మనసు కడలిలో డిప్రెషన్ | Depression in mind the maritime | Sakshi
Sakshi News home page

మనసు కడలిలో డిప్రెషన్

Published Sun, Mar 27 2016 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

మనసు కడలిలో   డిప్రెషన్

మనసు కడలిలో డిప్రెషన్

తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను చేసి కుంగదీసేవ్యాధి డిప్రెషన్. ఇదొక మానసిక వ్యాధి. ఇది వచ్చిన వారు జీవితంలో కుంగుబాటుకు గురవుతారు. డిప్రెషన్ వ్యాధి ఒక్కోసారి ఆత్మహత్యకు సైతం దారి తీయవచ్చు. నిజానికి చాలా ఆత్మహత్యలకు కారణం ఇదే. ప్రపంచంలో డిప్రెషన్ తీవ్రతకు ఉదాహరణ మన దేశమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం డిప్రెషన్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నది మన దేశంలోనే. ప్రతీ ఏడాదీ దాదాపు లక్షమందికి పైగానే డిప్రెషన్ వ్యాధి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి కేవలం బయటకు తెలిసిన గణాంకాలు మాత్రమే. ఇక డిప్రెషన్‌కు లోనయ్యే వ్యక్తుల పట్ల వివక్ష, దానికి లోనయ్యామంటూ చెప్పుకోలేకపోవడం వల్ల ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా. అందుకే వ్యాధికి గురైన వారిని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. డిప్రెషన్ గురించి మాట్లాడాలి.

 

 ఆ అవగాహన కోసమే ఈ కథనం.
ప్రపంచంలోని డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్న వారిలో 36 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. దాదాపు ప్రతి నలుగురు లేదా ప్రతి ముగ్గురిలో ఒకరు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు ఒక అంచనా. తీవ్రమైన కుంగుబాటు ధోరణి అన్నది డిప్రెషన్ అనే మానసిక వ్యాధి వల్ల అనే అవగాహన కూడా మన దగ్గర చాలా తక్కువ. ఇదొక మానసిక ధోరణిగానే అనుకుంటారు తప్ప చికిత్స తీసుకుంటే తగ్గే వ్యాధిగా భావించరు. దాంతో దీన్ని వ్యాధిగా గుర్తించకపోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలలో ఒకటైన ఆత్మహత్య భావనలు పెరిగి, వాటివల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు పెరుగుతున్నారు. అందుకే సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో మందులు తీసుకుంటే తగ్గే వ్యాధిగా దీన్ని గుర్తించడం అవసరం.

 

అనారోగ్యభారం కలిగించే వ్యాధుల్లో నాలుగోది డిప్రెషన్...
అనారోగ్య భారం వల్ల నష్టపోతున్న జీవితకాలాన్ని లెక్కిస్తారు. దీన్ని ‘డిజేయబులిటీ అడ్జెస్టెడ్ లైఫ్ ఇయర్స్’’ (డైలీస్) అని వ్యవహరిస్తారు. ఈ అనారోగ్య భారం ఎంత కాలం ఉందనే అంశంపై అతడు ఆరోగ్యంగా జీవించిన కాలాన్ని లెక్కేస్తారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితకాలం 80 ఏళ్లు అనుకుంటే అందులో పదేళ్ల పాటు ఏదో ఒక వ్యాధి వల్ల అతడి బతుకు భారం అయిపోతే, అతడు వాస్తవంగా ఆరోగ్యంగా జీవించింది 70 ఏళ్లేనని లెక్క. ఇలా జీవితంలో అనారోగ్యభారాన్ని కలిగిస్తున్న వ్యాధుల్లో  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డిప్రెషన్ నాలుగో స్థానంలో ఉంది. 2020 నాటికి ఇది రెండో స్థానానికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా.

 

డిప్రెషన్‌కు కారణాలు

మెదడులోని కొన్ని రసాయనాలు, న్యూరల్ సర్క్యుట్స్‌లో మార్పులు చోటు చేసుకోవడం కొన్ని జన్యుపరమైన కారణాలు  డిప్రెషన్‌కు గురయ్యే ఆరోగ్య చరిత్ర ఉన్న కుటుంబంలో అనువంశికంగా కనిపించడం  జీవనశైలిలో మార్పులు  చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం వంటివి డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఒక్కోసారి ఈ కారణాలు మెదడులోని రసాయన మార్పులకు, న్యూరల్ సర్క్యుట్ మార్పులకు కారణమవుతాయి. డిప్రెషన్‌కు గురైనప్పుడు మెదడులోని కణాల సంఖ్య, వాటి మధ్య నర్వ్ ఫైబర్స్‌కు ఉండే కనెక్షన్స్ తగ్గుతాయి. ఈ చర్యలు మెదడులోని హిప్పోక్యాంపస్, ఫ్రంటల్ లోబ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే తగిన చికిత్స చేసినప్పుడు ఈ మార్పులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి.

 
డిప్రెషన్ చికిత్స

మందులు, సైకోథెరపీ వంటి ప్రక్రియలు, మరికొన్ని ఆధునిక చికిత్సల ద్వారా డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే డిప్రెషన్‌నుంచి బయటపడేందుకూ, అది నయం అయ్యేందుకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీగా పేర్కొన షాక్ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇది ఒక మ్యాజిక్ చేసినంత ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లాగే ఈ షాక్ ట్రీట్‌మెంట్‌పైన కూడా చాలా అపోహలు ఉన్నాయి. అయితే షాక్ ట్రీట్‌మెంట్‌గా పేర్కొనే ఈ చికిత్సలో ఇచ్చే కరెంటు అస్సలు షాక్ కొట్టదు. ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఈ చికిత్సలో రోగికి అసలు కరెంట్‌షాక్ ఇచ్చారనే విషయం కూడా తెలియకుండా చేసే ఈ చికిత్స వల్ల ఎంతో మంది డిప్రెషన్ రోగులకు చికిత్స జరుగుతోంది. ప్రాణాలూ దక్కుతున్నాయి.

 

ఇవి మరింత పెంచుతాయి...
ఆల్కహాల్, ఓపియమ్, నిద్రమాత్రలు, ఇతర మాదకద్రవ్యాలు డిప్రెషన్‌ను మరింత పెంచుతాయి. అంతేగాక అప్పటికే డిప్రెషన్ ఉన్నవారు వీటికి అలవాటు పడే అవకాశం ఎక్కువ. వీటి మత్తులో పడి ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది.

 

డిప్రెషన్ - ఆత్మహత్యలు...
డిప్రెషన్ ఉన్నవారిలో సుమారు 15% మంది ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది. డిప్రెషన్‌లో ఉన్నవారు ఆత్మహత్య గురించి మాట్లాడుతుంటే తేలిగ్గా తీసుకోకండి. ఇదే జరిగితే తక్షణం సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి.

 

డిప్రెషన్ కనిపించే అవకాశాలు వీరిలో ఎక్కువ
ఒంటరిగా జీవిస్తున్నవారు  విడాకులు తీసుకున్నవారు  కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు  చిన్నతనంలోనే తల్లి/తండ్రిని కోల్పోయినవారు  తీవ్రమైన ఒత్తిడికి గురైనవారు  సమాజం నుంచి సహకారం (సోషల్ సపోర్ట్) లేనివారు  తమకు అత్యంత ప్రియమైన వారు దూరం కావడం లేదా చనిపోవడం  ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం   ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు లోనుకావడం కొందరిలో కనిపిస్తుంటుంది.

 

డిప్రెషన్ - శరీరంపై ప్రభావం
డిప్రెషన్ ప్రభావం మన రోగనిరోధక శక్తిపై ఉంటుంది. దాని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక శారీరక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఎక్కువ. అలాగే శారీరక సమస్యలు ఉన్నవారిలో 30% మంది డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. గుండెజబ్బులు ఉన్నవారికి డిప్రెషన్ ఉంటే వాళ్లలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువ.డిప్రెషన్ ఉన్నవారికి డయాబెటిస్ వంటి సమస్యల చికిత్స మామూలు వారికంటే కఠినమవుతుంది. డిప్రెషన్‌కు తగిన చికిత్స లభించకపోతే మతిమరుపు (డిమెన్షియా) రావచ్చు. డిప్రెషన్ ఉన్నవారికి థైరాయిడ్, ఇతర హార్మోన్ సమస్యలు రావడం ఎక్కువ. పక్షవాతం, పార్కిన్‌సన్ డిసీజ్, తలకు గాయం, మెదడులో కణుతులు, మూర్ఛ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారిలో డిప్రెషన్ చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది.  డిప్రెషన్ ఉన్నవారిలో ఎముకల అరుగుదల, అస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు ఎక్కువగా రావచ్చు. మనం సాధారణంగా వాడే నొప్పి నివారణ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీ), బీపీ మందులు, గర్భనిరోధక మందులు, రక్తంలో కొవ్వుపాళ్లను తగ్గించే స్టాటిన్స్‌తో పాటు సల్ఫానమైడ్స్, స్టెరాయిడ్స్ వంటివి డిప్రెషన్‌ను కలగజేస్తాయి. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఇలాంటివి సొంతంగా వాడకూడదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement