Endurance
-
సహనం బలం... సహన ఫలం
బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. వరం కోసం తొందర పడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు. వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది. పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం, సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి. చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు. సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు. సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
కోపమూ ఉపకరణమే!
ఆత్మీయం నవరసాలలో కోపం ఒకటి. కోపం లేని మనిషి ఉండడు. రుషులలో కూడా కోపం ఉంటుంది. అందుకు దుర్వాస మహర్షే మంచి ఉదాహరణ. కోపానికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడం, అవతలివారి అవగుణాలు వెతుక్కుంటూ పోవడమే! అయితే అలా వెతికే ముందు ‘‘నేను ఎన్నో తప్పులు చేసాను, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకేం అధికారం ఉంది ? అసలు నేను ఏ తప్పూ చేయనివాడినా?’’ అన్న ప్రశ్న వేసుకుంటే కోపం రాదు. ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది. అది మాటామాటా పెరిగి పోయి ఎంతదూరమైనా వెళుతుంది. దానిని అదుపు చేసుకోలేకపోతే చాలా తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. అయితే కోపమే లేకపోతే వ్యవస్థను చక్కబెట్టడం కుదరదు. రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు. మీకు కోపమే లేదనుకోండి. వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు. దాన్ని చక్కదిద్దడానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి. దాన్ని ఒక ఉపకరణంగా, సాధనంగా వాడుకోవాలి. అలాకాకుండా అనవసర సందర్భాల్లో కోప్పడితే అది వినాశనానికి కారణమవుతుంది. ఒక్కోసారి మనం కోపం అవతలి వారి మీద ప్రభావం చూపినా, చూపకపోయినా, ఆ కోపాన్ని ప్రదర్శించిన మన మీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో మరొకటిలేదు. లోపలినుంచి ఉబికి వస్తున్న కోపాన్ని తీసేయడం చేతకాకపోతే దాన్నుంచే ఎన్నో అవగుణాలు పుడతాయి. మానసిక పరమైన ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం వంటివే గాక, బీపీ, యాంగ్జయిటీ వంటి జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కోపం అనే అవలక్షణాన్ని ఓర్పు, సహనం, వివేకం, శాంతం అనే మంచి లక్షణాలతో అదుపులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు. -
తెలుగు పద్యం
క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి త్తముచిత లజ్జ భూషణ ముదాత్త కవిత్వము రాజ్య మీ క్షమా ప్రముఖ పదార్థముల్ గలుగుపట్టున దత్కవచాదులేటికిన్. భావం: ఓర్పు ఉంటే కవచం అక్కర్లేదు. క్రోధం ఉంటే హాని కలిగించడానికి వేరే శత్రువుతో పని లేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. స్నేహితుడు ఉంటే ఔషధం అక్కరలేదు. దుష్టులు ఉంటే భయంకరమైన సర్పాలే అక్కర్లేదు. ఉదాత్తమైన కవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు. చక్కని విద్య ఉంటే సంపదతో ప్రయోజనం లేదు. తగురీతిని సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కర్లేదు. ఈ ఓర్పు మొదలైన లక్షణాలన్నీ చెంతనే ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటి అవసరం లేదు.