
అమ్మవారి అవతారంగా పూజలందుకునే దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి. వైశాఖ శుద్ధ దశమి నాడు కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు పరమేశ్వర వరప్రసాదంగా జన్మించింది వాసవాంబ. దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ, యవ్వనవతి అయిన ఆ కన్యకను విష్ణువర్థనుడనే రాజు చెరబట్టబోతాడు. అప్పుడు వాసవి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్రస్థలంలో తనకు అండగా నిలిచిన 102 గోత్రాలకు చెందిన బంధువులతో కలసి అగ్నిప్రవేశం చేస్తుంది.
ఆమె బలిదానానికి చిహ్నంగా విష్ణువర్థనుడి కొడుకు ఆమె గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అప్పటినుంచి వైశ్యులందరూ వాసవి కన్యకాపరమేశ్వరిని తమ కులదైవంగా పూజించడం మొదలు పెట్టారు. అమ్మవారి జయంతి సందర్భంగా అంతటా విశేష పూజలు జరుగుతాయి.
(25, బుధవారం కన్యకాపరమేశ్వరి జయంతి)
ఇందుగలడందులేడను సందేహంబు వలదు
శ్రీమన్నారాయణుని దివ్యావతారాలలో నాలుగవదైన నృసింహావతారం అత్యంత విశిష్టమైనది. వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. తన భక్తుడైన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి చూపడానికి స్తంభం బద్దలు కొట్టుకుని వచ్చాడు. జగత్తు అంతటా తానున్నానని నిరూపించాడు.
ఈ రోజు ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో లేచి తలంటుకొని స్నానం చేసి స్వామివారికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసి పానకం–వడపప్పు, చక్రపొంగలి–దద్ధ్యోదనం నివేదించాలి. సర్ప, మృత్యు, అగ్ని, అకాల మరణ, శస్త్ర, వ్రణ, శతృపీడలవల్ల బాధపడ్డవారు, చెరసాల పాలబడ్డవారు శ్రీ నృసింహస్వామిని పూజిస్తే, తక్షణమే కష్టాలనుండి విముక్తి పొందుతారు.
(28, శనివారం నృసింహ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment