జ్ఞాపకాన్ని వెతుకుతోంది! | Finding memory! | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాన్ని వెతుకుతోంది!

Published Sun, Apr 27 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

జ్ఞాపకాన్ని వెతుకుతోంది!

జ్ఞాపకాన్ని వెతుకుతోంది!

వీక్షణం
 
తల్లికి బిడ్డే ప్రపంచం. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి తనతోటే జీవితాన్ని ఊహించుకుంటుంది. తనని ఎలా పెంచాలి అని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఆ బిడ్డ చనిపోతే పరిస్థితి ఏమిటి?
 
ఆ వేదన ఎలా ఉంటుందో క్యాటీ మెక్‌గ్రెగర్‌కి బాగా తెలుసు. బ్రిటన్‌కి చెందిన క్యాటీ పిల్లల కోసం కలలు కంది. గర్భవతి అయిన నాటి నుండీ పుట్టబోయే బిడ్డను తలచుకుంటూనే కాలం గడిపింది. అయితే ఊహించని ఓ సంఘటన క్యాటీ మనసులో తుఫాను సృష్టించింది.
 
నెలలు నిండకుండానే ఆడపిల్లను ప్రసవించింది క్యాటీ. దాంతో బిడ్డను కొన్నిరోజుల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచారు. కోలుకోవడంతో ఇంటికి పంపించారు. పాపకు ఇసబెల్ అని పేరు పెట్టి మురిపెంగా పెంచసాగింది క్యాటీ. కానీ దురదృష్టం... సరిగ్గా ఇరవై రెండు వారాల తర్వాత పాపకు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. పుట్టుకతోనే సమస్యలు ఉన్న ఆ చిన్నారి... ఇక జీవించే శక్తి లేక మరణించింది.

 క్యాటీ తల్లడిల్లిపోయింది. కూతురి కోసం ఏకధాటిగా ఏడ్చింది. తన చిట్టితల్లి కోసం తాను అల్లిన ఎర్రటోపీని చేతితో పట్టుకునే తిరిగేది. ఎక్కడికెళ్లినా దాన్ని బ్యాగులో పెట్టుకు తీసుకెళ్లేది. ఆ రోజూ అలానే వెళ్లింది. రోడ్డు దాటు తుండగా ఓ ఆగంతకుడు వచ్చి క్యాటీ హ్యాండ్‌బ్యాగ్ లాక్కుని పారిపోయాడు. అతడిని పట్టుకోవాలని ప్రయత్నించి విఫల మైంది క్యాటీ. పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. కనిపించిన వాళ్లందరినీ అడిగింది. కానీ బ్యాగ్ దొరకలేదు. ల్యాప్‌టాప్, ఫోన్, నగదు ఉన్న ఆ బ్యాగ్ ఇక దొరకదు, మర్చి పొమ్మన్నారంతా. కానీ క్యాటీ వెతుకుతోంది వాటి కోసం కాదు. అందులో ఉన్న తన బుజ్జితల్లి ఎర్ర టోపీ కోసం.
 
అన్నీ తీసుకున్నా ఫరవాలేదు, తన కూతురి జ్ఞాపకంగా మిగిలిన ఆ టోపీని మాత్రం ఇచ్చెయ్యమంటూ ఇటీవలే ఫేస్‌బుల్‌లో రిక్వెస్ట్ పోస్ట్ చేసింది క్యాటీ. దాన్ని చదివి చాలామంది కదిలిపోయారు. వాళ్లంతా ఆ టోపీని వెతుకుతామని ఆమెకు మాటిచ్చారు. కచ్చితంగా ఎవరో ఒకరు తన కూతురి జ్ఞాపకాన్ని తనకి తెచ్చిస్తారని ఆశగా ఎదురుచూస్తోంది క్యాటీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement