
కొవ్వు పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని. ఇదీ మనం తరచూ వినే మాట. అయితే నిన్నమొన్నటివరకూ నెయ్యి, కొబ్బరినూనెల వాడకంపై ఎన్నో అపోహలు ఉండగా.. మితంగానైనా వాటిని తీసుకోవడం మేలని కొందరు వైద్యులు స్వయంగా సూచిస్తున్నారు. తాజాగా తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే.. కొవ్వు పదార్థాలు మన చిన్నపేవుల్లో బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడతాయని.. అంతేకాదు.. ఈ మార్పు వల్ల కొవ్వు జీర్ణమవడమూ వేగవంతమవుతుందని షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఎగ్యూన్ బి.చాంగ్ అంటున్నారు. అమెరికా వంటి పాశ్చాత్యదేశాల్లో ఎక్కువగా తీసుకునే ఆహారంపై వీరు పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా దాదాపుగా లేని.. బ్యాక్టీరియా లేని అనే రెండు రకాల ఎలుకలకు అధిక కొవ్వులు ఉన్న ఆహారం అందించి పరిశీలించారు.
తొలి రకం ఎలుకలు కొవ్వులను జీర్ణం చేసుకోలేక ఇబ్బంది పడితే.. రెండో రకం ఎలుకల పేవుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందింది. మొదటి రకం ఎలుకలకు ఈ బ్యాక్టీరియాను ఎక్కించినప్పుడు అవి కూడా వేగంగా లావెక్కడం మొదలుపెట్టాయి. ఇంకోలా చెప్పాలంటే వాటికి కొవ్వులు వంటబట్టడం మొదలైందన్నమాట. అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్న 24 నుంచి 48 గంటల్లోనే చిన్నపేవుల్లో బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతుందని.. వీటి స్రావాలు కొవ్వును విడగొడతాయని.. చాంగ్ చెబుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించేందుకు మరింత మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment