ఎర్రమ్మ... తాపీ మేస్త్రీ! | Erramma ... tindal trowel! | Sakshi
Sakshi News home page

ఎర్రమ్మ... తాపీ మేస్త్రీ!

Published Wed, Nov 25 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

ఎర్రమ్మ...  తాపీ మేస్త్రీ!

ఎర్రమ్మ... తాపీ మేస్త్రీ!

మగవాళ్లకు దీటుగా చేసే పనులు ఆమెను అక్కడివారిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అలా పదేహేనేళ్లుగా భవన నిర్మాణాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే క ట్కూరు,     ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, మరుగుదొడ్లు, ఇతర భవనాలు నిర్మించింది. ఇప్పటికీ గృహనిర్మాణాలు చేస్తూనే ఉంది.
 
యాభై ఏళ్ల వయసున్న ఈమె పేరు ఎర్రమ్మ.పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు సమీపంలోని కట్కూరు గ్రామంలోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాలామంది మహిళలకు ఓ రోల్‌మోడల్. చదువులేదు. కానీ, జీవితం నేర్పిన పాఠాలతో సమాజంలో తనకుంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. తాపీ మేస్త్రీ.  చేపలవేటలో కాకలు తీరిన బెస్తగత్తె. ఎర్రమ్మ చేపట్టిన వృత్తులను అక్కడి జనం ఇప్పుడు అంత విచిత్రంగా ఏమీ చూడటంలేదు కానీ పదిహేనేళ్ల క్రితం మాత్రం ముక్కుమీద వేలేసుకున్నవారే.
 
 కల్లోల సంద్రం

 ఎర్రమ్మ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం. తల్లీతండ్రీ జాలర్లు. చేపలవేటే జీవనాధారంగా ఉండేది. పెళ్లయ్యాక ఎర్రమ్మ భర్త వెంకటేశ్వర్లు కూడా గోదావరిలో చేపల వేట సాగించేవాడు. ఇద్దరు ఆడపిల్లలు. జీవనం హాయిగా గడిచిపోతుండేది. అయితే అకస్మాత్తుగా అనారోగ్యంతో భర్త మరణించడంతో ఆమె జీవితం కల్లోల సంద్రమైంది. తల్లిదండ్రులు అప్పటికే కన్నుమూయడంతో ఆదరించేవారు లేక ఎర్రమ్మ ఒంటరిదైపోయింది. పనిచేస్తేనే ఆ పూట తిండి లేదంటే పస్తే. అలాంటి తరుణంలో బిడ్డలను పెంచడం, వారి పెళ్లిళ్లు.. ఈ బాధ్యతలను ఎలా నెరవేర్చాలో ఆమెకు అర్థం కాలేదు. జీవనోపాధిని వెతుక్కుంటూ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఎర్రమ్మ తన సొంతూరు ధవళేశ్వరం నుండి పాతికేళ్ల క్రితం భవననిర్మాణ కూలీగా కట్కూరు వచ్చేసింది.
 
 ఒదిగిన చోటే ఎదిగింది
మొదట్లో తాపీ మేస్త్రీ్తల్ర దగ్గరికి కూలీ పనులకు వెళ్లేది ఎర్రమ్మ. ఏళ్లు  గడుస్తున్నకొద్దీ నెమ్మదిగా తాపీ పని నేర్చుకుంది. పనిలో నైపుణ్యం, మంచితనం ఆమెకు చిన్న చిన్న పనులు అప్పజెప్పే స్థాయికి చేర్చాయి. ముందుగా ఊర్లో మరుగుదొడ్లు కట్టే పనులు వచ్చాయి. అక్కడ నుంచి చిన్న చిన్న ఇండ్లు.. ఆ తర్వాత స్కూల్‌భవనం కట్టే పని అప్పగింత, ఆ తర్వాత అంగన్‌వాడీ భవనాలు... ఒకొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చింది. ఈ నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నాణ్యంగా కట్టి ఇవ్వడంతో ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ ఎర్రమ్మ పనితనానికి మంచి మేస్త్రీ అని పేరొచ్చింది. మగవాళ్లకు దీటుగా చేసే పనులు ఆమెను అక్కడివారిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అలా పదేహేనేళ్లుగా భవన నిర్మాణాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్లలో ఆమె ఎదురు పడితే ఎర్రమ్మా అని పిలవరు. మేస్త్రీ అంటారు గౌరవంగా. అది చూసి ‘ఇళ్లు ఎంత గట్టిగా నిర్మించానో నమ్మకం కూడా అంతే గట్టిగా నిర్మించుకున్నాను’ అని ఆత్మవిశ్వాసంతో అంటుంది ఎర్రమ్మ.
 
సడలని గుండె నిబ్బరం
ఎర్రమ్మ భర్త చనిపోయేనాటికి పిల్లలిద్దరు చాలా చిన్నవాళ్లు. పెద్ద కూతురుకి 11, చిన్నకూతురుకు 4 ఏళ్లు. త ల్లిలా పిల్లల ఆలన చూసుకుంటూనే, తండ్రిలా బాధ్యతలూ నెరవేరుస్తూ వచ్చింది. ‘నేను బతికిందే పిల్లలకోసం. తండ్రి వాళ్లకు అన్యాయం చేశాడు. నేను చేయలేను కదా. అందుకే వారిని ఓ ఒడ్డుకు చేర్చాలని పట్టుదలగా నిశ్చయించుకున్నాను. పిల్లలిద్దరికీ జాగ్రత్తలు చెప్పి, పొరుగున ఉండే అమ్మలక్కలకు అప్పజెప్పి పనులకు వెళుతుండేదాన్ని. ఆ తర్వాత సొంతంగా నేనే పనులు మొదలుపెట్టాక నా వెంటే వాళ్లనూ తీసుకెళ్లేదాన్ని..’ అందామె. ఇటుక మీద ఇటుక చేర్చినట్లే, రూపాయి రూపాయి కూడబెట్టగలిగిందామె. అందుకే పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేసింది. పెద్ద అల్లుడు మొక్కల నర్సరీలో పనిచేస్తుండగా, చిన్న అల్లుడు గోదావరిలో చేపలవేటతో ఉపాధి పొందుతున్నాడు. ఇలా తమను స్థిరపరచినందుకే పిల్లలకు తల్లి అంటే చాలా ప్రేమ.
 
‘మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కూలి పనిలో ఒళ్లు హూనం చేసుకొని వచ్చినా మా ముందు ఆ నొప్పులను చెప్పుకునేది కాదు- మేము భయపడతామని. తనే సహించేది. పొద్దునపూట కూలికెలితే, రాత్రిపూట గుడ్డిదీపం పెట్టుకొని బట్టలు కుట్టేది. మేమూ కూలీకెళతాం.. నీ కష్టం కొంతైనా తీరుస్తం అంటే అమ్మ ఇనలేదు. ఏమిచ్చినా అమ్మ రుణం తీర్చుకోలేం’ అంటూ కన్నీళ్లతో అమ్మకు కృతజ్ఞతలు చెప్పారు దుర్గ, నీలవేణిలు. పిల్లల పురుళ్లు, పెట్టుపోతల విషయంలోనూ ఏ లోటూ రానీయకుండా కూతుళ్లకు కల్పవృక్షమైంది ఈ తల్లి.
 
టీమ్ లీడర్
ఎర్రమ్మ తాను ఉపాధి పొందడమే కాకుండా తన కింద పనికి తీసుకొని మరెందరికో ఉపాధి కల్పిస్తోంది. కట్కూరు, టేకూరు గ్రామాలకు చెందిన వీరిలో ఒకరిద్దరు  మేస్త్రీలుగా ఎదిగారు కూడా. ఎర్రమ్మ ఎక్కడ పనులు ఒప్పుకున్నా వీరంతా ఒక టీమ్‌గా ఏర్పడతారు. భవనాలు, సెమెంటు రోడ్లు, మరుగుదొడ్లు వంటి ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు  కాంట్రాక్ట్‌కు తీసుకొని, పనులు చేపడతారు.
 
లేడీస్ టైలర్
పనిలేకుండా ఖాళీగా ఉండటం అంటే మానవ జన్మకు ఏదో ద్రోహం చేసినట్టుగా భావిస్తుంది ఎర్రమ్మ. భవన నిర్మాణ పనులు లేని సయయంలో బట్టలు కుడుతుంది. గ్రామంలో మహిళా టైలర్‌గా ఎర్రమ్మకు మంచి పేరుంది. కష్టమంటే ఏంటో తెలిసిన ఎర్రమ్మ తన చుట్టుపక్కల వారికి ఏ చిన్న ఆపద వచ్చినా ముందు ఉంటుంది. చేతనైన సాయం చేస్తూ అందరిచేత ఎర్రమ్మ అంటే ఎంతో మంచి మనుసుగలది అనిపించుకుంటోంది.
 
చేపల వేట
 ప్రతీ ఏటా డిసెంబర్ నుండిజూన్ వరకు గోదావరి నీటి మట్టం తగ్గి చేపల వేటకు అనువుగా ఉన్న సమయంలో గోదావరిలో చేపల వేటకు వెళుతుంది ఎర్రమ్మ. ఇలా పట్టిన చేపలను గ్రామంలో విక్రయించి, ఉపాధి పొందుతుంది. విధి వక్రించిందని వెన్ను చూపలేదు ఎర్రమ్మ. జీవనసంద్రంలో ఒంటరిదైనా వెనుకంజ వేయలేదు. ఎరుకైన పనులు చేస్తూనే, ఎరుకలేని పనులు నేర్చుకుంటూ కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చింది. పనిలోనే దైవాన్ని చూసుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలిచింది.
 - ఎం. ఏ.సమీర్, సాక్షి, వేలేరుపాడు
 
 

Advertisement
Advertisement