నా వయసు 27 ఏళ్లు. నాలుగేళ్ల నుంచి ఎస్‌ఎల్‌ఈ అనే జబ్బుతో బాధపడుతున్నాను. నాకు పెళ్లయి మూడేళ్లు. ఇప్పటికే నాలుగు సార్లు గర్భాస్రావం అయ్యింది. ఈ జబ్బు ఉంటే తల్లయ్యే అవకాశం ఉండదని కొంతమంది అంటున్నారు. ఇంగ్లిష్ మందుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని ఇప్పటివరకు వైద్యం చేయించుకోలేదు. గత మూడు నెలలుగా అధిక రక్తపోటు ఒళ్లంతా వాపు రావడం జరుగుతోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, విజయవాడ
ఎస్‌ఎల్‌ఈ లేదా లూపస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. వీళ్లలో యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ (ఏపిఎస్) అనే జబ్బు కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. 30 శాతం నుంచి 40 శాతం లూపస్ వ్యాధిగ్రస్తుల్లో ఏపీఎస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ ఉంటాయి. దీనివల్ల రక్తం తరచూ గడ్డకట్టడం, తరచూ గర్భస్రావాలు, నెలలు నిండకముందే ప్రసవించడం, గర్భవతిగా ఉన్న సమయంలో అధికరక్తపోటు, దాంతో ఫిట్స్ రావడంజరుగుతుంది. ప్రసవం తర్వాత ఈ వ్యాధి తీవ్రత పెరిగి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ప్రాణాంతకం అవుతుంది. లూపస్, ఏపీఎస్ వ్యాధుల దుష్ప్రభావం మూత్రపిండాల
(కిడ్నీల) మీద కూడా ఉంటుంది. మీలో బీపీ పెరగడం, ఒంట్లో వాపు రావడం దీనివల్లనే అయి ఉండే అవకాశం ఉంది. మీరు వెంటనే రుమటాలజిస్టును కలిసి వ్యాధి తీవ్రతను నిర్ధారణ చేసుకోండి. మీ బరువు, ఎత్తు ఆధారంగా రుమటాలజిస్టులు మందుల మోతాదును సూచిస్తారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయా లేదా అని కూడా కొన్ని రక్తపరీక్షలు చేయిస్తారు. మందుల మోతాదుతో ఒనగూరే ప్రయోజనాలు, వాడకపోవడం వల్ల నష్టాలపై రుమటాలజిస్టులకు అవగాహన ఉంటుంది. దాంతో వారు సరైన మోతాదును నిర్ణయించి, మీ జబ్బును వారు త్వరగా నియంత్రించగలరు. జబ్బు నియంత్రణలోకి వచ్చాక, మీ గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని ఇంజెక్షన్లను సూచిస్తారు. దాంతో తప్పక మంచి ఫలితం ఉంటుంది. అందుకే ముందుగా మీరు క్వాలిఫైడ్ రుమటాలజిస్ట్‌ను కలిసి, వారు సూచించిన విధంగా వైద్యచికిత్స ప్రారంభించండి. తల్లి కావాలన్న మీ కోరికను సాకారం చేసుకోండి.
ఆర్థరైటిస్ అంటున్నారు... ఆహారం ఎలా ఉండాలి?
నా వయసు 33 ఏళ్లు. ఇటీవలే నాకు కీళ్లవాతం (ఆర్థరైటిస్) ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఆహార నియమాలను వివరించండి.
– ఎల్. రాజ్యం, ఒంగోలు
కీళ్లవాతం (ఆర్థరైటిస్) అని వైద్యులు నిర్ధారణ చేసిన వెంటనే రోగులు, వాళ్ల బంధువులు రోగి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి మొట్టమొదట కలవరపడతారు. అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సావిధానాల కన్న ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆందోళన పడతారు. ఏ వస్తువులు తినాలి, ఏవి తినకూడదు, ఏయే పదార్థాల వల్ల వాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది లాంటి సందేహాలతో సతమతమవుతారు. చాలామంది వెంటనే దుంపకూరలు, గుడ్లు, మాంసం, వంకాయ, గోంగూర వంటివి తినడం మానేస్తారు. అలాగే కొంతమంది ఒక్కసారిగా చేపలు, వెల్లుల్లి ఎక్కువగా తినడం మొదలుపెడతారు.
నిజానికి గౌట్ అనే ఒక రకమైన కీళ్లవాతంలో తప్ప వేరే ఏ ఇతర కీళ్లవాతాలలోనూ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అనేక రకాల పరిశోధనలు, క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఇది. గౌట్ అనే వ్యాధిలో యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరిగి కీళ్లలోకి చేరుతుంది. దానివల్ల కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు మాత్రమే యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎంపిక చేసేకోవాలి. గౌట్ వ్యాధిగ్రస్తులు మాత్రం మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, బీన్స్ వంటి పదార్థాలను తినకూడదు. అలాగే మద్యం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్నవాటికి దూరంగా ఉండాలి. ఇక ఆర్థరైటిస్ వంటి ఇతర కీళ్లవాతాలతో బాధపడేవారు ఏ విధమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మంచి పౌష్టికాహారంతో పాటు క్యాల్షియమ్ ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దాంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీళ్లకు ఎంతో అవసరం. అది కీళ్లకు మేలు చేస్తుంది.
‘ఆస్టియోపోరోసిస్’కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 63 ఏళ్లు. ఇటీవల జారిపడటం వల్ల ఎడమవైపు తుంటి ఎముక విరిగిపోయింది. ఈ విషయం విన్న మా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఇది ఆస్టియోపోరోసిస్ అని, దానివల్ల ఇలా జరిగిందని అంటున్నారు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించండి. – రమణమ్మ, నిజామాబాద్
మన ఎముకల పటుత్వానికి, వాటిలో ఖనిజాలు చేరడానికి క్యాల్షియమ్ ఎంతో అవసరం. ఒంట్లో దీని మోతాదు తగ్గినప్పుడు ఎముకల మధ్య రంధ్రాలు ఏర్పడి, అవి బోలుగా మారి, బలహీన పడతాయి. ఇలాంటి కండిషన్‌నే ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఇది మెనోపాజ్ తర్వాత స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. హార్మోన్ల అసమతౌల్యత, తక్కువ శరీర బరువు కలిగి ఉండటం, స్టెరాయిడ్స్ వాడటం వంటి అంశాల కారణంతో పాటు సాధారణంగా విదేశాలలో అయితే మహిళల్లోనూ ఉండే మద్యపానం, పొగతాగే అలవాట్ల వల్ల కూడా ఎముక పరిమాణం తగ్గి, పటుత్వం కోల్పోతుంది. దీనివల్ల ఎముకలు తరచూ విరిగిపోతాయి. సాధారణంగా వెన్నెముక, తుంటి ఎముకలపై ఆస్టియోపోరోసిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలామందిలో ఏ లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి తీవ్రమవుతుంది. కొంతమందిలో విపరీతమైన నడుము నొప్పి, తరచూ ఎముకలు విరగడం, కారణం లేకుండా ఎత్తు తగ్గి, కుంగినట్లుగా అయిపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్లలో ఆస్టియోపోరోసిస్ ఉండవచ్చునని భావించి వెంటనే రుమటాలజీ నిపుణులను సంప్రదించాలి. వారు బీఎండీ అనే పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారణ చేసి, ఎముక పటుత్వం పెరగడానికి మందులు సూచిస్తారు. ఇక పెద్దవయసు వారిలో తరచూ కిందపడటానికి గల కారణాలను గుర్తించి, వాటి నివారణకు కృషిచేయాలి. తద్వారా రెండోసారి ఎముకలు విరగడాన్ని నివారించడం సాధ్యమవుతుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవారికి క్యాల్షియమ్, విటమిన్–డి పుష్కలంగా దొరకే ఆహారం ఇస్తుండాలి. ఈ రోగులు క్రమం తప్పక వ్యాయామం చేయడంతో పాటు తమ శరీర బరువును ఎత్తుకు తగినట్లుగా ఉంచుకోవడం వల్ల ఎముకలూ ఆరోగ్యంగా ఉండాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు వీలైనంత త్వరగా రుమటాలజిస్టును సంప్రదించి, మీ వ్యాధి నిర్ధారణ చేయించుకొని, వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవడం వల్ల ఎముకలు మాటిమాటికీ ఫ్రాక్చర్ కావడాన్ని నివారించి, ఎముకల పటుత్వాన్ని పెంచుకోవచ్చు.
డాక్టర్ విజయ ప్రసన్న పరిమి
సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment