వ్యాయామంతో బరువు తగ్గుతారా? లేదా? అన్నది ఓ చిత్రమైన సమస్య. ఎందుకంటే ఫలితాలు.. మీరు పురుషుడైతే ఒకలా.. మహిళలైతే ఇంకోలా ఉంటాయి మరి. మహిళలైతే వ్యాయామం మాత్రమే చేయడం ద్వారా బరువు తగ్గలేరని అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. ఎక్సర్‌సైజ్ చేయాలనుకున్నప్పుడు చాలామంది తినే ఆహారంపై కూడా నియంత్రణలువిధించుకుంటారని.. ఫలితంగా వారు తగ్గే బరువుకు కారణమేమిటన్నది స్పష్టంగా తెలియదని వీరు తెలిపారు.
ఈ నేపథ్యంలో తాము ఇటీవల ఒక పరిశోధన నిర్వహించామని.. కొంతమంది మహిళలకు రెండు దశల్లో వ్యాయామ శిక్షణ ఇచ్చామని.. వీరెవరికీ పరిశోధన లక్ష్యాలేమిటన్నది తెలియకుండా జాగ్రత్త పడ్డామని మ్యా«థ్యూ జాక్సన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. శిక్షణకు ముందు, తరువాత వారి బరువు, కొవ్వుశాతం వంటి వివరాలను నమోదు చేసి పరిశీలించినప్పుడు అటు బక్కగా ఉన్న వారుగానీ.. ఇటు లావుగా ఉన్నవారు గానీ బరువు తగ్గలేదని, అదే సమయంలో బక్కగా ఉండే మహిళల్లో ఆరోగ్యకరమైన లీన్ మాస్ మాత్రం పెరిగినట్లు గుర్తించామని వివరించారు.
ఆకలిని పెంచే హార్మోన్లు లెప్టిన్, అమైలిన్‌లలో వచ్చే మార్పుల కారణంగా వ్యాయామానికి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారని మ్యాథ్యూ వివరించారు. వ్యాయామంతోపాటు చక్కెరలను తగ్గించి.. బోలెడన్ని కాయగూరలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మాత్రమే మహిళలు బరువు తగ్గగలరని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment