మరచిపోను నాన్నా...
ఎదురు చూపులు
బాల్యం గుర్తుందా... ఇంటికొచ్చిన నాన్న చేతిలో ఏవో పొట్లాలు.. అవి అందుకునేందుకు అక్కా, తమ్ముడితో నీ పోట్లాటలు.. ఎవరివి వారికి తెచ్చాన్రా... అల్లరి ఆపండంటూ నాన్న వారింపులు.. అమృతంలా ఉండే వాటిని అపురూపంగా తిన్న రోజులు...
గుర్తున్నాయా....
ఇప్పుడు మీరు నాన్న స్థానంలోకి వచ్చారుగా... మరి మీరూ ఇంటికి తీసుకెళ్లండి పొట్లం... బజ్జీలో, జిలేబీలో, పకోడీలో, వెజిటెబుల్ సిక్స్టీ ఫైవో... పదార్థాలే వైనా... మీరు తీసుకెళ్లే పొట్లంలో ఉండే ది ప్రేమే... పిల్లాడు ఏదో తెమ్మని చెబుతాడు... నాన్నకు గుర్తుండదు..మరిచిపోయి ఇంటికెళ్లగానే.. వాడు నిలదీస్తాడు... ఎందుకు తేలేదని... మరి ఆఫీస్ లో లేటయింది నాన్నా... రేపు తెస్తా అని బుజ్జగిస్తే... అదేం కుదరదు... ఎప్పుడూ ఇలాగే చెప్తారు.. నాకు అది కావాల్సిందే అంటాడు బాబు... వాడి కోపంలో న్యాయముంది... మీ అలసటలో అర్థం ఉంది... కానీ కాస్త ఓపిక చేసుకుంటే... వాడి కళ్లలో మీకు చెప్పలేని ఆనందం దొరుకుతుంది. వాడికి డిపార్ట్ మెంటల్ స్టోర్ అయినా, స్టేషనరీ అయినా, స్వీట్ షాప్ అయినా, టాయ్ స్టోర్ అయినా... అన్నీ మీరేగా... నాలుగేళ్ల పిల్లాడు బయటకు వెళ్లలేడు. ఏదీ సాధించలేడు... మిమ్మల్ని తప్ప. అందుకే ఇవాళ తీసుకెళ్లండి వాడు ఎన్నాళ్ల నుంచో అడిగేది.
ఉట్టిచేతుల్తో ఇంటికెళ్లడం కంటే... ఏదైనా తీసుకెళ్తే అందరిలో ఏదో పాజిటివ్ నెస్. అది.. రోజంతా మిస్సయినందుకు అందరినీ ఊరడించే గిఫ్టే కావచ్చు. రాగానే సంతోషాలు పంచే ఆరాటం కావచ్చు. మీ ప్రేమను వ్యక్తీకరించే సాధనం అది. దీంట్లో స్వార్థ నిస్వార్థాల ప్రసక్తి లేదు. మీరు ఎలా ఉన్నా భార్యా పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు... ఇవ్వకున్నా, ఇచ్చినా... కానీ మీ స్తోమతలో తినేవో, ఆడేవో, వేసుకునేవో... ఏదోటి తీసుకెళ్లండి బాగుంటుంది.
ఉద్యోగం చేస్తున్నాం... కష్టమంతా మీదేనని అనుకోకండి... ఇంట్లో ఆవిడది మీకు రెట్టింపే. ఒకరోజు ఇంట్లో ఉంటే మీకే తెలుస్తుంది. ప్రపంచం చూస్తావు నువు...స్కూలుకెళ్లచ్చాక ఇల్లే ప్రపంచం వాళ్లకు. బతికేందుకు నువ్వుంటున్న బయట ప్రపంచం వదిలేస్తే... నీకు నిజమైన ప్రపంచం వాళ్లే. నీ ప్రపంచంలో ఎన్నో ఖర్చుపెట్టుకుంటావుగా... మరి నీకు ప్రాణమైన నీ ప్రపంచానికి ఏదో ఒకటి తీసుకె ళ్లండి ఇవాళే.
- రమేష్ గోపిశెట్టి