జియోనీ ఈలైఫ్ ఎస్... | geoni elife s china smartphones | Sakshi
Sakshi News home page

జియోనీ ఈలైఫ్ ఎస్...

Published Thu, May 15 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

geoni elife s china smartphones

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోనీ భారత మార్కెట్‌లోకి తన తాజా ఉత్పత్తి ఈలైఫ్ ఎస్ 5.5ను విడుదల చేసింది. రీటైల్ స్టోర్ల ద్వారా లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.22,900. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ఫోన్ అయిదు అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇప్పటివరకూ ఈ అమోలెడ్ స్క్రీన్లు ఒక్క శాంసంగ్ మాత్రమే ఉపయోగించేది. ఈలైఫ్ ఎస్‌లోని మరో ప్రత్యేకత దీని మైక్రో ప్రాసెసర్. మొత్తం ఎనిమిది కోర్లు, 1.7 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో వచ్చే ఈ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌కు, గేమింగ్‌కు బాగా ఉపయోగపడుతుందని అంచనా. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెళ్లు కాగా, వీడియో కాలింగ్ కెమెరా రెజల్యూషన్ కూడా 8 ఎంపీగా ఉండటం విశేషం. త్రీజీ నెట్‌వర్క్‌లోని 6 వేర్వేరు బ్యాండ్లపై పనిచేసే అవకాశముండటం వల్ల కనెక్టివిటీ బాగా ఉంటుందని అంచనా. బ్యాటరీ సామర్థ్యం 2300 ఎంఏహెచ్. జియోనీ ఇతర ఫోన్ల మాదిరిగానే దీంట్లోనూ కొన్ని మార్పులు చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘అమిగో’ను ఉపయోగించింది.
 
 
 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్
 ఎలాంజా...

 మైక్రోమ్యాక్స్ కంపెనీ తాజాగా ఎలాంజా 2 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఫీచర్ల పరంగా మధ్యమశ్రేణికి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో చెప్పుకోదగ్గ అంశం టాక్‌టైమ్. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్ మాత్రమే అయినప్పటికీ దీనిద్వారా 7.5 గంటల టాక్‌టైమ్, 240 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక కెమెరా రెజల్యూషన్ సంగతి చూద్దాం. ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా ఫ్లాష్‌తో కూడి ఉండటం ఒక విశేషమైతే... దీంతో 1280 బై 780 రెజల్యూషన్, ప్లేబ్యాక్ సౌకర్యం ఉండటం మరో ప్రత్యేకత. త్రీజీ, బ్లూటూత్, వైఫై, 2జీ, జీపీఎస్ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని రకాల ఆడియో ఫార్మాట్లనూ సపోర్ట్ చేస్తుంది. అయిదు అంగుళాల స్క్రీన్ సైజు, 1.2 గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఒక గిగాబైట్ ర్యామ్, 4జీబీల ఇంటర్నల్ మెమరీ (మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీల దాకా పెంచుకోవచ్చు), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఎలాంజా 2 స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఇతర విశేషాలు.
 
 
 

 రూ.7000లకే
 మోటోరోలా - ఈ స్మార్ట్‌ఫోన్

 బ్రాండెడ్ కంపెనీ, తక్కువ ధర.. ఒక మోస్తరు ఫీచర్లు... ఇవీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన మోటోరోలా -ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రెండు నెలల క్రితమే కొంచెం ఎక్కువ ధర కలిగిన మోటోరోలా జీ, ఎక్స్ మోడళ్లను పరిచయం చేసిన ఈ కంపెనీ తాజగా కేవలం రూ.6900లకే మోటో-ఈని అందుబాటులోకి తెచ్చింది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌ను వాడటం, మరో ప్రత్యేకత. స్క్రీన్‌సైజు 4.3 అంగుళాలు కాగా, ప్రాసెసర్ మాత్రం కొంచెం తక్కువ స్పెసిఫికేషన్ (1.2 డ్యుయెల్ కోర్) కలది. ర్యామ్ 1 జీబీ, ఇంటర్నల్ మెమరీ 4 జీబీ కాగా... మోటో ఎక్స్, జీలకు భిన్నంగా దీంట్లో మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే అవకాశం కల్పించారు. ఫ్రంట్ కెమెరా అస్సలు లేకపోవడం ఒక లోపం కాగా, ప్రధాన కెమెరా కూడా 5 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ కలిగి ఉండటం, ఫ్లాష్ లేకపోవడం నిరాశ కలిగించే అంశాలు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు పెట్టే ఖర్చుకు ఈ ఫీచర్లు ఫర్వాలేదనిపిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 1980 ఎంఏహెచ్ మాత్రమే ఉన్నప్పటికీ ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వస్తుందని కంపెనీ చెబుతోంది. నానో కోటింగ్ కారణంగా ఈ ఫోన్ వర్షానికి తొందరగా పాడవదని కంపెనీ చెబుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement