
పుట్టే రుతువునుబట్టి మనకు వచ్చే వ్యాధులు ఆధారపడి ఉంటాయా? అంటే చలికాలంలో పుడితే పెద్దయ్యాక మధుమేహం, ఆకులు రాలే కాలంలో పుడితే మనో వ్యాకులత వంటి వ్యాధులొస్తాయా? అవునని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెప్పినా.. ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. గర్భంలో ఉండగా తల్లి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల ప్రభావం బిడ్డకు వచ్చే వ్యాధులపై ఉంటుందన్నది ఈ అధ్యయనం తాలూకూ సారాంశం. మూడు దేశాల్లోని కొన్ని లక్షల మంది గర్భిణులు వారి పిల్లల ఆరోగ్య వివరాలను పరిశీలించిన తరువాత తామీ అంచనాకు వచ్చామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త నికొలస్ టాటనెట్టీ తెలిపారు. న్యూయార్క్ నగరానికి చెందిన దాదాపు 17 లక్షల మంది పిల్లల వివరాలు పరిశీలించినప్పుడు జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టిన వారికి ఉబ్బసం వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందని చెప్పారు.
అయితే వీరు గర్భంలో ఉండగా వారి తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తమకు తెలియలేదని అందువల్ల తాము అమెరికాతోపాటు దక్షిణ కొరియా, తైవాన్‌లకు చెందిన రికార్డులను పరిశీలించామని, గర్భధారణ చివరి త్రైమాసికంలో సూర్యరశ్మి తక్కువగా లభిస్తే పుట్టబోయే పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశమున్నట్లు తాము గుర్తించామని వివరించారు. న్యూయార్క్ నగరంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించిందని చెప్పారు. తొలి త్రైమాసికంలో కాలుష్యకారక ధూళికణాలు ఎక్కువగా పీలిస్తే పుట్టబోయే బిడ్డలకు గుండె సంబంధిత సమస్యలు రావచ్చునని నికొలస్ వివరించారు. ధూళి కణాల వల్ల రక్తపోటు ఎక్కువై దాని ప్రభావం పిండంపై పడటం దీనికి కారణమని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment