డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. నా చర్మం గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఏడాదిగా నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ చర్మం మడతలు పడ్డట్టుగా ఉంటుందో అక్కడక్కడల్లా ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
– ఎల్. శ్రీనివాసరావు, మదనపల్లె
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్‌ఓఎమ్‌ఏ–ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. దీనికి చికిత్స ఈ కింది విధంగా ఉంటుంది.
∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్ – లికోరైస్ – కోజిక్ యాసిడ్
∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి.
∙యాభైకు ఎక్కువగా ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్సూ్యల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్‌ఫార్మిన్ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి.
ఇతర ప్రక్రియలు : ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ∙లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్‌ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
గీరుకున్నచోట నల్లమచ్చలు.. తగ్గేదెలా?
నా రెండు చేతుల మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తే చాలాసేపు గీరుకున్నాను. దాంతో నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి తగ్గి, నా చర్మం మామూలుగా అయ్యేందుకు ఏం చేయాలో చెప్పండి. – ఎమ్. నీరజ, సంగారెడ్డి
మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ సూచనలు పాటించండి. ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి. ∙ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే చోట ఎస్‌పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి – కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్‌తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు అప్లై చేయండి. ∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి.
ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. అయితే మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది.
వేళ్లకు బొబ్బలు... మచ్చలు రాకుండా మార్గం చెప్పండి
నా వయసు 32 ఏళ్లు. రెండు రోజుల క్రితం చూడకుండా వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేళ్లు బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అప్పుడు వాటిపై మచ్చలు పడతాయని ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. లక్ష్మీప్రసన్న, కోదాడ
మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్ సల్ఫాడైజీన్‌తో పాటు మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్‌మాన్స్ రెజీమ్ వంటి స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్ లేజర్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్,
త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment