హోమియో కౌన్సెలింగ్స్
నా భార్య వయసు 34 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. నాకు ఆందోళనగా ఉంది. దీనికి హోమియోలో చికిత్స సాధ్యమేనా? – డి. ఆంజనేయులు, చిత్తూరు
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదలవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి, అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.
లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతాన కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో అరుదుగా హృద్రోగ సమ స్యలు రావచ్చు.రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
బాబుకు ఆస్తమా... చికిత్స
మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా... ఎప్పుడు హాస్పిటల్‌లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా? – కె. ఆనందరావు, విశాఖపట్నం
ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది.
కారణాలు: ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ పరిస్థితులు, చల్లగాలి ∙వైరస్‌లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి
రేణువులు ∙వంశపారంపర్యం.
లక్షణాలు: ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం.
వ్యాధి నిర్ధారణ: ఎల్‌ఎఫ్‌టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు.
చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
ఒళ్లంతా తెల్లమచ్చలు... పరిష్కారం లభిస్తుందా?
నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఈ సమస్యతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు వస్తుంది? హోమియోతో పరిష్కారం లభిస్తుందా?
– కె. సూర్యారావు, విజయవాడ
చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు.
కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ∙జన్యుపరమైన కారణాలు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు ∙మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్‌లలో లోపాలు ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు.
లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు.
చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment