డయాబెటిస్ హెచ్చరించే స్నేహితుడు | Diabetes is alerting friend | Sakshi
Sakshi News home page

డయాబెటిస్ హెచ్చరించే స్నేహితుడు

Published Wed, Sep 30 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

డయాబెటిస్  హెచ్చరించే స్నేహితుడు

డయాబెటిస్ హెచ్చరించే స్నేహితుడు

డయాబెటిస్ ఉందని కుంగిపోకండి.
డయాబెటిస్‌ని కిందపడేసి తొక్కాలంటే మెట్లెక్కండి.
లిఫ్టులు ఎక్కడం మానండి.
నిజానికి డయాబెటిస్ వల్ల చాలామంది వాళ్ల జీవితాన్ని
సంతోషకరంగా మలుచుకున్నారు.
తప్పదు కాబట్టి బరువు తగ్గారు.
తప్పించుకోలేరు కాబట్టి యాక్టివ్‌గా ఉంటున్నారు.
అవసరం కాబట్టి మితంగా తింటున్నారు.
వెరసి... హెల్దీగా, చలాకీగా ఉంటున్నారు.
దృష్టికోణం మారితే లైఫ్ అందంగా ఉంటుంది.
షుగర్‌ని శాపం అనుకునే బదులు...
హెచ్చరించే ఒక స్నేహితుడు అనుకోండి.
జీవితాన్ని మన అదుపులోకి తెచ్చే
సన్నిహితుడు అనుకోండి.

 
ఒంటికి ఏమాత్రం అలసట ఇవ్వని అధునాతన సౌకర్యాల్లో లిఫ్ట్ కూడా ఒకటి. ఒక్కోసారి ఇదే మనకూ మన ఆరోగ్యానికీ మధ్య రిఫ్ట్ సృష్టిస్తుంది. మెట్లు చేసే మేలును మరచిపోయేలా చేస్తుంది. అవును. మెట్లను నమ్ముకుంటే మన ఫేసూ, ఫేటూ బ్రైటవుతాయి. హెల్త్, వెల్త్ బెటరవుతాయి. నానా సమస్యలకు దారితీసే డయాబెటిస్ వంటి జబ్బులూ అదుపులో ఉంటాయి.మీరు ఈ కథనాన్ని నింపాదిగా కూర్చొని చదువుతున్నారా? కాస్త అటూ ఇటూ నడుస్తూ చదవండి. పక్కనే ఉన్న మార్కెట్‌కు బైక్ వేసుకొని బయల్దేరుతున్నారా?  కాస్త నాలుగడుగులు వేసి నడక సాగించండి. ఒంటికి పనిచెప్పండి. చక్కెరవ్యాధి పనిపట్టండి.

 ముందుగానే గుర్తించిన భారతీయులు..
 డయాబెటిస్ మనిషితో పాటే ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు, భారతీయ ఆయుర్వేద వైద్యులు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాడే ఈ జబ్బును గుర్తించారు. ప్రాచీన భారతీయులు దీనికి ‘మధుమేహం’ అని నామకరణం చేశారు. ఆస్కార్ మిన్‌కోవ్‌స్కీ, జోసెఫ్ వాన్ మెరింగ్ అనే పాశ్చాత్య వైద్యనిపుణులు తమ పరిశోధనల్లో  పాంక్రియాస్ పనితీరులో లోపమే డయాబెటిస్‌కు కారణంగా గుర్తించారు. తమ ప్రయోగంలో ఒక కుక్కకు పాంక్రియాస్ తొలగించి దాని మూత్రాన్ని పరీక్షిస్తే అందులో చక్కెర ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఈ నిర్థారణకు వచ్చారు.

 జీవితంలో ఒత్తిడి వల్ల కూడా...
  వంశపారంపర్య కారణాల వల్ల, ఆధునిక జీవితంలోని ఒతిళ్ల వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, మితిమీరి తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రసగుల్లా, గులాబ్‌జామ్ వంటి స్వీట్లలో పంచదార పాకం అదనపు రుచిని కలిగిస్తుంది. చక్కెర ఉన్న నీరు చిక్కబడితే అది పాకం అవుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా రక్తం చిక్కబడి ప్రసరణ నెమ్మదిస్తుంది. అది పక్షవాతం, గుండెజబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. ఇంతకీ ఈ చక్కెర వ్యాధి ఎలా వస్తుంది? జీవక్రియల్లో మార్పుల వల్ల వస్తుంది. శరీరంలోని క్లోమగ్రంథి (పాంక్రియాస్) తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోయినా, పాంక్రియాస్ పనితీరు మందగించి, అది ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించకపోయినా డయాబెటిస్ వస్తుంది.

 ఎన్నో రకాలు...
 డయాబెటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది బాధపడేది మాత్రం ముఖ్యంగా మూడు రకాల డయాబెటిస్‌తోనే. ఇవి: టైప్-1, టైప్-2, జెస్టేషనల్ డయాబెటిస్. అయితే, జీవనశైలి లోపాల వల్ల ఎక్కువ మంది బాధపడే టైప్-2 డయాబెటిస్ గురించి ఈ కథనంలో చర్చిస్తున్నాం.

టైప్-2 డయాబెటిస్ దీర్ఘకాలం కొనసాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి దానంతట అదే నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతుంది. అందుకే దీనిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ లేదా అడల్డ్ ఆన్‌సెట్ డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ రోగుల్లో దాదాపు 90 శాతం మంది ఈ రకానికే చెందుతారు.

చక్కెరవ్యాధి లక్షణాలు... సమస్యలు
తలనొప్పి, కళ్లు మసకబారడం, కళ్లు తిరగడం, మెదడుకు తగినంత చక్కెర అందకపోవడంతో త్వరగా అలసిపోవడం, తరచు ఆకలి వేయడం, దాహంగా అనిపించడం, స్వల్ప వ్యవధిలోనే బరువు పెరగడం లేదా తగ్గడం, తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి.

డయాబెటిస్‌కు గురైనా, కొందరిలో వ్యాధి లక్షణాలేవీ కనిపించవు. క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితిని ప్రారంభంలోనే గుర్తించడం సాధ్యం కాదు.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తగిన పరీక్షలు చేయించుకోకుండా చికిత్స పొందకుండా వదిలేస్తే చక్కెరవ్యాధి వల్ల గుండెజబ్బులు, పక్షవాతం, అంధత్వం వంటి ప్రమాదకర పరిస్థితులతో పాటు మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు, ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. చక్కెర వ్యాధితో బాధపడేవారికి పొరపాటున గాయాలైతే త్వరగా మానవు. ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తే, గాయమైన అవయవాన్ని పూర్తిగా తొలగించాల్సిన (యాంప్యుటేషన్) పరిస్థితి తలెత్తవచ్చు.

చక్కెరవ్యాధిని పరీక్షల ద్వారా తెలుసుకోవడం ఎలా?
చక్కెర వ్యాధిని గుర్తించడానికి ముఖ్యంగా మూడు రకాల రక్తపరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు, వాటి వివరాలు...
ఫాస్టింగ్ సుగర్ టెస్ట్: కనీసం ఎనిమిది గంటలు ఏమీ తినకుండా ఈ పరీక్ష జరిపించుకోవాలి. ఈ పరీక్షలో రక్తంలో చక్కెర 70-100 స్థాయిలో ఉంటే సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. ఫాస్టింగ్‌లో రక్తంలో చక్కెర 100-126 లోపు, పోస్ట్ లంచ్ 140-180 లోపు ఉంటే అది డయాబెటిస్ వచ్చేందుకు ముందు దశ (ప్రీ డయాబెటిక్ స్టేజ్) గా పేర్కొంటారు. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర తర్వాత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో రక్తంలో చక్కెర 140 కంటే మించకూడదు. ర్యాండమ్ సుగర్ టెస్ట్: తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా బ్లడ్ సుగర్ పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) కూడా చేస్తారు.      హెచ్‌బీఏ1సీ అనే పరీక్ష ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిని మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో కొలత 6 లోపు ఉండాలి.ఇప్పుడు ఇంట్లోనే రక్తపరీక్షలు జరుపుకొనేందుకు చేతిలో ఇమిడిపోయే కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఖర్చు తక్కువే: కేవలం లక్షణాల ఆధారంగానే చక్కెర వ్యాధిని గుర్తించలేము. అందువల్ల దగ్గర్లోని ల్యాబ్‌లలో గానీ, ప్రభుత్వాసుపత్రుల్లో గానీ కనీసం ఆరు నెలలకు ఒకసారైనా రక్తపరీక్ష జరిపించుకోవడం మంచిది. ఇప్పుడు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ వంటి చక్కెరకు సంబంధించిన ప్రాథమిక  పరీక్షలు డయాగ్నస్టిక్ ల్యాబ్స్‌లో రూ. 200 లోపే లభ్యమవుతున్నాయి. ఇక ఆర్నెల్లకు ఒకసారి చేయించాల్సిన అన్ని రకాల పెద్ద పరీక్షలనూ కలుపుకొని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు రూ. 1500 నుంచి రూ. 2000 లకు ప్రత్యేక ఆఫర్లలో చేస్తుంటారు.

జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి
డయాబెటిస్ ఉన్నట్లుగా వైద్య పరీక్షల్లో తేలితే వెంటనే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి కూడా చక్కెర జబ్బును నియంత్రణలో ఉంచుతాయి.రక్తంలో చక్కెరస్థాయి సాధారణ స్థితిలో ఉంచుకునేందుకు వైద్యుల సలహాపై క్రమం తప్పకుండా తగిన మందులు వాడుతూ ఉండాలి.  అదనపు బరువు ఉంటే అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రశాంతంగా కంటినిండా నిద్రపోవాలి.  అరుదైన పరిస్థితుల్లో తప్ప సాధారణంగా వచ్చే డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. డయాబెటిస్ వచ్చాక ఆరోగ్యకరమైన అలవాట్లతో దీనిని నియంత్రించుకోవడం తప్ప మార్గం లేదు.

 - ఇన్‌పుట్స్: డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
 కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్
 అండ్ డయాబెటిస్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
 
టైప్-1 డయాబెటిస్
ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. జన్యులోపం వల్ల వస్తుంది. పిల్లల్లోని రోగనిరోధక వ్యవస్థ పాంక్రియాస్‌లోని బీటా సెల్స్‌ను పరాయి కణాలుగా ఎంచి నాశనం చేయడంతో ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. దీనిని జువెనైల్ డయాబెటిస్ అని కూడా అంటారు. అయితే, కొందరికి ఎదిగిన తర్వాత కూడా టైప్-1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీనికి వైద్యుల పర్యవేక్షణలో నిత్యం ఇన్సులిన్ తీసుకోవడమే ఏకైక మార్గం. ఇక జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

కొన్ని అరుదైన రకాలు...
డయాబెటిస్‌లో ‘మోడీ’(కైఈ్గ)... మెచ్యూరిటీ ఆన్‌సెట్ ఆఫ్ ద డయాబెటిస్ ఇన్ ద యంగ్, ‘లాడా’ (ఔఅఈఅ)... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ వంటి కొన్ని అరుదైన రకాలూ ఉన్నాయి. ఇందులో మొదటిది 30 ఏళ్లలోపు వాళ్లలో ఎక్కువ.
 
ఎలా నియంత్రించవచ్చు..?
ఎక్కువ మందిలో కనిపించే టైప్-2 డయాబెటిస్‌ను కొద్దిపాటి జాగ్రత్తలతో నియంత్రించుకోవచ్చు.ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, శరీరం బరువు సాధారణ స్థాయికి మించి పెరగకుండా చూసుకోవడం వంటి తేలికపాటి జాగ్రత్తలతో దీని బారిన పడకుండా చూసుకోవచ్చు.ఒకేసారి ఎక్కువ మోతాదులో తినే బదులు, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. ఇలా తినే ఆహారంలో తప్పనిసరిగా పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.కొవ్వుల్లో చేటు చేసే కొవ్వులుంటాయి. వాటిని లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ (ఎల్‌డీఎల్) అంటారు. వేటమాంసం (రెడ్ మీట్), వెన్న, నెయ్యి వంటి జంతు సంబంధిత కొవ్వులను చెడు కొవ్వుపదార్థాలుగా పరిగణిస్తారు. డయాబెటిస్ బారిన పడినవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
     
మంచి కొవ్వులను  హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ (హెచ్‌డీఎల్) అంటారు.గుడ్లలో ఉండే తెలుపుసొన, చేపలు, అవిసెగింజలు, వాల్‌నట్స్, శాకాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.     చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు, పొటాటో చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా రక్తంలో చక్కెరల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.చక్కెర, ఉప్పు, మైదాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా చక్కెరజబ్బును అదుపు చేయవచ్చు.
 
నికోటిన్ - డయాబెటిస్

పొగతాగేవారిలో నికోటిన్‌తో పాటు కాడ్మియం వంటి భారలోహాలు రక్తనాళల్లోకి చేరతాయి. అవి రక్తనాళాలల్లోని లోపలి పొరను నష్టపరిచి జీవక్రియల తీరును (మెటబాలిజమ్‌ను) దెబ్బతీసి, డయాబెటిస్‌కు దారితీయవచ్చు. పొగతాగేవారిలో రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తంలో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యల వల్ల గుండెజబ్బులు తద్వారా అవి డయాబెటిస్‌కు దారితీయవచ్చు. లేదా డయాబెటిస్ ఉన్నప్పుడు గుండెజబ్బులు రావచ్చు. కాబట్టి డయాబెటిస్ వచ్చినవారిలో గుండెజబ్బు లేకపోయినా... అది ఉన్నట్లుగా పరిగణించి డాక్టర్లు  అవసరమైన జీవనశైలి మార్పులు సూచిస్తారు.

డయాబెటిక్ సెలిబ్రిటీలు
డయాబెటిస్ అంటే యాక్టివ్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ కాదు. డయాబెటిస్ ఉన్నా చాలామంది సెలిబ్రిటీలు తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. భారతీయ నటీనటులు కమల్ హాసన్, సుధాచంద్రన్, సోనమ్ కపూర్, సమంతా, ‘ఆస్కార్’నటి హాలీ బెరీ, హాలీవుడ్ నటి సల్మా హయక్, పాకిస్తానీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ వంటి వాళ్లు డయాబెటిస్ బాధితులే. జీవనశైలిని మరింత చురుకుగా మార్చుకోవడం ద్వారా వీరంతా ఈ సమస్యను విజయవంతంగా నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement