హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 38 ఏళ్లు. నేను కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. నా సమస్య హోమియో మందులతో పూర్తిగా నయం అవుతుందా? – ఎమ్. చిన్నారావు, విశాఖపట్నం
దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది.
కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్, ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... రెక్టమ్‌కు రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.
చికిత్స: జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
ఆటిజమ్ తగ్గుతుందా?
మా బాబుకు మూడున్నర ఏళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో ఈ సమస్యకు చికిత్స ఉందా?– ఎమ్‌డి. షమీమ్‌బానో, గుంటూరు
ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువ. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
కారణాలు : గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వంటి అనేక కారణాలతో ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. మాటలు సరిగా రానివారికి స్పీచ్ థెరపీ ఉపయోగకరం. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే తప్పక గుణం కనిపిస్తుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
సొరియాసిస్ నయమవుతుందా?
నాకు 38 ఏళ్లు. సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – డి. సురేశ్, ఖమ్మం
సోరియాసిస్ అనేది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న కొందరిలో మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు.
కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙దీర్ఘకాలికంగా కొన్ని మందులు ఎక్కువగా వాడటం.
లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది.
చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. ఈ మందులను క్రమం తప్పకుండా అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment