
ఐస్‌ల్యాండ్.. దీవిలా ఉండే దేశం. మహిళలకు అది ‘దివి’ భూమి! ఐరోపాలో ఉంది. ఉత్తర అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉంటుంది. ‘గ్లోబల్ జెండర్ గ్యాప్’ సంస్థ రిపోర్టు ప్రకారం.. స్త్రీలను భద్రంగా, గౌరవంగా చూసుకునే ప్రపంచ దేశాలలో తొమ్మిదేళ్లుగా ఐస్‌ల్యాండ్‌దే ఫస్ట్ ప్లేస్. ఇప్పుడక్కడ స్త్రీ పురుషులు మరింత ఈక్వల్ ఈక్వల్ అయ్యారు. ఎలాగంటే.. న్యూ ఇయర్ నుండి అక్కడ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.
ఇరవై అయిదు, అంతకు మించి ఉన్న సిబ్బంది ఉన్న ప్రతి సంస్థ.. గవర్నమెంట్, ప్రైవేట్.. ఏదైనా సరే, ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ జీవితం ఇవ్వడం చట్టవిరుద్ధం! సమాన పనికి సమానం వేతనం ఉండాల్సిందే. ఆడ, మగ తేడాలు చూపడానికి లేదు. చూపట్లేదు అని ఎలా తెలుస్తుంది? గవర్నమెంటు దగ్గర్నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. ‘ఈ సంస్థ సమాన వేతనాలు ఇస్తోంది’ అని! ఆ సర్టిఫికెట్ ఊరికే ఇవ్వదు కదా ప్రభుత్వం. స్కాన్ చేసి, స్క్రీన్ చేసి ఇస్తుంది. సర్టిఫికెట్ ఉన్నవాళ్లకే రాయితీలు అవీ ఇస్తుంది.
జీతాలు మిగుల్చుకుందామని చెప్పి, మహిళా ఉద్యోగులకు మగ ఉద్యోగులకన్నా తక్కువ జీతం ఇవ్వాలనే ఏ కంపెనీ అయినా కక్కుర్తి పడితే ఇదిగో ఈ రాయితీలు కట్ అవుతాయి. ఇలాంటి చట్టం తేవాలని లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం రోజు ఐస్‌ల్యాండ్ గవర్నమెంట్ ఫిక్స్ అయింది. చక్కగా ప్లాన్ చేసి, ఈ జనవరి ఫస్ట్ నుంచి అమలు చేస్తోంది. ఐస్‌ల్యాండ్ పార్లమెంటులో సగం మందికి పైగా మహిళలు ఉన్నారు. ప్రధాని కూడా మహిళే! అందుకే ‘ఈక్వల్ పే’ చట్టం సాధ్యమైందా? ఏమైనా స్త్రీకి స్త్రీయే స్నేహితురాలు. అన్నట్టు ప్రపంచంలో ఇలాంటి చట్టం చేసిన మొట్ట మొదటి దేశం ఐస్‌ల్యాండే.
Comments
Please login to add a commentAdd a comment