తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఇటీవల ఒక మహిళా జర్నలిస్టు చెంపపై మృదువుగా అరిచేత్తో తట్టి (కింది ఫొటో) విమర్శలపాలయ్యారు. ఆ చర్య పట్ల ఆమె అభ్యంతరం తెలపడంతో ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. పెద్దాయన మురిపెంగా చిన్నపిల్ల చెంపపై తట్టడాన్ని ఎవ్వ రూ తప్పుపట్టరు. అయితే విద్యార్థినులను లైంగికంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్‌పై ఏం చర్య తీసుకుంటున్నారో చెప్పాలని జర్నలిస్టులంతా డిమాండ్ చేస్తున్న సందర్భంలో, ఆమె అడిగిన ఒక ప్రశ్నకు చిరునవ్వే జవాబుగా ఆయన ఇలా చేయడం వివాదాస్పదం అయింది.
అసలు ఆడపిల్లలతో.. వాళ్లు విద్యార్థినులైనా, ఉద్యోగినులైనా.. మగవాళ్లు ఎలా ఉండాలి? ఇందుకేమైనా గైడ్‌లైన్స్ ఉన్నాయా? పనిగట్టుకుని ఏమీ లేవు కానీ.. ఆడవాళ్ల విషయంలో అమర్యాదకరంగా అనిపించే కొన్ని ‘చొరబాట్ల’ గురించి ‘యు.ఎస్.ఎ.టుడే, గార్డియన్’ పత్రికలు ఇటీవల కొన్ని టిప్స్ ఇచ్చాయి. బాయ్స్ అండ్ మెన్.. ఆ టిప్స్ ఫాలో అయిపోండి. క్షేమంగా ఉండండి. చక్కగా జీవించండి.
ముద్దు పేర్లు వద్దు : హనీ, స్వీటీ, స్వీట్ హార్ట్, ఏంజీ, బేబ్.. ఇవన్నీ వద్దు. మీకన్నా చిన్నవాళ్లైనా, మీకు సమస్థాయి వాళ్లయినా వద్దే వద్దు. చక్కగా పేరు పెట్టి పిలవండి. ‘గారూ’ అనడం కనీస మర్యాద అనిపిస్తే పేరు పక్కన ‘గారు’ చేర్చండి. బొత్తిగా పరిచయం లేనివారైతే ‘అండీ’ అనడం బెటర్. కుర్చీ వెయ్యడం : ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అనుకుని, కూర్చోడానికి వాళ్ల కోసం చెయిర్ లాగకండి. వాళ్లు లాక్కోగలరు. మరీ పెద్దవాళ్లు, గాయాలతో ఉన్నవారు అయితే తప్ప మీరేమీ చెయిర్ ఎత్తుకెళ్లి వాళ్లకు వేయవలసిన అవసరం లేదు.
నో టచింగ్ : మీదెంత మంచి మనసైనా.. పని చేసే చోట.. డోన్ట్ టచ్ హర్. దూరంగా ఉండి మాట్లాడండి. బుగ్గ మీద, భుజం మీద, చేతి మీద తాకి మాట్లాడకండి. కావాలంటే ‘ఫిస్ట్ బంప్స్’ ఇచ్చుకోండి. ఈ గుర్తుని వాట్సాప్‌లో చూసే ఉంటారు. పిడికిలిని పిడికిలితో టచ్ చెయ్యడం. ‘హై ఫైవ్స్’ కూడా ఓకే. రెండు చేతులు కలిస్తేనేగానీ అవి చప్పట్లు కానట్లే.. ఈ రెండూ కూడా (ఫిస్ట్ బంప్స్, హై ఫైవ్స్) ఇద్దరూ అనుకుంటేనే సాధ్యం అవుతాయి.
హ్యాండ్‌షేక్ : నిరభ్యంతరంగా ఇచ్చు కోవచ్చు. అయితే హ్యాండ్ షేక్ కోసం అమ్మాయి చేతిని లాగేసుకోకూడదు. పదిసార్లు మాట్లాడినా గుర్తుండని వారు.. ఒక హ్యాండ్ షేక్‌తో గుర్తుంటారట. మీరేమీ గుర్తుండన వసరం లేదు కానీ.. అనుకోకుండా హ్యాండ్ షేక్ జరిగితే జరిగిపోనివ్వండి. అనుకుని మాత్రం చేతిని పట్టుకుని ఊపేయకండి.
డోర్ తీసి పట్టుకోవడం : స్త్రీలు కాన్ఫరెన్స్ హాల్లోకి వస్తున్నప్పుడు కానీ, బయటికి వెళుతున్నప్పుడు మీరు అక్కడే ఉంటే డోర్ తీసి పట్టుకోవడం మంచిదే. అలాగే కారు డోర్ తీసిపట్టుకోవడం కూడా సంస్కారవంతమైన పనే. తప్పులేదు. దీన్ని కూడా ఎవరైనా ఓవర్ యాక్షన్ అనుకున్నారంటే అది మీ ఖర్మ.
బిల్ పే చెయ్యడం : పర్సనల్‌గా కాకుండా, ఉద్యోగరీత్యా ఫిమేల్ కో–వర్కర్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు.. లంచ్‌కి గానీ, డిన్నర్‌కి గానీ బిల్లును ఫిఫ్టీఫిప్టీ ఇవ్వడం కరెక్ట్. ఒక వేళ ఆ మహిళ బాస్ అయితే కనుక మనం బిల్లు పే చెయ్యడానికి ఉత్సాహం చూపక పోవడమే మంచిది.
పొగడ్తలు, ప్రశంసలు : ఆడవాళ్లను పొగడొచ్చా? కాంప్లిమెంట్స్ ఇవ్వొచ్చా? ట్రికీ క్వశ్చన్. ‘యు లుక్ గ్రేట్’ అన్నారనుకోండి. ఆ మాట బెడిసి కొట్టొచ్చు. లేదా మీపై తక్కువ భావన కలగొచ్చు. యు.ఎస్.అటార్నీ జనరల్ కమలా హ్యారిస్ గురించి బరాక్ ఒబామా ‘బెస్ట్–టుకింగ్’ అని చెబుతుండేవారు. అది విమర్శలకు కారణమైంది. ‘మీ వాచీ బాగుందనో, మీ డ్రస్ బాగుందనో అంటే అనండి కానీ.. మీరు బాగున్నారు అని మాత్రం అనకండి’ అని సలహా ఇస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.
Comments
Please login to add a commentAdd a comment