ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి | Dharmanusaranatone lives of peace | Sakshi
Sakshi News home page

ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి

Published Thu, Sep 12 2013 11:13 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి

ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి

 సృష్టి ప్రారంభం నుండి, సృష్టికర్త మానవ మనుగడ కోసం ఒక జీవన వ్యవస్థను, ధర్మాన్ని అవతరింపజేశాడు. తన ఇష్టాన్ని, అయిష్టాన్నీ ఎరుకపరిచాడు. సాఫల్య వైఫల్యాల మార్గాలను విస్పష్టంగా తెలియజేశాడు. ఏవిధమైన జీవన విధానాన్ని అవలంబిస్తే ఇహపరలోకాల్లో సుఖశాంతులు, సంతృప్తి సాఫల్యాలు పొందవచ్చునో, ఏ విధానంలో ఇహ పర కష్టనష్టాలు, అశాంతి, అసంతృప్తులు, వైఫల్యాలు ఉన్నాయో వివరించాడు. తన మనోభీష్టాన్ని ప్రజలకు వివరించి, ముక్తి, మోక్షాల మార్గం చూపడానికి వారి నుండే ప్రవక్తలను ఎంచుకున్నాడు.

వారిపై తన ఆదేశాలను అవతరింపజేశాడు. దైవాదేశాలకనుగుణంగా, దైవ సందేశహరులు ఎప్పటికప్పుడు ప్రజలకు మార్గదర్శకం వహిస్తూ, వారిని రుజుమార్గంపై నడపడానికి ప్రయత్నించారు. దైవం, దైవప్రవక్తల ఉపదేశాలకనుగుణంగా, ధర్మానుసరణలో జీవితం గడిపినంతకాలం మానవ సమాజం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే జీవన విధానంలో అధర్మం ప్రవేశించిందో, అప్పుడే మానవాళికి కష్టాలు ప్రారంభమయ్యాయి. జీవితంలో శాంతి కరువైపోయింది.
 
ఈవిధంగా మానవులు సన్మార్గం తప్పి వక్రమార్గం పట్టినప్పుడల్లా, దైవం వారిని మళ్లీ రుజుమార్గంపైకి తీసుకురావడానికి, వారి జీవన విధానాన్ని గుర్తు చేసి వైఫల్యాల నుండి రక్షించడానికి, వారిలో నుండే ఉత్తములైన వారిని ఎంపిక చేస్తూ వచ్చాడు. దాదాపు లక్షా ఇరవైనాలుగువేలమంది మహనీయులను దైవం తన సందేశహరులుగా నియమించినట్లు ధర్మశాస్త్రగ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ పరంపరలోని చివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఈయన ద్వారా ధర్మం సంపూర్ణమైంది. ఇక ప్రళయం వరకు జన్మించే మానవులందరికీ ముహమ్మద్ ప్రవక్త (స)మార్గదర్శకత్వమే అనుసరణీయం.

ఎందుకంటే, ఈయనకంటే ముందు నియమితులైన దైవప్రవక్తలందరూ ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కాలానికో పరిమితమయ్యారు. అలాగే ఆద్ జాతి వారికి ‘హూద్’ (అ) ప్రవక్తగా నియమితులయ్యారు. అదేవిధంగా మూసా, ఈసా (అ.ముస్సలా)లు తమ తమ జాతి జనులకు మాత్రమే (ఇశ్రాయేలు సంతతి) ప్రవక్తలుగా నియమించబడ్డారు. కాని ముహమ్మద్ ప్రవక్త (స) సమస్త మానవాళికీ మార్గదర్శిగా వచ్చారు. ప్రళయకాలం వరకు వచ్చే మానవులందరికీ ఆయన కారుణ్యంగా ప్రభవించారు.

ఆయన జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శమని, సమస్త మానవాళికీ ఆయన కారుణ్యమనీ పవిత్ర ఖురాన్ స్పష్టం చేసింది. (ముహమ్మద్:) మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట కారుణ్యంగా చేసి పంపాము. (అంబియా 107)‘ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉంది’ (అహెజాబ్ 21).
 
కనుక ముహమ్మద్ ప్రవక్త (స) ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక భాష మాట్లాడే వారికో లేక ఒక కాలానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన అందరి ప్రవక్త. విశ్వజనీన ఆదర్శమూర్తి. విశ్వకారుణ్యమూర్తి. ఆయన ద్వారానే ధర్మం పరిపూర్ణమైంది. ఆయన మాటను, ఆయన బాటను అనుసరించడంలోనే మానవుల సాఫల్యం ఉంది. ఏకేశ్వరారాధనలోనే మానవుల ఇహపర సాఫల్యాలు ఉన్నాయని ముహమ్మద్ ప్రవక్త (స) స్పష్టం చేశారు. స్వార్థాన్ని వీడితేనే శాంతి దొరుకుతుందని సెలవిచ్చారు. బుద్ధిని ఉపయోగిస్తేనే నిజాలు వెల్లడవుతాయని ప్రవచించారు. అంధానుకరణ అజ్ఞానంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు.

 కాబట్టి, జీవితాల్లో సుఖశాంతులు పరిఢవిల్లాలంటే, మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి సిద్ధించాలంటే, ఇహలోకంంతోపాటు, పరలోక సాఫల్యం పొందాలంటే తు.చ. తప్పకుండా దైవధర్మాన్ని అనుసరించాలి. దైవాదేశాలు, ప్రవక్త ప్రవచనాల వెలుగులో జీవితాలను సమీక్షించుకుంటూ జీవనయానం కొనసాగించాలి. అప్పుడే శాంతి సాఫల్యాలు సొంతమవుతాయి.

 - యండి. ఉస్మాన్‌ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement