Female journalist
-
నిర్మలారెడ్డికి అభినందనలు..
సాక్షి, హైదరాబాద్: సాక్షి’ దినపత్రిక చీఫ్ రిపోర్టర్ నిర్మలారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాధోడ్ ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. దీనిని పురస్కరించుకుని ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి, డిప్యూటీ ఎడిటర్ రమణమూర్తి, అసిస్టెంట్ ఎడిటర్ ఖదీర్‌బాబు పలువురు సీనియర్ పాత్రికేయులు సోమవారం ఆమెకు అభినందనలు తెలిపారు. నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల మండలం, చిలకమర్రి గ్రామానికి చెందిన నిర్మలారెడ్డి గత 20 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. మహిళల ఆదరణ పొందిన ‘సాక్షి’ ఫ్యామిలీ విభాగంలో ఫీచర్ జర్నలిస్ట్‌గా పలువురు మహిళల స్ఫూర్తిదాయక విజయాలను వెలుగులోకి తెచ్చారు. మానవీయ కథనాల ద్వారా ఎందరో ఆపన్నులకు చేయూత అందేలా చేశారు. కథా రచయిత్రిగానూ తనదైన ముద్రవేసుకున్న ఆమె గతంలో ప్రతిష్టాత్మక డీఎన్‌ఎఫ్ ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును సైతం అందుకున్నారు. అవార్డు గ్రహీత నిర్మలను అభినందిస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళి తదితరులు -
నాన్నను మా అమ్మ ‘... మనిషి’ అని కులం పేరుతో తిట్టేది!
అయితే ఈ కథనం.. కులాంతర వివాహాల గురించి కాదు. పరువు హత్యలు జరిగినప్పుడు కులపట్టింపులపై జర్నలిస్టులు సంధించే ప్రశ్నల గురించి! ‘ఈ ధోరణి సరికాదు’ అని ఒక వెబ్‌సైట్‌కు రాస్తూ, తన తల్లిదండ్రుల జీవితాల్ని సమాజం ముందు పరిచారు ఆ అజ్ఞాత మహిళా జర్నలిస్టు. ‘‘మా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. మా అమ్మ సంప్రదాయ నేత పనివారి కుటుంబంలో పుట్టింది. మా తాతయ్య దర్జీగా పనిచేసేవాడు. పేదరికం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, మా అమ్మని 1970 ప్రాంతంలో చదువుల కోసం మద్రాసు విశ్వవిద్యాలయానికి పంపాడు. అమ్మ బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి తన ఆరుగురు తోబుట్టువులకు అండగా ఉంటుందని భావించాడు తాతయ్య. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బాగానే ఉంటుంది. అక్కడ చదువుకునే రోజుల్లోనే అమ్మకి మా నాన్నతో పరిచయం ఏర్పడింది. నాన్న దళిత కుటుంబానికి చెందినవాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకుందామనుకున్నారు. అగ్ర వర్ణంలో పుట్టిన అమ్మాయి, దళిత అబ్బాయిని వివాహం చేసుకోవడమేంటని అమ్మ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు నాన్న దళితుడనే కారణంగా లిటరేచర్‌లో పి.హెచ్.డి. చేసే అవకాశం రాలేదు. ఒకవేళ నాన్న భయపడి తన గ్రామానికి Ðð ళ్లిపోతే, అక్కడ సైకిల్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగించవలసి వచ్చేది. ఇద్దరూ ధైర్యం చేశారు. బెంగళూరులో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో పార్ట్ టైమ్ జాబ్ చేయడం ప్రారంభించారు. నాన్నపై ఒత్తిడి తెచ్చారు వివాహం జరిగిన కొన్ని నెలల తరవాత, ఇరు కుటుంబాల వారు అమ్మనాన్నలను చూడటానికి వచ్చారు. నాన్న దళితుడు కావడంతో, తాతయ్య వాళ్లు నాన్నకి గౌరవం ఇవ్వకపోగా, అమ్మని చదివించడానికి అయిన ఖర్చు ఇవ్వమని ఒత్తిడి చేశారు. అమ్మకు ఒక బిడ్డ పుట్టి, రెండవసారి గర్భవతిగా ఉన్న సమయంలో, అమ్మ తోబుట్టువులు వచ్చి, డబ్బు కోసం ఒత్తిడి చేశారు. రెండుకుటుంబాలను పోషించడం కష్టం కావడంతో, ప్రసవించిన ఏడో రోజు నుంచి అమ్మ మమ్మల్ని ఇంట్లోనే ఉంచి ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. నేను పడుకున్న మంచం మీద నల్లులు కూడా ఉన్నాయి. నా పరిస్థితి చూసి అమ్మమ్మ వాళ్లు నన్ను వాళ్లతో తీసుకువెళ్లారు. నేను పుట్టిన రెండు సంవత్సరాలకి, అమ్మనాన్నలు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. దాంతో మళ్లీ అమ్మ దగ్గరకు వచ్చేశాను. మా ఆర్థిక పరిస్థితితో బాటు, అమ్మ వాళ్లకి మా బాధ్యతలు కూడా పెరిగాయి. అమ్మ వాళ్ల పుట్టింటివారిని, నాన్న వాళ్ల పుట్టింటివారినీ ఇద్దరినీ చూసుకునే బాధ్యత మరింత పెరిగింది. మా నాన్న తాను ఎందుకు డబ్బులు పంపలేకపోయాననే విషయం గురించి చెప్పబోతుంటే, ‘నువ్వు దళితుడివి. నీ మాటలు వినవలసిన అవసరం మాకు లేదు’ అని కఠినంగా మాట్లాడేవారు తాతయ్య. మా అమ్మ తన సోదరులకు, భర్తకు మధ్య నలిగిపోయేది. వారిని వెనకేసుకొస్తే నాన్నకి కోపం వచ్చేది. అమ్మానాన్నకు గొడవలు ఎక్కువైపోయాయి. అమ్మ విడిపోయింది అమ్మ తాను విడిగా ఉండటానికి నిశ్చయించుకుంది. అప్పటికి నా వయసు పది సంవత్సరాలు. నేను, మా అన్నయ్య ఇద్దరం నాన్నతోనే కలిసి ఉన్నాం. రానురాను బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. మా సెలవులన్నీ ఇంటికే పరిమితమైపోయాయి. ఏ పండుగను బంధువులతో జరుపుకునే అవకాశం లేకపోయింది. కేవలం చావుల సమయంలో మాత్రమే బంధువులు వస్తున్నారు. ప్రపంచం చాలా ఇరుకుగా కనిపించింది. మా అమ్మ తన ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడుపుతోంది. మా నాన్న ఎక్కడికైనా వెళ్లినప్పుడు అమ్మ ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్లేది. కొన్ని సంవత్సరాల తరవాత అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి బంధువులు ప్రయత్నించలేదు. ఇద్దరినీ కలపడానికి ఎవరూ లేకపోవడంతో వారి బంధం కూలిపోయింది. మా అమ్మనాన్నల మధ్యన వచ్చిన గొడవల కారణంగా, మా అమ్మ మా నాన్నను ‘... మనిషి’ అని కులం పేరుతో తిడుతుండేది. మా నాన్న బాధతో, ‘నేను బతికున్నంత కాలం ఈ మాటలు వింటూ ఉండవలసిందే’ అనేవారు. తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. నా మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోయాను. కులం నన్ను కూడా వెంటాడుతూనే ఉంది. నా కులం గురించి చెప్పగానే, అవతలి వారు విధించే నిబంధనలు వినడానికి నేను సిద్ధంగా లేను. దళితులను కులాంతర వివాహం చేసుకుంటే, బంధువుల నుంచి తెగదెంపులు ఎదుర్కోక తప్పడం లేదు. మనలో మతసహనం లోపిస్తోందనడానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నెన్నో. ఏటా జరిగే ఉత్సవాలకు కూడా దళితులను గుడి వెలుపల నుంచి మాత్రమే పూజలు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. గ్రామాలలో ఈ విషయంలో ఇంతవరకు మార్పు రాలేదు. ఇంకా ప్రమాదం ఏమిటంటే.. హింస జరిగినప్పుడు మాత్రమే మతసహనం గురించి ప్రస్తావిస్తున్నారు. మిగతా సమయాల్లో కులరహిత సమాజం వైపుగా చైతన్యం తెచ్చే ప్రయత్నాలను మనమెందుకు చెయ్యం? అనిపిస్తుంది’’ అని ఆ జర్నలిస్టు ఆలోచన రేపారు. ‘పరువు కోసం’ అని రాయకండి గతేడాది నవంబర్ పదహారు తమిళనాడు ప్రజలకి కాళరాత్రిని మిగిల్చింది. ‘గజ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఆ తుపానులో కొట్టుకొచ్చిన రెండు మానవ దేహాల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక యువ జంటను చంపేసి, కావేరీ నదిలోకి విసిరేశారు. వారివే ఆ మృతదేహాలు. ఆ అమ్మాయి వెనుకబడిన కుటుంబంలో పుట్టింది. అబ్బాయి దళితకులానికి చెందినవాడు. వారిలో ఈ దళితుడు అణగారిన వర్గానికి చెందినవాడి కింద లెక్క. సంప్రదాయాన్ని మైలపరచినందుకుగాను అమ్మాయి కుటుంబీకులు ఆ జంటను దారుణంగా హత్య చేశారు. దక్షిణ భారతదేశంలో ఇటీవల పరువు కోసం జరిగిన వరుస హత్యలలో ఇది మూడో హత్య. ఇటువంటి హత్యలు జరిగినప్పుడు, జర్నలిస్టులు ఆ ప్రాంతానికి చేరుకుని, ఆయా కుటుంబాల వారిని ప్రశ్నించి, కేసు పూర్వాపరాలు తెలుసుకుంటారు. ప్రతి కేసులోనూ ‘పరువు కోసం యువజంట దారుణ హత్య’ అనే రాస్తారు. నిత్యజీవితంలో కులం గురించి మరచిపోలేమా అనేది పక్కన పెడితే, వీటిపై ప్రత్యేక వార్తా కథనాలు ఇచ్చేటప్పుడు జర్నలిస్టులు ‘పరువు కోసం’ అంటూ తీర్పులు ఇచ్చేయకుండా.. సామాజిక ధోరణులను మలిచేలా సమస్య మూలాల్ని విశ్లేషించాలని ‘స్క్రాల్.ఇన్’లో వ్యాసం రాసిన ఆ పాత్రికేయురాలు కోరుతున్నారు. – జయంతి (‘స్క్రాల్.ఇన్’ ఆధారంగా) -
భద్రం బీ కేర్‌ఫుల్
తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఇటీవల ఒక మహిళా జర్నలిస్టు చెంపపై మృదువుగా అరిచేత్తో తట్టి (కింది ఫొటో) విమర్శలపాలయ్యారు. ఆ చర్య పట్ల ఆమె అభ్యంతరం తెలపడంతో ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. పెద్దాయన మురిపెంగా చిన్నపిల్ల చెంపపై తట్టడాన్ని ఎవ్వ రూ తప్పుపట్టరు. అయితే విద్యార్థినులను లైంగికంగా బ్లాక్మెయిల్ చేస్తున్న ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్‌పై ఏం చర్య తీసుకుంటున్నారో చెప్పాలని జర్నలిస్టులంతా డిమాండ్ చేస్తున్న సందర్భంలో, ఆమె అడిగిన ఒక ప్రశ్నకు చిరునవ్వే జవాబుగా ఆయన ఇలా చేయడం వివాదాస్పదం అయింది. అసలు ఆడపిల్లలతో.. వాళ్లు విద్యార్థినులైనా, ఉద్యోగినులైనా.. మగవాళ్లు ఎలా ఉండాలి? ఇందుకేమైనా గైడ్‌లైన్స్ ఉన్నాయా? పనిగట్టుకుని ఏమీ లేవు కానీ.. ఆడవాళ్ల విషయంలో అమర్యాదకరంగా అనిపించే కొన్ని ‘చొరబాట్ల’ గురించి ‘యు.ఎస్.ఎ.టుడే, గార్డియన్’ పత్రికలు ఇటీవల కొన్ని టిప్స్ ఇచ్చాయి. బాయ్స్ అండ్ మెన్.. ఆ టిప్స్ ఫాలో అయిపోండి. క్షేమంగా ఉండండి. చక్కగా జీవించండి. ముద్దు పేర్లు వద్దు : హనీ, స్వీటీ, స్వీట్ హార్ట్, ఏంజీ, బేబ్.. ఇవన్నీ వద్దు. మీకన్నా చిన్నవాళ్లైనా, మీకు సమస్థాయి వాళ్లయినా వద్దే వద్దు. చక్కగా పేరు పెట్టి పిలవండి. ‘గారూ’ అనడం కనీస మర్యాద అనిపిస్తే పేరు పక్కన ‘గారు’ చేర్చండి. బొత్తిగా పరిచయం లేనివారైతే ‘అండీ’ అనడం బెటర్. కుర్చీ వెయ్యడం : ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అనుకుని, కూర్చోడానికి వాళ్ల కోసం చెయిర్ లాగకండి. వాళ్లు లాక్కోగలరు. మరీ పెద్దవాళ్లు, గాయాలతో ఉన్నవారు అయితే తప్ప మీరేమీ చెయిర్ ఎత్తుకెళ్లి వాళ్లకు వేయవలసిన అవసరం లేదు. నో టచింగ్ : మీదెంత మంచి మనసైనా.. పని చేసే చోట.. డోన్ట్ టచ్ హర్. దూరంగా ఉండి మాట్లాడండి. బుగ్గ మీద, భుజం మీద, చేతి మీద తాకి మాట్లాడకండి. కావాలంటే ‘ఫిస్ట్ బంప్స్’ ఇచ్చుకోండి. ఈ గుర్తుని వాట్సాప్‌లో చూసే ఉంటారు. పిడికిలిని పిడికిలితో టచ్ చెయ్యడం. ‘హై ఫైవ్స్’ కూడా ఓకే. రెండు చేతులు కలిస్తేనేగానీ అవి చప్పట్లు కానట్లే.. ఈ రెండూ కూడా (ఫిస్ట్ బంప్స్, హై ఫైవ్స్) ఇద్దరూ అనుకుంటేనే సాధ్యం అవుతాయి. హ్యాండ్‌షేక్ : నిరభ్యంతరంగా ఇచ్చు కోవచ్చు. అయితే హ్యాండ్ షేక్ కోసం అమ్మాయి చేతిని లాగేసుకోకూడదు. పదిసార్లు మాట్లాడినా గుర్తుండని వారు.. ఒక హ్యాండ్ షేక్‌తో గుర్తుంటారట. మీరేమీ గుర్తుండన వసరం లేదు కానీ.. అనుకోకుండా హ్యాండ్ షేక్ జరిగితే జరిగిపోనివ్వండి. అనుకుని మాత్రం చేతిని పట్టుకుని ఊపేయకండి. డోర్ తీసి పట్టుకోవడం : స్త్రీలు కాన్ఫరెన్స్ హాల్లోకి వస్తున్నప్పుడు కానీ, బయటికి వెళుతున్నప్పుడు మీరు అక్కడే ఉంటే డోర్ తీసి పట్టుకోవడం మంచిదే. అలాగే కారు డోర్ తీసిపట్టుకోవడం కూడా సంస్కారవంతమైన పనే. తప్పులేదు. దీన్ని కూడా ఎవరైనా ఓవర్ యాక్షన్ అనుకున్నారంటే అది మీ ఖర్మ. బిల్ పే చెయ్యడం : పర్సనల్‌గా కాకుండా, ఉద్యోగరీత్యా ఫిమేల్ కో–వర్కర్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు.. లంచ్‌కి గానీ, డిన్నర్‌కి గానీ బిల్లును ఫిఫ్టీఫిప్టీ ఇవ్వడం కరెక్ట్. ఒక వేళ ఆ మహిళ బాస్ అయితే కనుక మనం బిల్లు పే చెయ్యడానికి ఉత్సాహం చూపక పోవడమే మంచిది. పొగడ్తలు, ప్రశంసలు : ఆడవాళ్లను పొగడొచ్చా? కాంప్లిమెంట్స్ ఇవ్వొచ్చా? ట్రికీ క్వశ్చన్. ‘యు లుక్ గ్రేట్’ అన్నారనుకోండి. ఆ మాట బెడిసి కొట్టొచ్చు. లేదా మీపై తక్కువ భావన కలగొచ్చు. యు.ఎస్.అటార్నీ జనరల్ కమలా హ్యారిస్ గురించి బరాక్ ఒబామా ‘బెస్ట్–టుకింగ్’ అని చెబుతుండేవారు. అది విమర్శలకు కారణమైంది. ‘మీ వాచీ బాగుందనో, మీ డ్రస్ బాగుందనో అంటే అనండి కానీ.. మీరు బాగున్నారు అని మాత్రం అనకండి’ అని సలహా ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్. -
రిపోర్టర్లు, యాంకర్లపై అభ్యంతర వ్యాఖ్యలు
చెన్నై: మహిళా జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్న ఓ పోస్ట్‌ను తమిళనాడు బీజేపీ నేత, నటుడు ఎస్వీ శేఖర్ గురువారం తన ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘చదువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కన్నా మీడియాలోనే లైంగికవేధింపులు ఎక్కువ. పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవ్వరూ రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లు కాలేరు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి సుబ్రమణియన్‌ను తాకినందుకు గవర్నర్ పురోహిత్ తన చేయిని ఫినాయిల్‌తో కడుక్కోవాలి. తమిళనాడులో నేరస్తులు, నీచులు, బ్లాక్ మెయిలర్ల చేతిలో చిక్కుకున్న మీడియా తిరోగమిస్తోంది. ఇక్కడి మీడియా ప్రతినిధులు దిగజారిన, అసహ్యమైన, సభ్యతలేని జీవులు’ అని ఉన్న పోస్ట్‌ను షేర్ చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో శేఖర్ వెంటనే క్షమాపణలు కోరారు. చదవకుండానే పోస్టును షేర్‌చేశానన్నారు. -
మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు
-
మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు
షాకింగ్ సంఘటన..కరాచీలో ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ మహిళా రిపోర్ట్‌పై పాకిస్తానీ పోలీసు గార్డు చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యలను లైవ్ రిపోర్టు చేసే మహిళా జర్నలిస్టును పాక్ పోలీసు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సైమా కన్వల్ అనే మహిళా యాంకర్ పాకిస్తాన్‌లోని కే-21 చానల్లో పనిచేస్తుంది. కరాచీలోని నాద్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లైవ్ రిపోర్టు చేయడానికి ఆమె అక్కడికి వచ్చింది. అక్కడ గార్డ్‌గా పనిచేస్తున్న ఫ్రాంటియర్ కానిస్టేబులరీ(ఎఫ్‌సీ) సైనికుడు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. మొదట కెమెరామెన్ షూటింగ్‌ను ఆపడానికి ప్రయత్నించిన అతను, కన్వల్ కెమెరాను వేరేవైపు మరల్చడంతో, ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ మొత్తం సంఘటన చిత్రీకరణ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహిళా రిపోర్టుపై దాడికి పాల్పడ్డ ఆ ఎఫ్‌సీ సైనికుడిపై గుల్బహార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసినట్టు ఎస్ఎస్పీ సెంట్రల్ ముఖదాస్ హైదర్ పాకిస్తానీ మీడియాకు తెలిపారు. ఆ గార్డును తమకు కస్టడీకి ఇప్పించాలని ఎఫ్‌సీ అథారిటీలను పోలీసులు కోరారు. టీవీ చానల్ రిపోర్టర్‌కు వ్యతిరేకంగా కూడా ఓ ఎఫ్ఐఆర్ను నాద్రా అధికారులు నమోదుచేసినట్టు హైదర్ చెప్పాడు. ఆమె అధికారిక పనిలో అవాంతరాలు కలిగిస్తుందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపాడు. మరోవైపు ఈ ఘటనను సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాద్రా ఆఫీసులో తన కూతురు/చెల్లెలి లాంటి మహిళ జర్నలిస్టుపై చేయిచేసుకున్న ఆ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎంఎన్ఏ పాకిస్తాన్ సల్మాన్ ముజాహిద్ బ్లాచ్ డిమాండ్ చేశారు. కే 21 న్యూస్ చానల్ మహిళా జర్నలిస్టును ఎఫ్‌సీ గార్డు కొట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ టీవీ జర్నలిస్టు ఫేస్బుక్ పోస్టు చేశారు. ఆ గార్డుపై యాక్షన్ తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
ఓవర్ టేక్ చేసిందని లేడీ జర్నలిస్టుపై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒక ప్రయవేట్ చానల్ కు చెందిన మహిళా జర్నలిస్టుపై ఇద్దరు వాహనదారులు దాడికి దిగారు. మయూర్ విహార్ ఏరియాలో బుధవారం ఉదయం ఆ ఘటన జరిగింది. మారుతి ఆల్టో కారులో ఉదయమే ఆఫీసుకు బయలుదేరిన ఆమె, పక్కనే వెళుతున్న స్కార్పియో వాహనాన్ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లింది. దీంతో ఆ వాహనంలో ఇద్దరు వ్యక్తులు మహిళా జర్నలిస్టుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆమె తేరుకునే లోపే దుండగులు అక్కడినుంచి పారిపోయారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతవారంలో తన కారును వెనకనుంచి చిన్నగా తాకిన పాపానికి ద్విచక్రవాహనదారుడ్ని కొట్టిచంపిన సంఘటన ఢిల్లీలో కలకలం రేపింది. కోపోద్రిక్తులైన స్థానికులు వాహనాలకు నిప్పుపెట్టి ఆందోళనకు దిగారు. తన కళ్ళముందే నాన్నను కొట్టి చంపారని... పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మృతుని కుమారుడు వాపోయిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ,ఆప్ మధ్య కూడా వివాదం రగిలింది. ఈ వివాదం ఇంకా చల్లారకముందే మరో సంఘటన జరగడం సంచలనం సృష్టించింది.