ఈస్టర్ ఫీస్ట్ | Easter Feast | Sakshi
Sakshi News home page

ఈస్టర్ ఫీస్ట్

Published Fri, Apr 3 2015 10:01 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

ఈస్టర్ ఫీస్ట్

ఈస్టర్ ఫీస్ట్

క్రీస్తు మన కోసం ఈ భూమి మీద జన్మించాడు. మన పాప పరిహారార్థం శిలువపై మరణించి తిరిగి లేచాడు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఎన్నో దారులున్నాయి. వాటిలో ఒకటి... నోరు తీపి చేయడం. గుండెల్లోని ఆనందాన్ని గొంతు ద్వారా జారే తీపి రెట్టింపు చేస్తుంది. కాబట్టి మరోసారి తీయగా పండుగ చేసుకుందాం. ఈస్టర్ సంబరానికి సరికొత్త రుచులను అద్దుదాం!  ఆనందంగా ఆస్వాదిద్దాం!!
 
డేట్స్ కేక్
 
కావలసినవి: మైదాపిండి - 1 కప్పు, తాజా ఖర్జూరాలు - అరకప్పు, చక్కెర - ముప్పావు కప్పు (తీపి తక్కువ కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు), పాలు - ముప్పావు కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ పౌడర్ - 1 చెంచా, దాల్చినచెక్క పొడి - అరచెంచా, లవంగాల పొడి - అరచెంచా, ఎండబెట్టి దంచిన అల్లం పొడి - చిటికెడు, తరిగిన జీడిపప్పు - 4 చెంచాలు
 
తయారీ:


ముందుగా గింజలు తీసేసిన ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి (కావాలంటే కొద్దిగా నీళ్లుకానీ పాలుకానీ చేర్చుకోవచ్చు); ఓ బౌల్‌లో మైదాపిండితో పాటు పాలు, చక్కెర, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, అల్లం పొడి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి; తర్వాత ఖర్జూరం పేస్ట్‌తో పాటు తరిగిన జీడిపప్పు కూడా వేసి కలపాలి; చివరగా నూనె వేసి బాగా మిక్స్ చేయాలి; తర్వాత కేక్ గిన్నెకు నూనె కానీ వెన్న కానీ రాసి, మిశ్రమాన్ని అందులో వేసుకుని, 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద 30 నుంచి 40 నిమిషాల పాటు అవన్‌లో బేక్ చేసుకోవాలి. అవన్ లేనివాళ్లు కేక్ గిన్నెలో స్టౌమీద పెట్టి చేసుకోవచ్చు. అయితే స్టౌపై చేసినప్పుడు మిశ్రమం గిన్నెలో వేశాక పైన కాస్త వెన్నను వేస్తే, పైభాగం కూడా సాఫ్ట్‌గా వస్తుంది; కేక్ తయారైన తర్వాత ఖర్జూరపు ముక్కలతో అలంకరించుకుంటే అందంగా ఉంటుంది.
 
క్యారెట్ కప్‌కేక్స్

 
కావలసినవి: మైదా - 1 కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, కోడిగుడ్లు - 2, క్యారెట్ తురుము - అరకప్పు, బటర్ - పావుకప్పు, బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, డ్రై ఫ్రూట్స్ - కావలసినన్ని
 
తయారీ: కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి; ఓ బౌల్‌లో మైదాపిండిని తీసుకుని, ఉండలు లేకుండా పొడిపొడిగా చేసుకోవాలి; ఇందులో చక్కెర, బటర్, కోడిగుడ్డు సొన వేసి జారుడుగా కలుపుకోవాలి; తర్వాత బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, క్యారెట్ తురుము, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి; మైక్రో అవన్‌ని 350 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి; కప్‌కేక్ మౌల్డ్స్‌లో మిశ్రమాన్ని వేసి (మౌల్డ్‌లో సగమే వేయాలి. లేదంటే పిండి పొంగి బయటకు వచ్చేస్తుంది) అవన్‌లో పెట్టి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
 
కేక్ క్రీమ్ ఎలా  తయారు చేయాలంటే...

 
 ఓ బౌల్‌లో బటర్‌ను, క్రీమ్‌ను తీసుకుని బాగా బీట్ చేయాలి. తర్వాత  ఐసింగ్ షుగర్, కొద్దిగా పాలు కలిపి మళ్లీ బీట్ చేయాలి. చివరగా కావలసిన ఎసెన్స్‌ను కలిపి, ఐసింగ్ బ్యాగ్‌లో వేసి నచ్చినట్టుగా కేక్‌ను అలంకరించు కోవాలి.
 
హోల్‌వీట్ బనానా కేక్
 
కావలసినవి: గోధుమపిండి - 2 కప్పులు, చక్కెర - 2 కప్పులు, బాగా పండిన అరటిపండ్లు - 4, కోడిగుడ్లు - 2, పాలు - 4 చెంచాలు, బటర్ - 2 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా, బేకింగ్ పౌడర్ - అరచెంచా, నూనె - 1 చెంచా, తరిగిన జీడిపప్పు - 1 చెంచా, తరిగిన పిస్తా - 1 చెంచా, కిస్‌మిస్ - కావలసినన్ని

తయారీ: కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పక్కన ఉంచుకోవాలి; చక్కెరను మెత్తని పొడిలా చేసుకోవాలి; ఓ బౌల్‌లో అరటిపండ్లను వేసి, మెత్తని గుజ్జులా చిదుముకోవాలి; తర్వాత ఇందులో గోధుమపిండి, చక్కెరపొడి, బటర్, వెనిల్లా ఎసెన్స్, పాలు, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి; చివరగా జీడిపప్పు, పిస్తా, కిస్‌మిస్‌లు వేసి కలపాలి; కేక్ గిన్నెకు నూనె రాసి, ఆపైన మిశ్రమాన్ని వేసి, గిన్నె అంతా పరుచుకునేలా సర్ది, అవన్లో పెట్టి బేక్ చేసు కోవాలి. కావాలంటే బ్రెడ్ మౌల్డ్‌లో వేసి చేసుకుని, స్లైసెస్‌లా కట్ చేసుకోవచ్చు.
 
మార్బుల్ కేక్
 

కావలసినవి: మైదా - అరకప్పు, చక్కెర - అరకప్పు, నెయ్యి - అరకప్పు, కోడిగుడ్లు - 2, కోకో పౌడర్ - 3 చెంచాలు, బటర్ - 1 చెంచా, బేకింగ్ పౌడర్ - అర చెంచా, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా

తయారీ: ముందుగా బేకింగ్ డిష్‌కి బటర్‌రాసి, దానిమీద పిండిని చల్లాలి. తర్వాత గిన్నెని బోర్లించి అంటుకోకుండా ఉన్న పిండిని దులిపేయాలి; కోడిగుడ్లలోని తెల్లసొనని, పచ్చసొనని వేరు చేసి పెట్టుకోవాలి; చక్కెరను పొడి చేసుకోవాలి; మైదాలో బేకింగ్ పౌడర్ కలిపి పక్కనుంచాలి; ఇప్పుడు ఒక బౌల్‌లో నెయ్యి తీసుకుని, చక్కెర పొడి వేసి పూర్తిగా కరిగిపోయేవరకూ కలుపుతూ ఉండాలి; తర్వాత ఇందులో కోడిగుడ్డు తెల్లసొనను వేసి గిలకొట్టాలి; తెల్లని నురుగు వచ్చిన తర్వాత పచ్చసొనను కూడా వేసి గిలకొట్టాలి; ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి; ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకుని... ఓ భాగంలో వెనిల్లా ఎసెన్స్, మరో భాగంలో కోకో పౌడర్ కలపాలి; కేక్‌గిన్నెలో ముందుగా వెనిల్లా కలిపిన మిశ్రమం, తర్వాత కోకో పౌడర్ కలిపిన మిశ్రమం, ఆపైన మళ్లీ వెనిల్లా కలిపిన మిశ్రమం... ఇలా రెండు మిశ్రమాలనూ పొరలు పొరలుగా వేసుకుంటూ పోవాలి; తర్వాత ఓ ఫోర్క్ తీసుకుని, మొత్తం మిశ్రమాన్ని మెల్లగా కలపాలి. అలా అని మరీ ఎక్కువగా కలపకూడదు. రెండు మిశ్రమాలూ కొంచెం కలిస్తే చాలు; ఇప్పుడు గిన్నెను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న మైక్రో అవన్‌లో పెట్టి, 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
 
కర్టెసీ: నియాప్రకాశ్, ఫుడ్ బ్లాగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement