కొవ్వు పదార్థాలతో పిచ్చి ఖాయం!
లూసియానా: పరిమితికి మించిన కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడంవల్ల స్థూలకాయం, రక్తపోటువంటి వ్యాధులు వస్తాయని మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. కానీ, తాజా అధ్యయనంలో మాత్రం వీటివల్ల ఏకంగా మెదడు ఆలోచన స్థాయిలో నిలకడ తప్పుతుందని, మానసిక వైకల్యం తలెత్తి తీవ్ర ఒత్తిడికి గురవుతుందని వెల్లడైంది. లుసియానాలోని విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు కొవ్వుతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల ఏర్పడే అనర్థాలపై ఆందోళన చెందుతూ బయోలాజికల్ సైకియారిటి అనే జర్నల్లో తమ పరిశోధన అంశాలను వెలువరించారు.
ఈ పదార్థాలు తినే వారి ప్రవర్తనలో విపరీత మార్పు వస్తుందని, మెదడువాపు వ్యాధి కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందని అందులో పేర్కొన్నారు. మానసిక సమస్యలు వేగం పుంజుకుంటాయని, ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. ఈ మార్పును తాము ఎలుకలపై పరిశోధనలో గమనించామని వివరించారు. ముఖ్యంగా నాడీ వ్యవస్థపై కొవ్వు పదార్థాల ప్రభావం తీవ్రంగా పడినట్లు తాము గుర్తించామని చెప్పారు. జీర్ణాశయానికి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటాయని, ఫలితంగా అప్రమత్తంగా ఉండాల్సిన శరీరంలోని జీవ కణజాలం నిర్లిప్తంగా మారిపోతుందని పేర్కొన్నారు.