ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం | Sakshi Special Story About Easter Sunday | Sakshi
Sakshi News home page

ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం

Published Sun, Apr 4 2021 12:14 AM | Last Updated on Sun, Apr 4 2021 6:42 AM

Sakshi Special Story About Easter Sunday

‘మృతులుండే సమాధిలో యేసుక్రీస్తును వెదకడానికి వచ్చారా? ఆయన ఇక్కడ లేడు, సజీవుడయ్యాడు. తన వారిని కలుసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు.  ఆయన్ను శుక్రవారం ఇదే సమాధిలో పడుకోబెట్టగా, ఇపుడు ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కావాలంటే చూడండి’ అంటూ ఖాళీ సమాధిలో ఉన్న ఒక దేవదూత, ఈస్టర్‌ ఆదివారం తెల్లవారుజామునే ప్రభువు దేహానికి పరిమళ క్రియలు సంపూర్తి చేసేందుకు వచ్చిన యేసు తల్లి మరియకు, సలోమి అనే మరొక స్త్రీకి, ప్రభువు శిష్యురాలైన మగ్దలేనే మరియకు ఇంకా ఇతర స్త్రీలకు ఆనాటి ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ ప్రకటించాడు.

అది విని స్త్రీలంతా విస్మయమొంది భయంతో వణుకుతూ పారిపోయారు. అయితే సజీవుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఆ రోజే మొట్టమొదట కనిపించి, తన పునరుత్థాన శుభవార్తను తన శిష్యులకు ప్రకటించమని ఆదేశించాడు. అయితే యేసు మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శిష్యులకు ఇది నమ్మశక్యంగా కనిపించలేదు. అందువల్ల వాళ్లంతా భోజనానికి కూర్చున్న సమయంలో యేసుప్రభువు వారిమధ్య ప్రత్యక్షమై, వారి అపనమ్మకాన్ని బట్టి వారిని మందలించి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తన పునరుత్థాన క్షమా శుభవార్తను ప్రకటించమని ఆదేశించాడు (మార్కు 16:1–10). అందువల్ల క్రైస్తవానికి పునాది యేసుప్రభువు పునరుత్థానమే!!

ప్రపంచంలోని అతి చిన్నదైన ఇజ్రాయేలు అనే దేశంలోని యూదయ అనే ఒక మూలన ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు దైవకుమారుడుగా జన్మించి, ఒక సాధారణ మానవుడుగా అయినా ఏ లోపమూ లేని పాపరహితమైన సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్ళపాటు సామాన్యులు, నిరుపేదలు, నిరక్షరాస్యులైన అతి సాధారణ ప్రజలతో మమేకమై జీవించిన యేసుక్రీస్తు ప్రబోధాలు, విలక్షణమైన ఆయన దైవికత మూల స్తంభాలుగా ఆరంభమైన ‘క్రైస్తవం’ అతి కొద్దికాలంలోనే అనేక ప్రపంచ దేశాలకు పాకి అనేక ప్రపంచ నాగరికతల్ని ప్రభావితం చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, కరడుగట్టిన హింసాత్మకతకు పుట్టినిల్లుగా మారిన లోకానికి ప్రేమ, సాత్వికత్వం, దీనత్వం, సమన్యాయం, క్షమాభావనల సౌరభాలనద్ది, కోట్లాదిమంది అనామకులకు ఉనికినిచ్చిన ఒక ఆత్మీయవిప్లవమైంది.

క్రైస్తవం స్పృశించిన ప్రతి జీవి, నేల పరివర్తన నొంది పులకరించింది. ఈస్టర్‌ పండుగ అంటే, ఈ లోకం సిలువ వేసి చంపిన ఒక మహనీయుడు తిరిగి సజీవుడయ్యాడని సంబరపడే సందర్భం మాత్రమే కాదు, హింసకు ప్రతి హింసే జవాబని మాత్రమే తెలిసిన లోకానికి, క్రీస్తు జీవితంలో పరిఢవిల్లిన క్షమాపణను, ప్రేమను పరిచయం చేసి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన శుభారంభపు తొలి దినమది. రెండు రోజుల ముందే సిలువలో యేసు ప్రభువు మీద ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కనీ వినీ ఎరుగని దౌర్జన్యం, దమనకాండ, హింస ఆయన ప్రేమ, క్షమాపణ శక్తి ముందు నిర్వీర్యమై ఓటమి పాలయ్యాయని లోకానికి ప్రకటితమైన రోజు అది.

అది సమాప్తమే... కాని అంతం కాదు...
శుక్రవారం నాటి యేసు సిలువ యాగం విషాదంతో సమాప్తమైంది. అయితే ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్థానంతో లోకంలో ‘క్షమాయుగపు’ శుభారంభం జరిగింది. మానవాళిని తన అపారమైన కృపలో భాగం చేసుకోవాలన్న దేవుని అనాది సంకల్పం, అలా దౌర్జన్యం, దుర్మార్గం పైన యేసు సిలువ బలియాగం ద్వారా ఘన విజయం సాధించి క్రైస్తవానికి బీజాలు వేసింది.  శుభ శుక్రవారం నాడు సిలువలో, ఈస్టర్‌ ఆదివారం నాడు యేసు పునరుత్థానంతో ఖాళీ అయిన రాతి సమాధిలో దేవుని ప్రేమ, క్షమాపణ పునాదులుగల దేవుని రాజ్యం వెల్లివిరిసింది. ఆయన్ను సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రోమా సామ్రాజ్యం ఆ తరువాత మూడొందల ఏళ్లకే పతనమై భూస్థాపితమైంది. కానీ నాటి సిలువలో, ఖాళీ సమాధిలో అంకురార్పణ జరిగిన దేవుని క్షమారాజ్యం ఈ రెండువేల ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది, కోట్లాదిమందికి ఆశీర్వాదాల్ని ప్రసాదిస్తూనే.

ఆరున్నర అడుగుల  ప్రభువు
యూదుల అత్యున్నత చట్టసభ సన్‌ హెడ్రిన్‌లో సభ్యుడైన అరిమతై యోసేపు తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో శుభ శుక్రవారం నాటి సాయంత్రం యేసుప్రభువు పార్థివ దేహాన్ని ఖననం చేశారని బైబిల్‌ పేర్కొంటోంది (మత్తయి 27:57–60, యోహాను 19:41).  ప్రభువు సమాధి ఒక తోటలో ఉండిందని కూడా యోహాను సువార్త పేర్కొంది (19:41). పైగా యెరూషలేములో హీబ్రు భాషలో ‘గొల్గొతా’ అని, లాటిన్‌ భాషలో ‘కల్వరి’ అని పిలిచే కపాలం లాగా కనిపించే ఒక కొండకు దగ్గరలో ఆయన్ను సిలువ వేశారని, దానికి దగ్గరలోని ఒక తోటలోనే ఆయన సమాధి ఉందని కూడా బైబిల్‌ పేర్కొంది.

ఈ ఆనవాళ్ళంటికీ సరిపోలిన ఆయన సమాధి స్థలం కోసం చరిత్రలో పురాతత్వశాస్త్రవేత్తలు, బైబిల్‌ పండితులు చేసిన ఎంతో అన్వేషణ, పరిశోధనలు ఫలించి ‘గార్డెన్‌ టూంబ్‌’గా పిలిచే ఒక రాతి సమాధి యెరూషలేము పట్టణంలో దమస్కు ద్వారానికి దగ్గరలో బయటపడింది. బైబిల్‌ పురాతత్వ పరిశోధనలకు పితామహుడుగా పేర్కొన దాగిన ఎడ్వర్డ్‌ రాబిన్సన్‌ అనే అమెరికన్‌ చరిత్రకారుడు 1852 దాకా చేసిన తన పరిశోధనల సారాంశాన్నంతా ‘బిబ్లికల్‌ రీసెర్చ్‌ ఇన్‌ పాలస్తీనా’ అనే పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించడంతో ఈ సమాధి విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి ‘గార్డెన్‌ టూంబ్‌’ అనే ఈ సమాధి స్థలం క్రైస్తవ పర్యాటకులకు ముఖ్యంగా ప్రొటెస్టెంట్‌ తెగకు చెందిన వారికి దర్శనీయ స్థలమైంది.

ఈ తోట భూగర్భంలో బయటపడిన బ్రహ్మాండమైన ఒక రాతి నీటి తొట్టి, ఒక పెద్ద ఒలీవ నూనె గానుగ ఒకప్పుడు అదొక ఆలివ్‌ తోట అని చెప్పడానికి రుజువులయ్యాయి. గొప్ప విశేషమేమిటంటే, ఆ సమాధిని అరిమతై యోసేపు తన కోసం తన ఎత్తు ప్రకారంగా తొలిపించుకున్నాడు. కాని అనుకోకుండా యేసుప్రభువును అందులో పడుకోబెట్టినపుడు, ఆ భాగం యేసుప్రభువు ఎత్తుకు సరిపోలేదు. అందువల్ల ఆయన కాళ్ళుండిన స్థలంలో సమాధి రాతి గోడను నాలుగంగుళాలపాటు అప్పటికప్పుడు తొలిపించిన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి యేసుప్రభువు ఎత్తు ఆరడుగుల ఐదంగుళాలకు పైనే ఉంటుందని అంచనా వేయవచ్చు. పైగా ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన అతి పెద్ద రాయిని మనకోసం ఎవరు తొలగిస్తారంటూ ప్రభువు అనుచరులైన మగ్దలేనే మరియ తదితర స్త్రీలు ఈస్టర్‌ ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి వద్దకు వెళ్తూ మాట్లాడుకున్నట్టు బైబిల్‌లో చదువుతాము. నాడు సమాధికి అడ్డంగా ఐదడుగుల ఎత్తు రెండు టన్నుల బరువున్న ఒక గుండ్రటి రాయిని పెట్టారన్నది, ఇపుడా సమాధి ద్వారం వద్ద దాన్ని దొర్లించడానికి చేసిన రాతి కాలువలాంటి స్థలాన్ని బట్టి అర్థమవుతుంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ సువార్త ప్రబోధకులు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement