సహనం బలం... సహన ఫలం | Endurance strength Endurance | Sakshi
Sakshi News home page

సహనం బలం... సహన ఫలం

Published Wed, Mar 27 2019 12:50 AM | Last Updated on Wed, Mar 27 2019 12:50 AM

Endurance strength  Endurance - Sakshi

బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. వరం కోసం తొందర పడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు. వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది. పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో  పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం,  సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి. చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. సహనంతో మెలిగి వరం కోరిన  భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు. సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు. 

సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది. 
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement