
వంట తయారుచేయడం ఒక కళ అయితే, తయారుచేసిన వంటను కంటికింపుగా అలంకరించడం మరో కళ. రుచిగా వండిన వంటకాన్ని అందంగా అలంకరించి వడ్డిస్తే, ఆ ఆహారాన్ని ఇష్టంతో తింటారు. గార్నిషింగ్ అనేది ‘గార్నిర్’ అనే ఫ్రెంచి పదం నుంచి రూపొందింది. ఈ పదానికి అలంకరించడం అని అర్థం. అలంకరిచండానికి ఉపయోగించే వస్తువులు కూడా తినడానికి అనువుగా ఉండేవాటినే ఉపయోగించాలి. వంటకం మీద కాని, వంటకం చుట్టూ కాని గార్నిషింగ్ చేయడం ప్రధానం. ఇలా చేయడం వల్ల వంటకానికి కొత్త రంగులు, కొత్త అందం సమకూరుతాయి. వంటల పరిభాషలో గార్నిషింగ్ అంటే ‘వంటకాన్ని మరింత అందంగా రుచి చూడటం’ అని అర్థం.
పాటించవలసిన మెలకువలు
♦ వంటకంలో ఉపయోగించిన వాటితోనే తయారైన వంటకం మీద గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది. అలా చేయడం వల్ల వారు ప్లేట్‌లో పదార్థాన్ని కొద్దిగా కూడా మిగల్చకుండా గార్నిషింగ్ చేసినది సైతం కలిపి తినేస్తారు.
♦ గార్నిష్ చేయడానికి ముందు కాయగూరలను తప్పనిసరిగా నీళ్లతో శుభ్రం చేయాలి.
♦ గార్నిషింగ్ చేయడం వల్ల వంటకం మరింత అందంగా కనపడాలే కాని, వంటకాన్ని డామినేట్ చేసేలా ఉండకూడదు.
♦ గార్నిషింగ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ చూసుకోవడం ప్రధానం.
♦ ఎంత అందంగా, జాగ్రత్తగా అలంకరిస్తే, అంత బాగా ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు.
గార్నిషింగ్ ఇలా ఉంటే బాగుంటుంది...
♦ సింపుల్‌గా, సహజంగా, తాజాగా ఉండాలి.
♦ వంటకానికి తగినట్టుగా ఉండాలి
♦ మంచి ఫ్లేవర్‌తో ఉండాలి.
గార్నిషింగ్‌కి కొన్ని సూచనలు...
♦ అందంగా అలంకరించాలనే శ్రద్ధ ఉండాలి.
♦ టొమాటో సూప్ వంటివి తయారుచేసినప్పుడు, తాజా క్రీమ్‌ను కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా వేసి అలంకరిస్తే బాగుంటుంది.
♦ ఐస్ క్రీమ్స్ మీద క్రంచీ వేఫర్స్, డ్రై నట్స్ తరుగుతో అలంకరిస్తే కంటికి ఇంపుగా ఉంటుంది.
♦ కెబాబ్స్, స్టార్టర్స్‌లను కీర, క్యారట్, ఉల్లి చక్రాలు, నిమ్మ చెక్కలు, ఉల్లికాడల వంటి కూరలతో అలంకరించాలి. వీటితో కలిపి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది.
– డా. బి. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్)
చోలే పనీర్ మసాలా
కావలసినవి: కాబూలీ సెనగలు – ఒక కప్పు; బిర్యానీ ఆకు – ఒకటి; దాల్చిన చెక్క – చిన్న ముక్క; నల్ల ఏలకులు – 2; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఎండు ఉసిరిక – మూడు ముక్కలు; చోలే పనీర్ గ్రేవీ కోసం కావలసినవి... ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ముప్పావు కప్పు; పనీర్ – 150 గ్రా.; పచ్చి మిర్చి – 3; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి – ఒక టీ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. గార్నిషింగ్ కోసం... కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క
తయారీ:
♦ కాబూలీ సెనగలను ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి
♦ నానిన సెనగలను మరుసటి రోజు రెండు మూడు సార్లు బాగా కడిగి, తగినన్ని నీళ్లు, ఉప్పు, ఏలకులు, దాల్చిన చెక్క, ఎండు ఉసిరిక, బిర్యానీ ఆకు, అల్లం ముద్ద జత చేసి కుకర్‌లో ఉంచి పది విజిల్స్‌వ వచ్చేవరకు ఉంచి దింపేయాలి
♦ మూత తీశాక ఎండు ఉసిరిక ముక్కలను వేరు చేయాలి.
పనీర్ మసాలా తయారీ:
♦ స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి
♦ అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
♦ టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడేవరకు బాగా కలపాలి
♦ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరప కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి
♦ ఉడికించిన సెనగలను జత చేసి మరోమారు బాగా కలిపి, పచ్చి మిర్చి తరుగు, ఒక కప్పుడు ఉడికించిన సెగనల నీరు పోసి బాగా కలపాలి ∙
♦ గ్రేవీ బాగా చిక్కబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి
♦ (కొన్ని సెనగలను గరిటెతో మెత్తగా అయ్యేలా చిదిమితే, గ్రేవీ త్వరగా చిక్కబడుతుంది)
♦ పనీర్ ముక్కలు, కసూరీ మేథీ, ఆమ్ చూర్ పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి
♦ కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలతో గార్నిష్ చేయాలి
♦ రోటీలు, పూరీలు, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment