హై–బీపీ కౌన్సెలింగ్
మా అన్నగారు చాలాకాలం నుంచి హై–బీపీతో బాధపడుతున్నారు. ఇటీవల నేను పరీక్ష చేయించుకుంటే నాకు కూడా కాస్త బీపీ ఎక్కువగా ఉన్నట్లు అర్థమైంది. పూర్తిగా మందులు ఇవ్వకపోయినా కాస్త జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. దయచేసి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త వివరించండి.
– సుధీర్‌కుమార్, నల్లగొండ
హైబీపీ ఉందని చెప్పగానే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మీరు హైపర్‌టెన్షన్ వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి. అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియవూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియవూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న ఇంగ్లిష్ పదాల సంక్షిప్త రూపమే ఈ డ్యాష్. ఈ నియమాలు బీపీని నివారించుకోవాలనుకుంటున్న వారు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇవే నివారణకూ తోడ్పడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు లేదా దాన్ని నివారించుకోవాలనుకున్నవారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉదాహరణకు అరటిపండు వంటి పండ్లలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి అలాంటి పండ్లు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
హైపర్‌టెన్షన్ నివారించుకోవాలనుకుంటున్నవారితో పాటు అది ఉన్న వారు ఆహారంలో ఉప్పు (సోడియం) పాళ్లను తగ్గించాలి. ఇందుకోసం ఉప్పు (సోడియమ్) పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలైన నిల్వ ఉంచిన ఆహారాలు (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరానికి మించి కాస్త ఎక్కువగానే ఉప్పు వేస్తుంటారు. లేకపోతే పచ్చడి చెడిపోతుందని అంటుండటం మనం వింటూనే ఉంటాం. అందుకే కాస్త పాత బడ్డ తర్వాత పచ్చళ్లు రుచి తగ్గి, ఉప్పుగా అనిపిస్తుంటాయి. అందుకే పాత ఆవకాయలనూ, పాత పచ్చళ్లను (నిల్వ పచ్చళ్లను) అస్సలు ఉపయోగించకూడదు.
శరీర బరువు పెరుగుతున్న కొద్దీ లేదా వ్యక్తులు లావెక్కుతున్న కొద్దీ అన్ని కణాలకూ రక్తసరఫరా జరగడానికి రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంటుంది. దాంతో స్థూలకాయులకు హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎత్తును లేదా బీఎమ్‌ఐని చూసుకొని, ఎత్తుకు తగ్గ బరువుండేలాగా ఎప్పుడూ మన బరువును నియంత్రించుకుంటూ ఉండాలి. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల అంటే పొట్టుతో ఉండే అన్ని రకాల తృణధాన్యాలు, ఆకుపచ్చని ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గడంతో పాటు సాధారణ ఆరోగ్యమూ బాగుంటుంది. ఇది పరోక్షంగా బీపీని నివారిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగరు. బరువు పెరగడం, స్థూలకాయం రావడం వంటి అంశాలు హై–బీపీ వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అన్న విషయం తెలిసిందే. అందుకే వ్యాయామం మన శరీరంలో కొవ్వు పేరుకోకుండానూ, బరువు పెరగకుండానూ చేసి, పరోక్షంగా హై–బీపీని నివారిస్తుంది. ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తాగగానే రక్తప్రసరణ వేగంలో తక్షణం మార్పు వస్తుంది. కొంత వేగంగానే పెరుగుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. పొగతాగే అలవాటు వల్ల కూడా ఎన్నో అనర్థాలతో పాటు పొగలో ఉండే నికోటిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్ప్రేరకాలన్నీ రక్తప్రసరణ వేగాన్ని పెంచేవే. కాబట్టి బీపీ ఉన్నవారూ, దాన్ని నివారించుకోవాలనుకునేవారు ఈ దురలవాటు నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఒత్తిడి రక్తపోటును చాలా ఎక్కువగా పెంచుతుంటుంది. అందుకే రక్తపోటును నివారించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామ వంటి ప్రక్రియలతో పాటు తమకు ఇష్టమైన అభిరుచులలో (హాబీలలో) కృషిచేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనం నివారణ కోసం (లేదా అప్పటికే బీపీ ఉన్నవారు నియంత్రణ కోసం) అనుసరించే ఈ మార్గాలన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. కాబట్టి మంచి జీవనశైలిని అనుసరిస్తే బీపీని అదుపులో ఉంచుకోవడం లేదా నివారించుకోవడం చాలా సులభం.
బీపీ ఉంటే కిడ్నీ పరీక్ష కూడా ఎందుకు?
నేను గత ఐదేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. ఇటీవల ఒకసారి బీపీ చెక్ చేయించుకోడానికి డాక్టర్‌గారిని కలిస్తే ఆయన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. నాకు లక్షణాలేమీ లేకపోయినా ఎందుకిలా చేశారు. వివరించగలరు. – రవికాంత్, మధిర
దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రక్తపోటు హెచ్చుతగ్గులు ఉన్నవారిలోనూ, దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలోనూ ఎండ్ ఆర్గాన్స్ అనే కీలకమైన శరీర అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి వాటిని ఎండ్ ఆర్గాన్స్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే రక్తం ఇక్కడివరకు చేరి మళ్లీ వెనక్కు తిరుగుతుంది. ఇలాంటి కీలకమైన అవయవాలు హైబీపీ దుష్ప్రభావాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు చాలావరకు దెబ్బతిన్న తర్వాత గాని వాటికి సంబంధించిన లక్షణాలేవీ బయటపడవు. అందుకే వాటిని ముందే తెలుసుకోగలిగితే రాబోయే ముప్పును సమర్థంగా నివారించవచ్చు. ఈ కారణం వల్లనే హైబీపీ ఉన్నవారిలో తరచూ కీలక అవయవాలైన కాలేయం పనితీరు పరీక్షలనూ, కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు దోహదపడే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, క్రియాటినిన్ వంటి పరీక్షలు చేయిస్తుంటారు డాక్టర్లు. మీరు డాక్టర్ ఇచ్చిన సలహా పాటించండి.
బీపీ ఉంటే కంటికీ ప్రమాదమా?
నా వయసు 54 ఏళ్లు. చాలా రోజులుగా హైబీపీ సమస్యతో బాధపడుతున్నాను. ఇటీవల మా డాక్టర్‌గారు ఒకసారి కంటి పరీక్ష చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. ఎందుకా పరీక్ష చేయించమన్నారు. బీపీ వల్ల కంటికీ ప్రమాదమా? దయచేసి చెప్పండి. – ఎమ్. సుదర్శనరావు, నిజామాబాద్
నియంత్రణలో లేకుండా చాలా కాలం నుంచి బీపీ ఉన్నవారిలో కొందరికి కంట్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం, దాంతో కాస్త చూపు తగ్గే అవకాశం ఉంది. ఈ కండిషన్‌ను ఇస్కిమిక్ రెటినోపతి అంటారు. అందుకే హైబీపీ ఉన్నవారిని కంటి పరీక్షలు తరచూ చేయించమని డాక్టర్లు సూచిస్తుంటారు. కాబట్టి మీరు మీ డాక్టర్ చెప్పినట్లుగా ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోండి.
డాక్టర్ ఎమ్. గోవర్ధన్
సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్,
నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment