డాడీ తప్పు నాది కాదు
చెంప పగల గొట్టపచ్చు..బలముంటే గొంతును నులిమేయొచ్చు అప్పటికీ కోపం చల్లారకపోతే కళ్లు పీకేయొచ్చు .. చేతులు నరికేయొచ్చు! వాడి దేహం మీద కూర్చుని\ మన కడుపు మంట చల్లారే దాకా గుండెలను బద్దలు గొట్టవచ్చు! కాని... ఇవేవీ మనం చేయం..శక్తి ఉన్నా చేయం!! అలా చేస్తే మనకి, వాడికి తేడా ఏంటి? ఒక అమ్మాయి తల్లిగా, తండ్రిగా, తోబుట్టువుగా,.. బంధువుగా, స్నేహితుడిగా మరి నేనేం చేయగలను? మార్గం ఉంది.. మన పిల్లలు తప్పులు చేయకపోయినా వారితో ఇతరులు తప్పులు చేయించవచ్చు మొహమాటపెట్టి మోసం చేయవచ్చు సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టి వశపరచుకోవచ్చు అసలు మన ఆడపిల్లలపై ఎలాంటి దాడులు జరుగుతాయో తెలుసుకుంటే మన బంగారు తల్లులకు ముందే జాగ్రత్తలు చెప్పొచ్చు! బిడ్డను కాపాడుకోవచ్చు!
జాహ్నవి.. చక్కగా ఉంటుంది. 23 ఏళ్లు. చాలా చురుకైన పిల్ల. స్వస్థలం హైదరాబాద్. ఉద్యోగం ముంబైలో. అలా చదువైపోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చేసింది. తండ్రి ప్రభుత్వోద్యోగి. తల్లి గృహిణి. జాహ్నవి ఒక్కతే ముంబైలో ఉండేది. తన ఆఫీస్‌లోని ఇద్దరు కొలీగ్స్‌తో కలిసి సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది.
పఫ్.. సిప్.. క్లిక్
తన ఆఫీస్ ఉన్న కాంప్లెక్స్‌లోనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉంది. రెండిటికీ ఒకటే క్యాంటీన్. అక్కడ పరిచయం అయ్యాడు అవినాష్. సాఫ్ట్‌వేర్. పాతికేళ్లు. జాహ్నవి చురుకుదనం అతనిని బాగా ఆకట్టుకుంది. అందుకే ముందుగా అతనే మాట కలిపాడు ఆమెతో. సహజంగానే అందరితో కలివిడిగా ఉంటుంది కాబట్టి ఆ మాటకు స్పందించింది జాహ్నవి. కొన్ని రోజుల్లోనే ఆ పరిచయం స్నేహంగా మారింది. కలిసి బయటకు వెళ్లడాలు.. సినిమాలు, షికార్లు.. చాలా క్యాజువల్‌గా జరిగాయి. ఇద్దరూ కలిసి ఫొటోలు తీసుకోవడాలు, సెల్ఫీలు కూడా కామన్ అయ్యాయి. ఒకటి రెండుసార్లు జాహ్నవిని పబ్‌కీ తీసుకెళ్లాడు.
తాను సిగరెట్ దమ్ము కొడుతూ ఒక్క పఫ్ పీల్చమని బతిమాలి.. బలవంతంగా సిగరెట్టూ ఆమె చేతికిచ్చాడు. ఒక్క సిప్ రుచి చూడమని మందు గ్లాసూ చేతిలో పెట్టాడు. నిష్కర్షగా వద్దంటే బాధపడతాడేమోనని మొహమాటంగా సిగరెట్ పఫ్ పీల్చింది.. ఒక్క సిప్ మందు తాగింది. ఈలోపే ఆయన చేతిలోని సెల్ కెమెరా క్లిక్ మంది. ‘ఏయ్ .. ఏం చేస్తున్నావ్?’ అంటూ ముద్దుగా కసురుకుంది. ఆ ఫొటోలు చూపిస్తూ ‘రేపొద్దున మనకు పిల్లలకు చూపిస్తా.. మీ అమ్మ ఎలా ఉండేదో చూడండి అని’ జోక్ చేశాడు. జాహ్నవీ అంతే తేలికగా తీసుకొని హాయిగా నవ్వేసింది.
బ్రేకప్
పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఏమంటావ్ అంటూ ఇంటి నుంచి ప్రెషర్ పెరిగింది జాహ్నవికి. ఒక మంచి రోజున అవినాష్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పేసింది. ఆమె తల్లిదండ్రులు వచ్చి అవినాష్‌ను కలిశారు. పెద్దవాళ్లతో మాట్లాడాలి అన్నారు. అవినాష్ సొంతూరు నాగ్‌పూర్. అక్కడికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారు. నిశ్చితార్థమూ అయిపోయింది. పెళ్లి తేదీ నిర్ణయించేశారు. అప్పుడు జాహ్నవిని కలిసింది ఒక అమ్మాయి. అవినాష్ మాజీ ప్రియురాలినంటూ. దిమ్మ తిరిగింది జాహ్నవికి. అవినాష్‌ను అడిగింది. అదంతా అబద్ధమని మొదట బుకాయించాడు. ఆ అమ్మాయిని ముందు పెట్టి నిలదీసేసరికి నీళ్లు నమిలాడు. అతని ప్రవర్తన నచ్చలేదు జాహ్నవికి. అతనితో సంబంధం వద్దనుకుంది. ఆ మాటే చెప్పింది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు అవినాష్. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని తెగేసింది.
బెదిరింపు..
ఆరునెలలు గడిచాయి. అవినాష్ విషయం పూర్తిగా మరిచిపోకపోయినా అందులోంచి బయటపడింది జాహ్నవి. అందుకే ఇంకో సంబంధం చూశారు పెద్దవాళ్లు. ఓకే అనేసింది ఆమె. రెండు నెలల్లో పెళ్లి. ఒకరోజు .. ఆడపడుచు నుంచి ఫోన్ వచ్చింది జాహ్నవికి. తన ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్‌కు వచ్చిన ఫోటోస్ గురించి చెప్పింది ఆమె. వాటిని పంపించింది కూడా. ఆ ఫొటోలను చూసి అవాక్కయింది జాహ్నవి. అవి పబ్‌లో తను సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు, మందు సిప్ చేస్తున్నప్పుడు అవినాష్ తీసిన ఫొటోలు. అంటే వాటిని తనను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నాడన్నమాట. అవినాష్‌కి ఫోన్ చేసింది. తనను కాదని వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటే వాటిని ఫేస్‌బుక్‌లో అందరికీ కనిపించేటట్టు పెడతాననీ బెదిరించాడు.
ఎఫ్‌బీలో పోస్ట్.. పోలీస్ చేతిలో పేస్ట్
ఆ బ్లాక్‌మెయిల్‌కి జాహ్నవి భయపడక పోయేసరికి అన్నట్టుగానే ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ‘ఇది శాంపిల్ మాత్రమే. పెళ్లి చేసుకోక పోయినా పర్లేదు.. ఒక్క రాత్రి నాతో గడుపు చాలు’ అన్నాడు. ‘లేకపోతే.. న్యూడ్ బాడీకి నీ మొహాన్ని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను ఎఫ్‌బీలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మొదట గంభీరంగానే ఉన్నా అతను అన్నంత పనే చేస్తాడేమోనని భయపడసాగింది జాహ్నవి. ఓ వారం ఆగి ఇంకో ఫోటోనూ పోస్ట్ చేశాడు. ఆఫీస్‌లో తలెత్తుకోలేక పోయింది. ఈలోపు పెద్దలు కుదిర్చిన పెళ్లికొడుకు తనతో పెళ్లి క్యాన్సల్ చేసుకుంటున్నట్టు ఫోన్ చేశాడు. హతాశురాలైంది. ఇంక ఉపేక్షిస్తే లాభంలేదని విషయాన్ని వాళ్ల అన్నయ్యతో చెప్పింది జాహ్నవి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముంబై వచ్చాడు జాహ్నవి అన్నయ్య. సైబర్ క్రైమ్ పోలీస్‌ను కలిసి కంప్లయింట్ ఫైల్ చేశాడు. అవినాష్ పోస్ట్ చేసిన ఫోటోస్ చూపించారు. జాహ్నవి ఇచ్చిన క్లూస్‌తో అవినాష్‌ను అరెస్ట్ చేశారు పోలీస్‌లు.