
స్వతంత్రంగా ఉండనిస్తే సమస్యలే రావు!
పిల్లల సంతోషం ఎందులో ఉంటుంది? ఈ ప్రశ్నకి ఏ తల్లిదండ్రులూ ఒకే రకమైన సమాధానం చెప్పరు. ఎందుకంటే, ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చవచ్చు కాబట్టి. అయితే పిల్లలందరూ కామన్‌గా సంతోషించే విషయాలు కొన్ని ఉన్నాయని ఓ సర్వే రిపోర్టు చెబుతోంది. తినాలనిపించినవి తింటూ, తాగాలనిపించిన కూల్‌డ్రింక్స్ తాగుతూ, చూడాలనిపించినప్పుడు టీవీ చూస్తూ గడిపే చిన్నారులు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారని తేల్చింది బ్రిటన్ ప్రభుత్వ అధికారిక అధ్యయన బృందం.
ఇది సర్వే చేసి చెప్పాలా అని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ చేయాల్సిన అవసరం ఏర్పడిందంటారు పరిశోధకులు. ఇటీవల చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతుండటంతో బ్రిటన్ వైద్య నిపుణులు ప్రభుత్వ అనుమతితో పరిశోధన మొదలుపెట్టారు. అందులో భాగంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కొందరు పిల్లల్ని ప్రశ్నించినప్పుడు... ఇష్టమైనవన్నీ చేయనివ్వకపోడమే వారి సమస్యలకు అసలు కారణమని తేలింది.
అలాగని పిల్లల్ని వదిలేయమని కాదు. అవసరమైనచోట నియంత్రించాలి. కానీ ఆటలు, ఆహారం వంటి విషయాల్లో కాసింత స్వతంత్రం ఇవ్వాలి. అలా స్వేచ్ఛని ఇవ్వకుండా వాళ్లపై ఎంత ప్రేమను కురిపించినా పిల్లలు ఆనందంగా ఉండలేరని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఎక్కువ నియమాలను విధించడం వల్ల వాళ్లు లోలోపలే చాలా బాధ పడతారని, దానివల్ల మానసిక ఒత్తిడి, మందబుద్ధి లాంటి రుగ్మతలు వస్తాయని తేల్చి చెప్పారు. కాబట్టి... తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెడుతూనే వారి సంతోషం కోసం కొన్ని చూసీ చూడనట్లు పోవాలన్నమాట. అయినా పిల్లల క్షేమం కంటే కావలసినదేముంది!