మీ పిల్లలు బరువు పెరగాలా?
సాక్షి: కొందరు పిల్లలు చాలా సన్నగా ఉంటారు. వయసుకు తగిన బరువు ఉండకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అవసరమైనంత బరువు పెరిగేందుకు పిల్లలకు ఎలాంటి ఆహారమివ్వాలోనని ఆలోచిస్తుంటారు. అలాంటివారికోసమే ఈ సూచనలు.
1. 2-3సంవత్సరాల పిల్లలకు సగటున రోజుకు వెయ్యి కేలరీల శక్తి అవసరం. 4-8కసంవత్సరాల పిల్లలకు 1,200-1,400కేలరీలు అవసరం.
2. ఒక పౌండ్ బరువు పెరగాలంటే అదనంగా 3,500కేలరీల ఆహారం తీసుకోవాలి. రోజుకు 500కేలరీల శక్తిగల అదనపు ఆహారం తీసుకోవడం ద్వారా వారంలోపు ఒక పౌండ్ బరువు పెరిగే అవకాశముంది. ఇలా బరువు పెరగాలంటే ఆహారంలో ఈ కింది మార్పులు చేయాలి.
* ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూడాలి. సహజంగా అధిక కొవ్వు ఒంటికి మంచిది కాకపోయినా సన్నగా ఉన్నవారికి పరిమితమైన కొవ్వు మేలు చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారిలో సహజంగానే కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది కూడా అంత మంచిది కాదు. పాస్తా, చీజ్, సాస్‌లాంటి పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థాలతో శరీరానికి ఎక్కువ కేల రీలు చేరుతాయి.
* పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు అందివ్వాలి. డ్రైఫ్రూ ట్స్, యోగర్ట్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఓట్‌మీల్, గోధుమలవంటి ఆహార పదార్థాల్ని కూడా ఎక్కువగా ఇవ్వాలి.
* డ్రింక్స్‌లో కూడా కేలరీలు అధికంగా ఉంటాయి. తాజా పళ్ల రసాలు, స్మూతీస్, పాల పదార్థాలతో వంద కేలరీల శక్తి లభిస్తుంది. ఇలాంటి ఆహారాల వల్ల బరువు పెరిగే అవకాశమున్నా అతిగా తీసుకోవడం కూడా మంచిదికాదు. కావాల్సినంత బరువు పెరిగిన తర్వాత ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.