నిన్ను ప్రేమించని అమ్మాయి కోసమైనా..
నువ్వు బతికి ఉండాల్సింది తాజుద్దీన్..!
ప్రేమ
ఇంకో ఆత్మహత్య! ఆదివారం తెల్లారే ఫస్ట్ అవర్‌లో. విజయవాడ అబ్బాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సత్యనారాయణపురం పోలీసులు పిలిచి మందలించారని, ఇంటికి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడనీ న్యూస్. తాజుద్దీన్ అట పేరు. అందంగా ఉన్నాడు. పెళ్లిచూపుల్లో - ‘అబ్బాయి బాగున్నాడే..’ అని అమ్మాయి ఫ్రెండ్స్ చాటుగా ఆమె బుగ్గ గిల్లేంత అందంగా! అందం ఉండి, మంచి ఉద్యోగం ఉండీ ఎందుకు చనిపోయాడు? అవి రెండూ లెక్కలోకి రాలేదు తాజుద్దీన్‌కి. ‘తను’ లేకుండా జీవితమే లేదు అనుకున్నాడు. ‘తను’ అంటే తాజుద్దీన్ ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు ‘తను’ ఏ మూలన పడి గుట్టుగా కన్నీళ్లు తుడుచుకుంటోందో... అతడి మరణవార్తను తట్టుకోలేక!
అబ్బాయి తల్లి ఏడుస్తోంది. ‘నాకు నా కొడుకు కావాలి’ అని గుండెలు బాదుకుంటోంది. ఎక్కడి నుంచి వస్తాడు? పొద్దున్నే హర్ట్ అయి వెళ్లిపోయినవాడు?! తాజుద్దీన్ అక్కో, చెల్లో.. మీడియా కెమెరాల ముందు దుఃఖం ఆపుకుంటోంది. ‘ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి మావాడిని మోసం చేసింది’ అని చెబుతోంది. ‘‘నువ్వా అమ్మాయి వెనక తిరక్కు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది’ అని పోలీసులు తాజుద్దీన్‌తో అన్నారట.
‘‘తట్టుకోలేకపోయాడు బాబూ.. పోలీసులు పిలవడం వాడికి అవమానం కాదు. తనకి ఇష్టం లేదని పిల్ల కంప్లైంట్ ఇచ్చిందట. ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు’’ - తల్లి తల్లడిల్లిపోతోంది.
తాజుద్దీన్ ఫ్రెండ్స్ వడిలిపోయారు. సండే.. వాళ్ల ప్లాన్.. ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్. మాటైనా చెప్పకుండా ఆ మ్యాచ్‌ని రద్దు చేసేసి, తనను వద్దనుకున్న అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయాడు తాజుద్దీన్. ఆ అమ్మాయి ఒక్కదాన్నే వదిలేస్తున్నానని అతడు అనుకున్నట్లుంది! ఆమెతో పాటు ఉదయాలను, సాయంత్రాలను వదిలేశాడు. చిట్టినగర్‌ని, సత్యనారాయణపురాన్ని, విజయవాడనీ వదిలేశాడు. గూగుల్‌ని, భూగోళాన్ని వదిలేశాడు. ఇవన్నీ వదిలేస్తే వదిలేశాడు. అసలా అమ్మాయి తనను వద్దనుకోవడం నిజమేనా అనే విషయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనను కూడా వదిలేశాడు!
ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి తనని వద్దనుకుని ఉంటే!
ఏముందీ? ప్రేమ ఉండదు. బాధ ఉంటుంది. మంచిదే కదా. ప్రేమకు టైమింగ్స్ ఉంటాయి. షిఫ్టులు ఉంటాయి. మధ్యమధ్యలో సిగ్నల్స్ పోతుంటాయి. సమ్‌టైమ్స్.. ప్రేమ స్విచాఫ్ కూడా అయిపోతుంటుంది. బాధ.. బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. ‘రారా.. నవరంగ్‌లో సినిమాకు పోదాం’ అంటుంది. ‘నడ్రా.. బీసెంట్ రోడ్‌కి’ అని సతాయిస్తుంటుంది. బతకలేమా ప్రేమ లేకుండా. ప్రేమించిన అమ్మాయి లేకుండా! ఎంత పని చేశావ్ తాజుద్దీన్!!
నీ కోసం నీ వాళ్లంతా బాధపడుతున్నారు. నువ్వు ‘నా’ అనుకున్నవాళ్లు, నిన్ను ‘మా’ అనుకున్నవాళ్లు.. అంతా బాధపడుతున్నారు. వాళ్లందరి కోసం నువ్వు బతికుండాల్సింది. కనిపెంచిన అమ్మకోసం, కనిపెట్టుకుని ఉన్న నాన్న కోసం, నీ తోడబుట్టినవాళ్ల కోసం, నీ స్నేహితుల కోసం నువ్వు బతికి ఉండాల్సింది తాజుద్దీన్. వీళ్లందరినీ వదిలేయ్. కనీసం నిన్ను ‘ప్రేమించని’ ఆ అమ్మాయి కోసమైనా నువ్వు బతికి ఉండాల్సింది. తనకి నువ్విచ్చిన కానుకలు, తనకి నువ్విచ్చిన ‘బైక్ రైడింగ్’, తనకి నువ్వు స్పెండ్ చేసిన టైమ్.. అన్నీ ఆమెను దోషిగా నిలబెడుతున్నాయి ఇప్పుడు! నువ్వే బతికి ఉంటే అవన్నీ నీ సంతోషం కోసమే తప్ప, ఆమె సంతోషం కోసం కాదని చెప్పడానికి ఉండేది. అలా ఇంకోసారి ఆమెకు నువ్వు ‘ఐ లవ్యూ’ చెప్పినట్లూ ఉండేది.
మాధవ్ శింగరాజు