కోపమూ ఉపకరణమే!
ఆత్మీయం
నవరసాలలో కోపం ఒకటి. కోపం లేని మనిషి ఉండడు. రుషులలో కూడా కోపం ఉంటుంది. అందుకు దుర్వాస మహర్షే మంచి ఉదాహరణ. కోపానికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడం, అవతలివారి అవగుణాలు వెతుక్కుంటూ పోవడమే! అయితే అలా వెతికే ముందు ‘‘నేను ఎన్నో తప్పులు చేసాను, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకేం అధికారం ఉంది ? అసలు నేను ఏ తప్పూ చేయనివాడినా?’’ అన్న ప్రశ్న వేసుకుంటే కోపం రాదు. ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది. అది మాటామాటా పెరిగి పోయి ఎంతదూరమైనా వెళుతుంది. దానిని అదుపు చేసుకోలేకపోతే చాలా తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. అయితే కోపమే లేకపోతే వ్యవస్థను చక్కబెట్టడం కుదరదు. రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు. మీకు కోపమే లేదనుకోండి. వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు. దాన్ని చక్కదిద్దడానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి. దాన్ని ఒక ఉపకరణంగా, సాధనంగా వాడుకోవాలి.
అలాకాకుండా అనవసర సందర్భాల్లో కోప్పడితే అది వినాశనానికి కారణమవుతుంది. ఒక్కోసారి మనం కోపం అవతలి వారి మీద ప్రభావం చూపినా, చూపకపోయినా, ఆ కోపాన్ని ప్రదర్శించిన మన మీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో మరొకటిలేదు. లోపలినుంచి ఉబికి వస్తున్న కోపాన్ని తీసేయడం చేతకాకపోతే దాన్నుంచే ఎన్నో అవగుణాలు పుడతాయి. మానసిక పరమైన ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం వంటివే గాక, బీపీ, యాంగ్జయిటీ వంటి జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కోపం అనే అవలక్షణాన్ని ఓర్పు, సహనం, వివేకం, శాంతం అనే మంచి లక్షణాలతో అదుపులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు.