Cigarette smoke
-
యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం
వెల్లింగ్టన్: ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ చెప్పారు. ఇదీ చదవండి: అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది! -
దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు
ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించారని.. అయినప్పటికి మరోసారి క్యాన్సర్ బారిన పడడంతో ఆపరేషన్ చేసి మరో ఊపిరితిత్తిలో సగభాగం తీసేసినట్లులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. అయితే సిరివెన్నెలకు సిగరేట్ అలవాటు ఉండడం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. సిరివెన్నెల గతంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మోకింగ్ అలవాటుపై కీలక విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్.. వ్యసనంగా మారిందని చెప్పారు. నాకు అసలే అహంకారం ఎక్కువ.. అయినా సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని చెప్పారు. తన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెపినట్లు తెలిపారు. పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్యర్‌తో మరణించిన నేపథ్యంలో గతంలో స్మోకింగ్‌పై సిరివెన్నెల చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. -
సిగరెట్ వివాదం.. పోలీసుల దాడి..!
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓ యువకుడిని చితకబాదారు. పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లి ఓ యువకుడిపై దాడి చేసి గాయపర్చారు. వివరాలు.. తుకారాంగేట్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు అక్కడను చేరుకుని యువకుల్ని స్టేషన్‌కు తరలించారు. సాయిగౌడ్ అనే యువకుడిని చితకబాదారు. దీంతో అతని నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడే ఉన్న ఉన్న యువకుడి స్నేహితులు ఇదంతా వీడియోలో చిత్రీకరించడంతో.. పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అకారణంగా తనను ఎస్ఐ రామ్‌లాల్, కానిస్టేబుల్ నాయక్ కొట్టారని, తాను కనీసం మద్యం కూడా తాగలేదని సాయి వాపోయాడు. ఇదిలాఉండగా.. ఓ సిగరెట్ వివాదంలో సదరు యువకుడు పోలీసులతో అతిగా స్పందించినట్టు తెలిసింది. -
డాడీ తప్పు నాది కాదు
చెంప పగల గొట్టపచ్చు..బలముంటే గొంతును నులిమేయొచ్చు అప్పటికీ కోపం చల్లారకపోతే కళ్లు పీకేయొచ్చు .. చేతులు నరికేయొచ్చు! వాడి దేహం మీద కూర్చుని\ మన కడుపు మంట చల్లారే దాకా గుండెలను బద్దలు గొట్టవచ్చు! కాని... ఇవేవీ మనం చేయం..శక్తి ఉన్నా చేయం!! అలా చేస్తే మనకి, వాడికి తేడా ఏంటి? ఒక అమ్మాయి తల్లిగా, తండ్రిగా, తోబుట్టువుగా,.. బంధువుగా, స్నేహితుడిగా మరి నేనేం చేయగలను? మార్గం ఉంది.. మన పిల్లలు తప్పులు చేయకపోయినా వారితో ఇతరులు తప్పులు చేయించవచ్చు మొహమాటపెట్టి మోసం చేయవచ్చు సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టి వశపరచుకోవచ్చు అసలు మన ఆడపిల్లలపై ఎలాంటి దాడులు జరుగుతాయో తెలుసుకుంటే మన బంగారు తల్లులకు ముందే జాగ్రత్తలు చెప్పొచ్చు! బిడ్డను కాపాడుకోవచ్చు! జాహ్నవి.. చక్కగా ఉంటుంది. 23 ఏళ్లు. చాలా చురుకైన పిల్ల. స్వస్థలం హైదరాబాద్. ఉద్యోగం ముంబైలో. అలా చదువైపోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చేసింది. తండ్రి ప్రభుత్వోద్యోగి. తల్లి గృహిణి. జాహ్నవి ఒక్కతే ముంబైలో ఉండేది. తన ఆఫీస్‌లోని ఇద్దరు కొలీగ్స్‌తో కలిసి సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటోంది. పఫ్.. సిప్.. క్లిక్ తన ఆఫీస్ ఉన్న కాంప్లెక్స్‌లోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. రెండిటికీ ఒకటే క్యాంటీన్. అక్కడ పరిచయం అయ్యాడు అవినాష్. సాఫ్ట్వేర్. పాతికేళ్లు. జాహ్నవి చురుకుదనం అతనిని బాగా ఆకట్టుకుంది. అందుకే ముందుగా అతనే మాట కలిపాడు ఆమెతో. సహజంగానే అందరితో కలివిడిగా ఉంటుంది కాబట్టి ఆ మాటకు స్పందించింది జాహ్నవి. కొన్ని రోజుల్లోనే ఆ పరిచయం స్నేహంగా మారింది. కలిసి బయటకు వెళ్లడాలు.. సినిమాలు, షికార్లు.. చాలా క్యాజువల్‌గా జరిగాయి. ఇద్దరూ కలిసి ఫొటోలు తీసుకోవడాలు, సెల్ఫీలు కూడా కామన్ అయ్యాయి. ఒకటి రెండుసార్లు జాహ్నవిని పబ్కీ తీసుకెళ్లాడు. తాను సిగరెట్ దమ్ము కొడుతూ ఒక్క పఫ్ పీల్చమని బతిమాలి.. బలవంతంగా సిగరెట్టూ ఆమె చేతికిచ్చాడు. ఒక్క సిప్ రుచి చూడమని మందు గ్లాసూ చేతిలో పెట్టాడు. నిష్కర్షగా వద్దంటే బాధపడతాడేమోనని మొహమాటంగా సిగరెట్ పఫ్ పీల్చింది.. ఒక్క సిప్ మందు తాగింది. ఈలోపే ఆయన చేతిలోని సెల్ కెమెరా క్లిక్ మంది. ‘ఏయ్ .. ఏం చేస్తున్నావ్?’ అంటూ ముద్దుగా కసురుకుంది. ఆ ఫొటోలు చూపిస్తూ ‘రేపొద్దున మనకు పిల్లలకు చూపిస్తా.. మీ అమ్మ ఎలా ఉండేదో చూడండి అని’ జోక్ చేశాడు. జాహ్నవీ అంతే తేలికగా తీసుకొని హాయిగా నవ్వేసింది. బ్రేకప్ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఏమంటావ్ అంటూ ఇంటి నుంచి ప్రెషర్ పెరిగింది జాహ్నవికి. ఒక మంచి రోజున అవినాష్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పేసింది. ఆమె తల్లిదండ్రులు వచ్చి అవినాష్‌ను కలిశారు. పెద్దవాళ్లతో మాట్లాడాలి అన్నారు. అవినాష్ సొంతూరు నాగ్‌పూర్. అక్కడికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారు. నిశ్చితార్థమూ అయిపోయింది. పెళ్లి తేదీ నిర్ణయించేశారు. అప్పుడు జాహ్నవిని కలిసింది ఒక అమ్మాయి. అవినాష్ మాజీ ప్రియురాలినంటూ. దిమ్మ తిరిగింది జాహ్నవికి. అవినాష్‌ను అడిగింది. అదంతా అబద్ధమని మొదట బుకాయించాడు. ఆ అమ్మాయిని ముందు పెట్టి నిలదీసేసరికి నీళ్లు నమిలాడు. అతని ప్రవర్తన నచ్చలేదు జాహ్నవికి. అతనితో సంబంధం వద్దనుకుంది. ఆ మాటే చెప్పింది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు అవినాష్. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని తెగేసింది. బెదిరింపు.. ఆరునెలలు గడిచాయి. అవినాష్ విషయం పూర్తిగా మరిచిపోకపోయినా అందులోంచి బయటపడింది జాహ్నవి. అందుకే ఇంకో సంబంధం చూశారు పెద్దవాళ్లు. ఓకే అనేసింది ఆమె. రెండు నెలల్లో పెళ్లి. ఒకరోజు .. ఆడపడుచు నుంచి ఫోన్ వచ్చింది జాహ్నవికి. తన ఫేస్బుక్ ఇన్‌బాక్స్‌కు వచ్చిన ఫోటోస్ గురించి చెప్పింది ఆమె. వాటిని పంపించింది కూడా. ఆ ఫొటోలను చూసి అవాక్కయింది జాహ్నవి. అవి పబ్‌లో తను సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు, మందు సిప్ చేస్తున్నప్పుడు అవినాష్ తీసిన ఫొటోలు. అంటే వాటిని తనను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నాడన్నమాట. అవినాష్‌కి ఫోన్ చేసింది. తనను కాదని వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటే వాటిని ఫేస్బుక్లో అందరికీ కనిపించేటట్టు పెడతాననీ బెదిరించాడు. ఎఫ్బీలో పోస్ట్.. పోలీస్ చేతిలో పేస్ట్ ఆ బ్లాక్‌మెయిల్‌కి జాహ్నవి భయపడక పోయేసరికి అన్నట్టుగానే ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ‘ఇది శాంపిల్ మాత్రమే. పెళ్లి చేసుకోక పోయినా పర్లేదు.. ఒక్క రాత్రి నాతో గడుపు చాలు’ అన్నాడు. ‘లేకపోతే.. న్యూడ్ బాడీకి నీ మొహాన్ని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను ఎఫ్బీలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మొదట గంభీరంగానే ఉన్నా అతను అన్నంత పనే చేస్తాడేమోనని భయపడసాగింది జాహ్నవి. ఓ వారం ఆగి ఇంకో ఫోటోనూ పోస్ట్ చేశాడు. ఆఫీస్‌లో తలెత్తుకోలేక పోయింది. ఈలోపు పెద్దలు కుదిర్చిన పెళ్లికొడుకు తనతో పెళ్లి క్యాన్సల్ చేసుకుంటున్నట్టు ఫోన్ చేశాడు. హతాశురాలైంది. ఇంక ఉపేక్షిస్తే లాభంలేదని విషయాన్ని వాళ్ల అన్నయ్యతో చెప్పింది జాహ్నవి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముంబై వచ్చాడు జాహ్నవి అన్నయ్య. సైబర్ క్రైమ్ పోలీస్‌ను కలిసి కంప్లయింట్ ఫైల్ చేశాడు. అవినాష్ పోస్ట్ చేసిన ఫోటోస్ చూపించారు. జాహ్నవి ఇచ్చిన క్లూస్‌తో అవినాష్‌ను అరెస్ట్ చేశారు పోలీస్‌లు. -
పొగ సొగసును పట్టేశాడు!
కళ వృత్తిని తపస్సుగా భావించి పనిచేయడమనేది, అతిశయోక్తితో చెప్పే మాట కాదు. కొందరి విషయంలో, వాళ్లు చేసే కృషి విషయంలో ఈ మాట చాలా చిన్నది. చేపట్టిన వృత్తి పట్ల, అనుకొన్న పని పట్ల అంకిత భావంతో, ఎనలేని ఓపికతో పనిచేసే వాళ్లు కొందరుంటారు. అలాంటి వారిలో ఒకరు థామస్ హర్బ్రిచ్. జర్మనీకి చెందిన థామస్... మంచి ఫొటోగ్రాఫర్. అయితే అందరిలాగా చెట్లనీ, పుట్లనీ... సంఘటనలని, వేడుకలని... జంతువులని, పక్షులని తీస్తూ పోలేదతడు. ఎవరూ తీయని కొన్ని వైవిధ్యభరిత చిత్రాలను తీశాడు. వాటిని చూసి అందరూ విస్మయం చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ సరికొత్త ఫొటోగ్రఫీకి తెర తీశాడు థామస్. మూడు నెలల పాటు అదే పనిలో మునిగిపోయి ఉన్నాడు. పర్ఫెక్షన్ కోసం పరితపించాడు. కెమెరాలు చేతపట్టి లక్షకు పైగా షాట్స్ తీశాడు. అంతగా కష్టపడ్డాడంటే అతడేం ఫొటోలు తీశాడు అనే ఆసక్తి కలుగుతుందెవరికైనా. అదే అతడు దేనిని ఫొటోలు తీశాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ థామస్ ఫొటోలు తీసింది దేనినో తెలుసా... పొగని! కెమెరాలతో లక్ష షాట్స్ తీశాడట ఈ కెమెరామెన్. సిగరెట్ పొగ ఎలా రింగులు తిరుగుతుంది, రింగులు తిరుగుతున్న పొగ ఎన్ని రకాల ఆకారాలను ఏర్పరుస్తుంది అనే దానిపై పరిశోధన చేస్తూ కూర్చున్నాడు థామస్. సిగరెట్ తాగే మనిషిని పక్కనే కూర్చోబెట్టుకొని, అతడు పొగ వదలగానే దాన్ని ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. అయితే వేగంగా సుడులు తిరిగే పొగ థామస్ కెమెరాకు అంత సులువుగా అందలేదు. దాంతో ముప్పు తిప్పలు పడ్డాడు. మూడు నెలల పాటు అది తప్ప మరో ధ్యాసే లేకుండా గడిపాడు. లక్ష ఫొటోలు తీశాడు. ఎట్టకేలకు అనుకొన్నది సాధించాడు. కొసమెరుపేమిటంటే... అతడు తీసిన లక్ష ఫొటోల్లో కేవలం ఇరవై మాత్రమే పర్ఫెక్ట్గా వచ్చాయి. అయితే ఆ ఇరవై ఫొటోలూ అద్భుత కళాఖండాలను తలపిస్తున్నాయి. వాటిని బంధించడానికి థామస్ పడిన కష్టాన్ని కళ్లముందు నిలుపుతున్నాయి. కానీ అతడు మాత్రం దాన్ని కష్టం అనుకోవడం లేదు. ఏం చేస్తేనేం... పొగను, దాని సొగసును కెమెరాలో బంధించానని మురిసిపోతున్నాడు. అంకితభావం ఉండాలేగానీ ఏదీ కష్టం కాదు అని చెబుతున్నాడు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా... తనని చూస్తే తెలియడం లేదూ!