Fatty Foods
-
కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేశారా? ఈ విషయాలు తెలిస్తే..
లావవుతామనే భయంతో చాలామంది కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలను తినడం మానేస్తున్నారు. కొందరైతే నెయ్యి తినడం ఎప్పుడో మానేశారు. అయితే శరీరంలోని ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కాబట్టి తగిన పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం. అలాగని అన్నిరకాల కొవ్వులూ ఆరోగ్యం కాదు. ఇంతకూ ఆరోగ్యకరమైన కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందామా? అవకాడో: మీరు ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్గా ఉండి..అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ అవకాడోను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్: వేపుళ్లకు దూరంగా ఉండేవారు తప్పకుండా ఆహారాల్లో ఆలివ్ ఆయిల్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. పెరుగు: బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరంలోని కొవ్వును సమతుల్యంగా చేస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొవ్వు పాలతో చేసిన పెరుగు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రేగును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి: కొబ్బరి లేదా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చేపలు: చేపలలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందించే లక్షణాలున్నాయి. అందుకే ఇతర విధాలైన మాంసాహారాలకు దూరంగా ఉండమని హెచ్చరించే వైద్యులు సైతం పరిమితంగా అయినా చేపలు తీసుకోవచ్చునని చెబుతారు. బాదం పప్పు, జీడిపప్పు: వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనుకుంటాం. అయితే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఉంటాయి. అందువల్ల బాదం, జీడిపప్పు తీసుకోవడం మంచిది. బాదం పప్పును నీటిలో నానబెట్టి, పైన పొట్టు తీసి తినడం మంచిది. జీడిపప్పును అయితే వేయించకుండా నేరుగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంపొందుతుంది. నెయ్యి: ఇదివరకటిలో ఆహారంలో నేతిని బాగా ఉపయోగించేవారు. అరిసెలు, గారెలు వంటి వాటిని నేతితోనే చేసేవారు. అయితే రానురానూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. నిజానికి నేతిలో శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయి. అలాగని ముద్ద ముద్దకీ నెయ్యి వేసుకోవడం, నేతితోనే చేసిన డీప్ ఫ్రైలు విపరీతంగా తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదు. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి మంచిది. -
ఆ మనిషి పొట్టలో కొవ్వులే కొవ్వులు
కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చేటు. ఈ విషయం మనకు తెలు సుగానీ.. ఎప్పుడో 5300 ఏళ్లక్రితం బతికున్న మనిషికి తెలియదు. అందుకేనేమో.. ఆ మనిషి ఎంచక్కా కొవ్వులున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేశాడు. విషయం ఏమింటే.. ఫొటోలో కనిపిస్తోందే.. అది ఐదువేల ఏళ్ల క్రితం నాటి ఓ మనిషి అవశేషం. ఆల్ప్స్ పర్వతప్రాంతాల్లో మంచులో గడ్డకట్టుకుపోయి ఉండగా 1991లో బయటపడింది. శాస్త్రవేత్తలు ఐస్‌మ్యాన్ అని పేరు పెట్టారు. మంచులో ఉండిపోవడం వల్ల శరీరం పెద్దగా నాశనం కాలేదు. దీంతో శాస్త్రవేత్తలు ఐస్‌మ్యాన్ ఆ కాలంలో ఏం తిని ఉంటాడో తెలుసుకోవాలని అనుకున్నారు. పొట్టలో మిగిలి ఉన్న పదార్థాలను విశ్లేషించడం ద్వారా ఐస్‌మ్యాన్ చివరగా తీసుకున్న ఆహారంలో కొవ్వులు బాగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఆ కాలపు ప్రజల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు మాత్రమే కాకుండా... వంటలు ఎలా వండేవారో అర్థం చేసుకునేందుకు పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎప్పుడో 1991 ప్రాంతంలో బయటపడ్డ ఐస్‌మ్యాన్ కడుపు లో ఏముందో తెలుసుకునేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందన్న అనుమానానికి ఈపరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాక్సినర్ సమాధానమిస్తూ.. ఐస్‌మ్యాన్ కడుపు ఎక్కడుందో తెలుసుకోవడం మొదట్లో కష్టమైందని చెప్పారు. శరీరం మమ్మీలా మారిపోయే క్రమంలో కడుపు కాస్తా పైకి చేరిపోయిందని 2009లో సీటీస్కాన్ సాయంతో దీన్ని గుర్తించి ఆ తరువాత పరిశోధనలు చేపట్టామని వివరించారు. -
తింటేనే.. కొవ్వులు కరుగుతాయి!
కొవ్వు పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని. ఇదీ మనం తరచూ వినే మాట. అయితే నిన్నమొన్నటివరకూ నెయ్యి, కొబ్బరినూనెల వాడకంపై ఎన్నో అపోహలు ఉండగా.. మితంగానైనా వాటిని తీసుకోవడం మేలని కొందరు వైద్యులు స్వయంగా సూచిస్తున్నారు. తాజాగా తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే.. కొవ్వు పదార్థాలు మన చిన్నపేవుల్లో బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని.. అంతేకాదు.. ఈ మార్పు వల్ల కొవ్వు జీర్ణమవడమూ వేగవంతమవుతుందని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎగ్యూన్ బి.చాంగ్ అంటున్నారు. అమెరికా వంటి పాశ్చాత్యదేశాల్లో ఎక్కువగా తీసుకునే ఆహారంపై వీరు పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా దాదాపుగా లేని.. బ్యాక్టీరియా లేని అనే రెండు రకాల ఎలుకలకు అధిక కొవ్వులు ఉన్న ఆహారం అందించి పరిశీలించారు. తొలి రకం ఎలుకలు కొవ్వులను జీర్ణం చేసుకోలేక ఇబ్బంది పడితే.. రెండో రకం ఎలుకల పేవుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందింది. మొదటి రకం ఎలుకలకు ఈ బ్యాక్టీరియాను ఎక్కించినప్పుడు అవి కూడా వేగంగా లావెక్కడం మొదలుపెట్టాయి. ఇంకోలా చెప్పాలంటే వాటికి కొవ్వులు వంటబట్టడం మొదలైందన్నమాట. అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్న 24 నుంచి 48 గంటల్లోనే చిన్నపేవుల్లో బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని.. వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని.. చాంగ్ చెబుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించేందుకు మరింత మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. -
కొవ్వు పదార్థాలతో పిచ్చి ఖాయం!
లూసియానా: పరిమితికి మించిన కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడంవల్ల స్థూలకాయం, రక్తపోటువంటి వ్యాధులు వస్తాయని మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. కానీ, తాజా అధ్యయనంలో మాత్రం వీటివల్ల ఏకంగా మెదడు ఆలోచన స్థాయిలో నిలకడ తప్పుతుందని, మానసిక వైకల్యం తలెత్తి తీవ్ర ఒత్తిడికి గురవుతుందని వెల్లడైంది. లుసియానాలోని విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు కొవ్వుతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల ఏర్పడే అనర్థాలపై ఆందోళన చెందుతూ బయోలాజికల్ సైకియారిటి అనే జర్నల్‌లో తమ పరిశోధన అంశాలను వెలువరించారు. ఈ పదార్థాలు తినే వారి ప్రవర్తనలో విపరీత మార్పు వస్తుందని, మెదడువాపు వ్యాధి కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందని అందులో పేర్కొన్నారు. మానసిక సమస్యలు వేగం పుంజుకుంటాయని, ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. ఈ మార్పును తాము ఎలుకలపై పరిశోధనలో గమనించామని వివరించారు. ముఖ్యంగా నాడీ వ్యవస్థపై కొవ్వు పదార్థాల ప్రభావం తీవ్రంగా పడినట్లు తాము గుర్తించామని చెప్పారు. జీర్ణాశయానికి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటాయని, ఫలితంగా అప్రమత్తంగా ఉండాల్సిన శరీరంలోని జీవ కణజాలం నిర్లిప్తంగా మారిపోతుందని పేర్కొన్నారు.