పొగ సొగసును పట్టేశాడు!
కళ
వృత్తిని తపస్సుగా భావించి పనిచేయడమనేది, అతిశయోక్తితో చెప్పే మాట కాదు. కొందరి విషయంలో, వాళ్లు చేసే కృషి విషయంలో ఈ మాట చాలా చిన్నది. చేపట్టిన వృత్తి పట్ల, అనుకొన్న పని పట్ల అంకిత భావంతో, ఎనలేని ఓపికతో పనిచేసే వాళ్లు కొందరుంటారు. అలాంటి వారిలో ఒకరు థామస్ హర్‌బ్రిచ్. జర్మనీకి చెందిన థామస్... మంచి ఫొటోగ్రాఫర్. అయితే అందరిలాగా చెట్లనీ, పుట్లనీ... సంఘటనలని, వేడుకలని... జంతువులని, పక్షులని తీస్తూ పోలేదతడు. ఎవరూ తీయని కొన్ని వైవిధ్యభరిత చిత్రాలను తీశాడు. వాటిని చూసి అందరూ విస్మయం చెందుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ సరికొత్త ఫొటోగ్రఫీకి తెర తీశాడు థామస్. మూడు నెలల పాటు అదే పనిలో మునిగిపోయి ఉన్నాడు. పర్ఫెక్షన్ కోసం పరితపించాడు. కెమెరాలు చేతపట్టి లక్షకు పైగా షాట్స్ తీశాడు. అంతగా కష్టపడ్డాడంటే అతడేం ఫొటోలు తీశాడు అనే ఆసక్తి కలుగుతుందెవరికైనా. అదే అతడు దేనిని ఫొటోలు తీశాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ థామస్ ఫొటోలు తీసింది దేనినో తెలుసా... పొగని! కెమెరాలతో లక్ష షాట్స్ తీశాడట ఈ కెమెరామెన్.
సిగరెట్ పొగ ఎలా రింగులు తిరుగుతుంది, రింగులు తిరుగుతున్న పొగ ఎన్ని రకాల ఆకారాలను ఏర్పరుస్తుంది అనే దానిపై పరిశోధన చేస్తూ కూర్చున్నాడు థామస్. సిగరెట్ తాగే మనిషిని పక్కనే కూర్చోబెట్టుకొని, అతడు పొగ వదలగానే దాన్ని ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. అయితే వేగంగా సుడులు తిరిగే పొగ థామస్ కెమెరాకు అంత సులువుగా అందలేదు. దాంతో ముప్పు తిప్పలు పడ్డాడు. మూడు నెలల పాటు అది తప్ప మరో ధ్యాసే లేకుండా గడిపాడు. లక్ష ఫొటోలు తీశాడు. ఎట్టకేలకు అనుకొన్నది సాధించాడు.
కొసమెరుపేమిటంటే... అతడు తీసిన లక్ష ఫొటోల్లో కేవలం ఇరవై మాత్రమే పర్‌ఫెక్ట్‌గా వచ్చాయి. అయితే ఆ ఇరవై ఫొటోలూ అద్భుత కళాఖండాలను తలపిస్తున్నాయి. వాటిని బంధించడానికి థామస్ పడిన కష్టాన్ని కళ్లముందు నిలుపుతున్నాయి. కానీ అతడు మాత్రం దాన్ని కష్టం అనుకోవడం లేదు. ఏం చేస్తేనేం... పొగను, దాని సొగసును కెమెరాలో బంధించానని మురిసిపోతున్నాడు. అంకితభావం ఉండాలేగానీ ఏదీ కష్టం కాదు అని చెబుతున్నాడు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా... తనని చూస్తే తెలియడం లేదూ!