Easter Feast
-
ఈస్టర్ ఫెస్టివల్.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ జీసస్ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. -
ఈస్టర్ సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. #HappyEaster — YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2022 ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: క్రైస్తవులకు సీఎం కె.చంద్రశేఖర్ రావు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగనిరతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళికి అనుసరణీయమని పేర్కొన్నారు. చదవండి: (టెలీమెడిసిన్ సేవల్లో నంబర్‌వన్‌గా ఏపీ) -
నయనతార- విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్థం.. ఇదిగో సాక్ష్యం
ఇటీవల నయనతార చేతికి ప్లాటినమ్ రింగ్ ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘వేలితో పాటు ప్రాణాన్ని కూడా చేర్చి’ అని విఘ్నేష్ శివన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ నిశ్చితార్థం అయిందని ఆ ఫొటో స్పష్టం చేసింది. తాజాగా విఘ్నేష్ మరో ఫొటోను షేర్ చేశారు. ఈస్టర్ పండగ సందర్భంగా దిగిన ఫొటో ఇది. ‘‘ఈస్టర్ డే.. హ్యాపీ డే’’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ చేశారు విఘ్నేష్. ఆదివారం ఈ జంట ఆనందంగా పండగ జరుపుకుంది. ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమగా చూస్తున్న ఈ ఫొటోకు బోలెడన్ని లైక్స్ పడ్డాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం
‘మృతులుండే సమాధిలో యేసుక్రీస్తును వెదకడానికి వచ్చారా? ఆయన ఇక్కడ లేడు, సజీవుడయ్యాడు. తన వారిని కలుసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన్ను శుక్రవారం ఇదే సమాధిలో పడుకోబెట్టగా, ఇపుడు ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కావాలంటే చూడండి’ అంటూ ఖాళీ సమాధిలో ఉన్న ఒక దేవదూత, ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామునే ప్రభువు దేహానికి పరిమళ క్రియలు సంపూర్తి చేసేందుకు వచ్చిన యేసు తల్లి మరియకు, సలోమి అనే మరొక స్త్రీకి, ప్రభువు శిష్యురాలైన మగ్దలేనే మరియకు ఇంకా ఇతర స్త్రీలకు ఆనాటి ‘బ్రేకింగ్ న్యూస్’ ప్రకటించాడు. అది విని స్త్రీలంతా విస్మయమొంది భయంతో వణుకుతూ పారిపోయారు. అయితే సజీవుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఆ రోజే మొట్టమొదట కనిపించి, తన పునరుత్థాన శుభవార్తను తన శిష్యులకు ప్రకటించమని ఆదేశించాడు. అయితే యేసు మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శిష్యులకు ఇది నమ్మశక్యంగా కనిపించలేదు. అందువల్ల వాళ్లంతా భోజనానికి కూర్చున్న సమయంలో యేసుప్రభువు వారిమధ్య ప్రత్యక్షమై, వారి అపనమ్మకాన్ని బట్టి వారిని మందలించి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తన పునరుత్థాన క్షమా శుభవార్తను ప్రకటించమని ఆదేశించాడు (మార్కు 16:1–10). అందువల్ల క్రైస్తవానికి పునాది యేసుప్రభువు పునరుత్థానమే!! ప్రపంచంలోని అతి చిన్నదైన ఇజ్రాయేలు అనే దేశంలోని యూదయ అనే ఒక మూలన ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు దైవకుమారుడుగా జన్మించి, ఒక సాధారణ మానవుడుగా అయినా ఏ లోపమూ లేని పాపరహితమైన సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్ళపాటు సామాన్యులు, నిరుపేదలు, నిరక్షరాస్యులైన అతి సాధారణ ప్రజలతో మమేకమై జీవించిన యేసుక్రీస్తు ప్రబోధాలు, విలక్షణమైన ఆయన దైవికత మూల స్తంభాలుగా ఆరంభమైన ‘క్రైస్తవం’ అతి కొద్దికాలంలోనే అనేక ప్రపంచ దేశాలకు పాకి అనేక ప్రపంచ నాగరికతల్ని ప్రభావితం చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, కరడుగట్టిన హింసాత్మకతకు పుట్టినిల్లుగా మారిన లోకానికి ప్రేమ, సాత్వికత్వం, దీనత్వం, సమన్యాయం, క్షమాభావనల సౌరభాలనద్ది, కోట్లాదిమంది అనామకులకు ఉనికినిచ్చిన ఒక ఆత్మీయవిప్లవమైంది. క్రైస్తవం స్పృశించిన ప్రతి జీవి, నేల పరివర్తన నొంది పులకరించింది. ఈస్టర్ పండుగ అంటే, ఈ లోకం సిలువ వేసి చంపిన ఒక మహనీయుడు తిరిగి సజీవుడయ్యాడని సంబరపడే సందర్భం మాత్రమే కాదు, హింసకు ప్రతి హింసే జవాబని మాత్రమే తెలిసిన లోకానికి, క్రీస్తు జీవితంలో పరిఢవిల్లిన క్షమాపణను, ప్రేమను పరిచయం చేసి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన శుభారంభపు తొలి దినమది. రెండు రోజుల ముందే సిలువలో యేసు ప్రభువు మీద ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కనీ వినీ ఎరుగని దౌర్జన్యం, దమనకాండ, హింస ఆయన ప్రేమ, క్షమాపణ శక్తి ముందు నిర్వీర్యమై ఓటమి పాలయ్యాయని లోకానికి ప్రకటితమైన రోజు అది. అది సమాప్తమే... కాని అంతం కాదు... శుక్రవారం నాటి యేసు సిలువ యాగం విషాదంతో సమాప్తమైంది. అయితే ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్థానంతో లోకంలో ‘క్షమాయుగపు’ శుభారంభం జరిగింది. మానవాళిని తన అపారమైన కృపలో భాగం చేసుకోవాలన్న దేవుని అనాది సంకల్పం, అలా దౌర్జన్యం, దుర్మార్గం పైన యేసు సిలువ బలియాగం ద్వారా ఘన విజయం సాధించి క్రైస్తవానికి బీజాలు వేసింది. శుభ శుక్రవారం నాడు సిలువలో, ఈస్టర్ ఆదివారం నాడు యేసు పునరుత్థానంతో ఖాళీ అయిన రాతి సమాధిలో దేవుని ప్రేమ, క్షమాపణ పునాదులుగల దేవుని రాజ్యం వెల్లివిరిసింది. ఆయన్ను సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రోమా సామ్రాజ్యం ఆ తరువాత మూడొందల ఏళ్లకే పతనమై భూస్థాపితమైంది. కానీ నాటి సిలువలో, ఖాళీ సమాధిలో అంకురార్పణ జరిగిన దేవుని క్షమారాజ్యం ఈ రెండువేల ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది, కోట్లాదిమందికి ఆశీర్వాదాల్ని ప్రసాదిస్తూనే. ఆరున్నర అడుగుల ప్రభువు యూదుల అత్యున్నత చట్టసభ సన్ హెడ్రిన్లో సభ్యుడైన అరిమతై యోసేపు తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో శుభ శుక్రవారం నాటి సాయంత్రం యేసుప్రభువు పార్థివ దేహాన్ని ఖననం చేశారని బైబిల్ పేర్కొంటోంది (మత్తయి 27:57–60, యోహాను 19:41). ప్రభువు సమాధి ఒక తోటలో ఉండిందని కూడా యోహాను సువార్త పేర్కొంది (19:41). పైగా యెరూషలేములో హీబ్రు భాషలో ‘గొల్గొతా’ అని, లాటిన్ భాషలో ‘కల్వరి’ అని పిలిచే కపాలం లాగా కనిపించే ఒక కొండకు దగ్గరలో ఆయన్ను సిలువ వేశారని, దానికి దగ్గరలోని ఒక తోటలోనే ఆయన సమాధి ఉందని కూడా బైబిల్ పేర్కొంది. ఈ ఆనవాళ్ళంటికీ సరిపోలిన ఆయన సమాధి స్థలం కోసం చరిత్రలో పురాతత్వశాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు చేసిన ఎంతో అన్వేషణ, పరిశోధనలు ఫలించి ‘గార్డెన్ టూంబ్’గా పిలిచే ఒక రాతి సమాధి యెరూషలేము పట్టణంలో దమస్కు ద్వారానికి దగ్గరలో బయటపడింది. బైబిల్ పురాతత్వ పరిశోధనలకు పితామహుడుగా పేర్కొన దాగిన ఎడ్వర్డ్ రాబిన్సన్ అనే అమెరికన్ చరిత్రకారుడు 1852 దాకా చేసిన తన పరిశోధనల సారాంశాన్నంతా ‘బిబ్లికల్ రీసెర్చ్ ఇన్ పాలస్తీనా’ అనే పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించడంతో ఈ సమాధి విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి ‘గార్డెన్ టూంబ్’ అనే ఈ సమాధి స్థలం క్రైస్తవ పర్యాటకులకు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ తెగకు చెందిన వారికి దర్శనీయ స్థలమైంది. ఈ తోట భూగర్భంలో బయటపడిన బ్రహ్మాండమైన ఒక రాతి నీటి తొట్టి, ఒక పెద్ద ఒలీవ నూనె గానుగ ఒకప్పుడు అదొక ఆలివ్ తోట అని చెప్పడానికి రుజువులయ్యాయి. గొప్ప విశేషమేమిటంటే, ఆ సమాధిని అరిమతై యోసేపు తన కోసం తన ఎత్తు ప్రకారంగా తొలిపించుకున్నాడు. కాని అనుకోకుండా యేసుప్రభువును అందులో పడుకోబెట్టినపుడు, ఆ భాగం యేసుప్రభువు ఎత్తుకు సరిపోలేదు. అందువల్ల ఆయన కాళ్ళుండిన స్థలంలో సమాధి రాతి గోడను నాలుగంగుళాలపాటు అప్పటికప్పుడు తొలిపించిన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి యేసుప్రభువు ఎత్తు ఆరడుగుల ఐదంగుళాలకు పైనే ఉంటుందని అంచనా వేయవచ్చు. పైగా ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన అతి పెద్ద రాయిని మనకోసం ఎవరు తొలగిస్తారంటూ ప్రభువు అనుచరులైన మగ్దలేనే మరియ తదితర స్త్రీలు ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి వద్దకు వెళ్తూ మాట్లాడుకున్నట్టు బైబిల్లో చదువుతాము. నాడు సమాధికి అడ్డంగా ఐదడుగుల ఎత్తు రెండు టన్నుల బరువున్న ఒక గుండ్రటి రాయిని పెట్టారన్నది, ఇపుడా సమాధి ద్వారం వద్ద దాన్ని దొర్లించడానికి చేసిన రాతి కాలువలాంటి స్థలాన్ని బట్టి అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సువార్త ప్రబోధకులు -
మరణాన్ని మట్టికరిపించిన మహోదయం!!
శుభశుక్రవారపు మరుసటి ఆదివారం ఇంకా తెల్లారక ముందే. జెరూసలేం డేట్ లైన్ తో మగ్దలేనే మరియ అనే శిష్యురాలు యేసుక్రీస్తు సజీవుడయ్యాడంటూ ఆయన పునరుత్థాన శుభవార్తను ప్రపంచానికి ‘అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్’ గా ప్రకటించింది. ఈ శుభవార్త ప్రబలి, యేసు మరణంతో విషాదంలో ఉన్న ఆయన అనుచరుల్లో పుట్టెడు ఆనందాన్ని నింపింది. కానీ యేసును చంపి తామేదో గొప్ప విజయం సాధించామని విర్రవీగుతున్న ఆయన శత్రువుల గుండెల్లో మాత్రం అది రైళ్లు పరుగెత్తించి ‘నష్టనివారణ’ చర్యలకు వారిని పురికొల్పింది. యేసు సిలువలో అసలు చనిపోనే లేదని, కేవలం మూర్ఛపోయిన యేసు స్పృహలోకొచ్చి నడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయాడని కొందరు, అసలు యేసు అనే వ్యక్తే చరిత్రలోనే లేడని, ఆయన బోధలు, జీవితం, మరణం, పునరుత్థానం ఇదంతా కట్టుకథ అని మరికొందరు అబద్ధాలు ప్రచారం చేసినా, యేసు పునరుత్థానుడయ్యాడన్న ‘సత్యం’ వెయ్యింతల బలంతో అచిరకాలంలోనే ప్రబలి, ఆయన పునరుత్థానమే పునాదిగా ‘క్రైస్తవం’ భూదిగంతాలకు వ్యాపించింది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడం మనుషులకు కొత్త, ఒక వింత కావచ్చు కానీ, జనన మరణాలకు అతీతుడైన దేవునికి కాదు కదా? మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, విశ్వానికంతటికీ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా, రక్షకుడుగా ’పుట్టి’, ’మరణించి’, ‘పునరుత్థానుడై’ ఉండకపోతే దేవుని సరిగ్గా, పూర్తిగా అర్థం చేసుకోవడం మనిషికి అసాధ్యమే. దేవుడేమిటో అర్థమయితేనే, ఆయన దృష్టిలో ఒక నలుసంత కూడా లేని మానవుణ్ణి దేవుడు ప్రేమించడమెంత గొప్ప విషయమో అర్ధమవుతుంది. ఊరికే దేవుడూ, దేవుడూ అంటాం కానీ ఆ దేవుణ్ణి తెలుసుకునే స్థాయి మనిషిది కాదు. అందుకే మనిషిలో ఇంత మిడిసిపాటు, డాంబికం!! తన ప్రేమ మనిషికర్థమయ్యే రూపంలో, యేసుక్రీస్తుగా దేవుడు ఈ భూగ్రహాన్ని దర్శించేందుకు పుట్టి, చనిపోయి, పునరుత్థానుడై మానవాళిని తన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించి వారికి తనదైన శాశ్వతత్వాన్నిచ్చేందుకు ఈ విశ్వంతో సంబంధమే లేని ఒక పరలోకరాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. దేవుడు విశ్వాన్నంతా సృష్టించి, మనిషిని మాత్రం తన అద్భుతమైన స్వరూపంలో చేసి, అతన్ని ఈ విశ్వాన్ని ఏలే రాజుగా నియమించాడని బైబిల్ చెబుతోంది(ఆది 1:28). అలా ప్రేమ, క్షమాపణ వంటి దైవిక స్వభావ లక్షణాలతో వర్ధిల్లి విశ్వాన్ని మనిషి తన గుప్పిట్లో పెట్టుకోవాలని దేవుడాశిస్తే, దారితప్పి స్వార్థపరుడైన మనిషి ఈ విశ్వానికి సమాంతరంగా ఒక ‘డబ్బు ప్రపంచాన్ని’ నిర్మించుకొని క్రమంగా దానికి దాసుడయ్యాడు. ఒక రాజుగా విశ్వాన్ని ఏలాల్సిన మనిషి చివరికి కంటికి కనిపించని వైరస్ క్రిములకు కూడా గడగడలాడే ఇప్పటి దీనస్థితిని కొని తెచ్చుకున్నాడు. ప్రపంచమంతా ఎంతో కల్లోల భరితంగా ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో, మానవాళి పట్ల దేవుని శాశ్వతమైన ప్రేమను, ఔన్నత్యాన్ని, ప్రణాళికలను గుర్తు చేసేదే యేసుపునరుత్థాన పర్వదినం... హేపీ ఈస్టర్... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మిషెల్ బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: ఈస్టర్ పండగ జరుపుకునేందుకు వారం పాటు బెయిల్ ఇవ్వాలం టూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభ కోణంలో నిందితుడు క్రిస్టియన్ మిషెల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో అతడు తప్పించుకు పోయేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాల తీవ్రత దృష్ట్యా మిషెల్‌కు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక జడ్జి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. అగస్టా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసినందున సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం లేదని, అధికారుల విచారణకు మిషెల్ సహకరిస్తున్నాడని అతని లాయర్ తెలిపారు. ‘ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్రైస్తవులకు పవిత్ర వారం, 21న ఈస్టర్ పండగ. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మిషెల్‌కు వారం పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. దీనిపై ఈడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉండి కూడా మిషెల్ పండగ జరుపుకోవచ్చని అన్నారు. -
ఈస్టర్ ఫీస్ట్
క్రీస్తు మన కోసం ఈ భూమి మీద జన్మించాడు. మన పాప పరిహారార్థం శిలువపై మరణించి తిరిగి లేచాడు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఎన్నో దారులున్నాయి. వాటిలో ఒకటి... నోరు తీపి చేయడం. గుండెల్లోని ఆనందాన్ని గొంతు ద్వారా జారే తీపి రెట్టింపు చేస్తుంది. కాబట్టి మరోసారి తీయగా పండుగ చేసుకుందాం. ఈస్టర్ సంబరానికి సరికొత్త రుచులను అద్దుదాం! ఆనందంగా ఆస్వాదిద్దాం!! డేట్స్ కేక్ కావలసినవి: మైదాపిండి - 1 కప్పు, తాజా ఖర్జూరాలు - అరకప్పు, చక్కెర - ముప్పావు కప్పు (తీపి తక్కువ కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు), పాలు - ముప్పావు కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ పౌడర్ - 1 చెంచా, దాల్చినచెక్క పొడి - అరచెంచా, లవంగాల పొడి - అరచెంచా, ఎండబెట్టి దంచిన అల్లం పొడి - చిటికెడు, తరిగిన జీడిపప్పు - 4 చెంచాలు తయారీ: ముందుగా గింజలు తీసేసిన ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి (కావాలంటే కొద్దిగా నీళ్లుకానీ పాలుకానీ చేర్చుకోవచ్చు); ఓ బౌల్లో మైదాపిండితో పాటు పాలు, చక్కెర, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి, అల్లం పొడి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి; తర్వాత ఖర్జూరం పేస్ట్‌తో పాటు తరిగిన జీడిపప్పు కూడా వేసి కలపాలి; చివరగా నూనె వేసి బాగా మిక్స్ చేయాలి; తర్వాత కేక్ గిన్నెకు నూనె కానీ వెన్న కానీ రాసి, మిశ్రమాన్ని అందులో వేసుకుని, 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద 30 నుంచి 40 నిమిషాల పాటు అవన్లో బేక్ చేసుకోవాలి. అవన్ లేనివాళ్లు కేక్ గిన్నెలో స్టౌమీద పెట్టి చేసుకోవచ్చు. అయితే స్టౌపై చేసినప్పుడు మిశ్రమం గిన్నెలో వేశాక పైన కాస్త వెన్నను వేస్తే, పైభాగం కూడా సాఫ్ట్‌గా వస్తుంది; కేక్ తయారైన తర్వాత ఖర్జూరపు ముక్కలతో అలంకరించుకుంటే అందంగా ఉంటుంది. క్యారెట్ కప్‌కేక్స్ కావలసినవి: మైదా - 1 కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, కోడిగుడ్లు - 2, క్యారెట్ తురుము - అరకప్పు, బటర్ - పావుకప్పు, బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, డ్రై ఫ్రూట్స్ - కావలసినన్ని తయారీ: కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి; ఓ బౌల్లో మైదాపిండిని తీసుకుని, ఉండలు లేకుండా పొడిపొడిగా చేసుకోవాలి; ఇందులో చక్కెర, బటర్, కోడిగుడ్డు సొన వేసి జారుడుగా కలుపుకోవాలి; తర్వాత బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి, క్యారెట్ తురుము, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి; మైక్రో అవన్ని 350 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి; కప్‌కేక్ మౌల్డ్స్‌లో మిశ్రమాన్ని వేసి (మౌల్డ్‌లో సగమే వేయాలి. లేదంటే పిండి పొంగి బయటకు వచ్చేస్తుంది) అవన్లో పెట్టి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కేక్ క్రీమ్ ఎలా తయారు చేయాలంటే... ఓ బౌల్లో బటర్‌ను, క్రీమ్‌ను తీసుకుని బాగా బీట్ చేయాలి. తర్వాత ఐసింగ్ షుగర్, కొద్దిగా పాలు కలిపి మళ్లీ బీట్ చేయాలి. చివరగా కావలసిన ఎసెన్స్‌ను కలిపి, ఐసింగ్ బ్యాగ్‌లో వేసి నచ్చినట్టుగా కేక్‌ను అలంకరించు కోవాలి. హోల్‌వీట్ బనానా కేక్ కావలసినవి: గోధుమపిండి - 2 కప్పులు, చక్కెర - 2 కప్పులు, బాగా పండిన అరటిపండ్లు - 4, కోడిగుడ్లు - 2, పాలు - 4 చెంచాలు, బటర్ - 2 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా, బేకింగ్ పౌడర్ - అరచెంచా, నూనె - 1 చెంచా, తరిగిన జీడిపప్పు - 1 చెంచా, తరిగిన పిస్తా - 1 చెంచా, కిస్మిస్ - కావలసినన్ని తయారీ: కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పక్కన ఉంచుకోవాలి; చక్కెరను మెత్తని పొడిలా చేసుకోవాలి; ఓ బౌల్లో అరటిపండ్లను వేసి, మెత్తని గుజ్జులా చిదుముకోవాలి; తర్వాత ఇందులో గోధుమపిండి, చక్కెరపొడి, బటర్, వెనిల్లా ఎసెన్స్, పాలు, బేకింగ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి; చివరగా జీడిపప్పు, పిస్తా, కిస్మిస్లు వేసి కలపాలి; కేక్ గిన్నెకు నూనె రాసి, ఆపైన మిశ్రమాన్ని వేసి, గిన్నె అంతా పరుచుకునేలా సర్ది, అవన్లో పెట్టి బేక్ చేసు కోవాలి. కావాలంటే బ్రెడ్ మౌల్డ్‌లో వేసి చేసుకుని, స్లైసెస్‌లా కట్ చేసుకోవచ్చు. మార్బుల్ కేక్ కావలసినవి: మైదా - అరకప్పు, చక్కెర - అరకప్పు, నెయ్యి - అరకప్పు, కోడిగుడ్లు - 2, కోకో పౌడర్ - 3 చెంచాలు, బటర్ - 1 చెంచా, బేకింగ్ పౌడర్ - అర చెంచా, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా తయారీ: ముందుగా బేకింగ్ డిష్‌కి బటర్రాసి, దానిమీద పిండిని చల్లాలి. తర్వాత గిన్నెని బోర్లించి అంటుకోకుండా ఉన్న పిండిని దులిపేయాలి; కోడిగుడ్లలోని తెల్లసొనని, పచ్చసొనని వేరు చేసి పెట్టుకోవాలి; చక్కెరను పొడి చేసుకోవాలి; మైదాలో బేకింగ్ పౌడర్ కలిపి పక్కనుంచాలి; ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి తీసుకుని, చక్కెర పొడి వేసి పూర్తిగా కరిగిపోయేవరకూ కలుపుతూ ఉండాలి; తర్వాత ఇందులో కోడిగుడ్డు తెల్లసొనను వేసి గిలకొట్టాలి; తెల్లని నురుగు వచ్చిన తర్వాత పచ్చసొనను కూడా వేసి గిలకొట్టాలి; ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి; ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకుని... ఓ భాగంలో వెనిల్లా ఎసెన్స్, మరో భాగంలో కోకో పౌడర్ కలపాలి; కేక్గిన్నెలో ముందుగా వెనిల్లా కలిపిన మిశ్రమం, తర్వాత కోకో పౌడర్ కలిపిన మిశ్రమం, ఆపైన మళ్లీ వెనిల్లా కలిపిన మిశ్రమం... ఇలా రెండు మిశ్రమాలనూ పొరలు పొరలుగా వేసుకుంటూ పోవాలి; తర్వాత ఓ ఫోర్క్ తీసుకుని, మొత్తం మిశ్రమాన్ని మెల్లగా కలపాలి. అలా అని మరీ ఎక్కువగా కలపకూడదు. రెండు మిశ్రమాలూ కొంచెం కలిస్తే చాలు; ఇప్పుడు గిన్నెను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న మైక్రో అవన్లో పెట్టి, 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కర్టెసీ: నియాప్రకాశ్, ఫుడ్ బ్లాగర్