మర్త్యలోకంలో (మానవలోకంలో) ఉన్నాడంటే పాపపుణ్యాల ఫలితాలు సుఖదుఃఖాలుగా అనుభవించడానికి వచ్చాడని గుర్తు. ఇక్కడకు వచ్చినవాడెవడూ పూర్తి సుఖాన్నీ పొందడు, పూర్తి దుఃఖాన్నీ పొందడు. నూరేళ్లు కష్టాలు పడ్డా, చివరకు మంచి మాట వింటాడు ఏదో ఒకటి. కానీ జీవితమంతా సుఖాలుండవు, అలాగే దుఃఖాలు కూడా ఉండవు. ఏవయినా కొన్నాళ్లే. మారిమారి అనుభవిస్తుంటాడు. ఇవి అనుభవంలోకి వచ్చినప్పుడు తాత్కాలికమైన ఉపశమనాలకోసం చూస్తే ఉద్ధరణ ఉండదు. అలా లేకుండా పోవాలంటే వైరాగ్యంతో భగవంతుడిని ఆశ్రయించాలి. ఆ అనుగ్రహం గురువు కారణంగానే వస్తుంది.
గురువు రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులంటారు ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’. గురువు సత్ స్వరూపుడు. రామకృష ్ణపరమహంస అంటారు. ఏనుగుకు ఒక లక్షణం ఉంటుంది. అదలా వెళ్ళిపోతూ తన తొండాన్ని చాపి కనబడ్డ ప్రతి వస్తువునూ పీకుతుంది. అది జాజి తీగ కానివ్వండి, పనసచెట్టు కానివ్వండి. దానికనవసరం. అది లాగేస్తుంది. అదే ఏనుగు పక్కన మావటి వెడుతున్నాడనుకోండి. అది తొండం ఎత్తినప్పుడల్లా తన చేతిలో ఉన్న అంకుశం ప్రయోగిస్తాడు. అంతే. ఎంత బక్కపలచటివాడైనా మావటి మాటకు అంతటి బలమైన ఏనుగు లొంగిపోతుంది. దేన్నీ పాడుచేయదు.
గురువుగారితో మమేకం చెందిన శిష్యుడు నిరంతరం గురువుని స్మరిస్తుంటాడు. నేనీ తప్పు చేస్తే, గురువుగారి దగ్గరకు వెళ్ళి ఏముఖం పెట్టుకుని నిలబడను? గురువు గారికి తెలియదులే అనుకుంటారా! మరి గురువు ఇంకెందుకు పరబ్రహ్మం అయినట్లు! ఒకవేళ గురువుగారికి నిజంగానే తెలియదనుకుందాం. నువ్వు తప్పుచేసి గురువుగారి దగ్గరకు వెళ్ళి తప్పుచేయని వాడిలా నిలబడతావా! అది గురుద్రోహం కాదా! కట్టి కుడుపదా! ‘నేనీ తప్పుచేయను.
గురువుగారి ముందు నిలబడి నమస్కరించగల యోగ్యత నాకు చాలు’ అనుకున్నప్పుడు.. గురువు రక్షణ బాధ్యత స్వీకరించినట్లే. ఆ గురువు వలన ఉత్తర జన్మలన్నీ కూడా నిలబడ్డాయి. మంచి జన్మలలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మంచి జన్మలలోకి వెళ్ళి శాస్త్రం మీద అధికారం ఉన్న తండ్రి కడుపునపుట్టి ఆయన అనుష్ఠానాన్ని చూసి ఆయన దగ్గర ఉపదేశం పొంది చాలా తొందరగా వైరాగ్యాన్ని పొంది బహుకొద్ది జన్మలలో ఈశ్వరుడి లోకి చేరిపోతాడు.
అందుచేత గురువు రక్షకుడు. అంతేకాదు, మనం పొందిన జ్ఞానాన్ని నిలబెట్టేవాడు గురువే. గురువంటే డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఓసారి చెప్పేసి వదిలిపెట్టేవాడు కాడు. గురువుతోడి అనుబంధం తెగిపోయేది కాదు. అలాగే శిష్యుడు లేని గురువు కూడా శోభిల్లడు. శిష్యుడికోసం పాకులాడతాడు గురువు. ‘అవంతీ హోమం’ అని వేదంలో ఒక ప్రస్తావన ఉంది. ఇది యోగ్యులైన శిష్యుల కోసం చేస్తారు. యోగ్యులైన శిష్యులు తన దగ్గరకు వచ్చి పాఠం నేర్చుకోవాలని గురువు ఈ హోమం చేస్తాడు.
ఇది స్వార్థం కాదు, త్యాగం. కారణం తన విద్య తనతో పోకూడదు. సరస్వతి అంటే ప్రవాహం. గంగానది కళ్ళకు కనబడుతుంది, యమున కనబడుతుంది, అంతర్వాహిని అయిన సరస్వతి కనబడదు. అది అంతర్లీనంగా ప్రవహిస్తుంది. గురువు విద్య ఆ గురువుతో ఆగిపోకూడదు. ఆ గురువు హృదయాన్ని, ఉపదేశాన్ని అందిపుచ్చుకుని గురువుగారిలా తయారు కాగలిగిన శిష్యుడు దొరకాలి. దానివల్ల ఎప్పటికీ బోధ చేసే వాళ్ళుంటారు. అప్పుడే ఈ లోకానికి క్షేమం.
Comments
Please login to add a commentAdd a comment