గమ్యం అగమ్యగోచరం చీకటని తెలిసీ కళ్లు మూసిన నడక తల బొప్పిగట్టిన అనుభవం
సోకు మీద ఎంత మనసుపడ్డా కళ్లుపొయ్యేంత కాటుకెందుకు కనుపాపలకేం కనపడ్డవన్నీ కావాలనుకుంటయి గాలికెగిరొచ్చే దుమ్మును ముద్దాడి చెంపలమీది జలపాతాలౌతయి రెప్పల బాధ రెప్పలదే
కలగన్నమనీ కడపదాటుడు తప్పుకాదు పట్టుకున్న వేలు వాసన పసిగట్టాలె చుట్టుకున్న ఆశ లోతును కనిపెట్టాలె రెచ్చగొట్టే కోరిక కొండెక్కిచ్చి తోసే అగాధాన్ని అంచనా కట్టాలె.
తోడుంటదని తోడేలును నమ్మటం అమాయకత్వం కాదు అతితెలివి. కాల్చుకునే వరకే చేతుల గాయి పట్టుకున్నాంక ఆకులేంచేస్తయి.
దుష్యంతుడి మతిమరుపు గాయాన్ని ఏ కణ్వాశ్రమం కన్నీళ్లు ప్రశ్నిస్తయ్?
నోరెత్తని పంచభూతాల సాక్షిగా అంతరాత్మల్లేని మనుషుల సాక్షిగా ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి ఎప్పుడూ చెరలోనే
మనువు మంచానికి పురుషుడు చట్రం పుత్ర సంతానం పుట్టగతులూ కలలు. పునరావృతమౌతున్న వెతల కథల నిండా మీరుపంచే అమృతం తాగి విషంచిమ్మే జాతి ఆనవాళ్లే బలివితర్దిమీద మీ బతుకుల అవశేషాలే శూన్యాల్లో సగం పంచిన వంచనలు
కొలిక్కిరాని బిల్లుల కింద పొందుతున్న వాయిదాల వాయినాలు. నిస్సహాయత మీ నిర్వచనం కాదు జయించాల్సిన బలహీనత పరాధీనత మీ గాచారం కాదు మీకు మీరే విధించుకుంటున్న శిక్ష
విచక్షణతో మెదిలితే విచ్చుకత్తుల కవచాలు మీరే వివేకంతో కదిలితే విజేతల చరిత్ర మీది విశ్వాసమై ఎదిగితే వికాసాల శిఖరం మీది.
– వఝల శివకుమార్
Comments
Please login to add a commentAdd a comment