మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు
మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు
Published Fri, Oct 21 2016 10:11 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM
షాకింగ్ సంఘటన..కరాచీలో ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ మహిళా రిపోర్ట్పై పాకిస్తానీ పోలీసు గార్డు చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యలను లైవ్ రిపోర్టు చేసే మహిళా జర్నలిస్టును పాక్ పోలీసు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. సైమా కన్వల్ అనే మహిళా యాంకర్ పాకిస్తాన్లోని కే-21 చానల్లో పనిచేస్తుంది. కరాచీలోని నాద్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లైవ్ రిపోర్టు చేయడానికి ఆమె అక్కడికి వచ్చింది. అక్కడ గార్డ్గా పనిచేస్తున్న ఫ్రాంటియర్ కానిస్టేబులరీ(ఎఫ్సీ) సైనికుడు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. మొదట కెమెరామెన్ షూటింగ్ను ఆపడానికి ప్రయత్నించిన అతను, కన్వల్ కెమెరాను వేరేవైపు మరల్చడంతో, ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ మొత్తం సంఘటన చిత్రీకరణ అయిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
మహిళా రిపోర్టుపై దాడికి పాల్పడ్డ ఆ ఎఫ్సీ సైనికుడిపై గుల్బహార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసినట్టు ఎస్ఎస్పీ సెంట్రల్ ముఖదాస్ హైదర్ పాకిస్తానీ మీడియాకు తెలిపారు. ఆ గార్డును తమకు కస్టడీకి ఇప్పించాలని ఎఫ్సీ అథారిటీలను పోలీసులు కోరారు. టీవీ చానల్ రిపోర్టర్కు వ్యతిరేకంగా కూడా ఓ ఎఫ్ఐఆర్ను నాద్రా అధికారులు నమోదుచేసినట్టు హైదర్ చెప్పాడు. ఆమె అధికారిక పనిలో అవాంతరాలు కలిగిస్తుందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపాడు. మరోవైపు ఈ ఘటనను సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాద్రా ఆఫీసులో తన కూతురు/చెల్లెలి లాంటి మహిళ జర్నలిస్టుపై చేయిచేసుకున్న ఆ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎంఎన్ఏ పాకిస్తాన్ సల్మాన్ ముజాహిద్ బ్లాచ్ డిమాండ్ చేశారు. కే 21 న్యూస్ చానల్ మహిళా జర్నలిస్టును ఎఫ్సీ గార్డు కొట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ టీవీ జర్నలిస్టు ఫేస్బుక్ పోస్టు చేశారు. ఆ గార్డుపై యాక్షన్ తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Advertisement