కి ఆమె సీటు పక్కన నిల్చున్నా .. వాళ్ల మీద కయ్యిమంటూనే ఉంది. ‘మైండ్ సరిగ్గా లేనట్టుంది..’ పక్కసీటావిడ జాలిగా ఆమెవైపు చూస్తూ అంటోంది. నిజమే, మైండ్ దెబ్బతిని ఉంటుంది. బహుశా! చెప్పేది వినడానికి ఎవరూ లేకనో! అసలు వినదగినవారే లేకనో.. !
– నిర్మలారెడ్డి