మన ఊరి కథలు | Great Indian Serials-4 | Sakshi
Sakshi News home page

మన ఊరి కథలు

Published Wed, Feb 20 2019 12:22 AM | Last Updated on Wed, Feb 20 2019 12:22 AM

Great Indian Serials-4 - Sakshi

అల్లరి గడుగ్గాయి స్వామి. వాడికో ముఠా. అందమైన స్కూలు. పారే ఏరు. అమాయకమైన ఊరు. పాతకాలపు కమ్మని జ్ఞాపకాలు.‘స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌’ సాహిత్యంలో ఎంత ఆదరణ పొందాయో‘మాల్గుడి డేస్‌’ సీరియల్‌గా దూరదర్శన్‌లో అంతే అభిమానం పొందాయి.ఇటువంటి అందమైన కథలు మళ్లీ రాలేదు.  అందుకే నేటికీ వీటిని చూస్తూ ఉంటారు. బహుశా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇవి ప్రతి ఊరి కథలు.

‘అనగనగా ఒక ఊరు.. ఆ ఊళ్లో..’ అంటూ బామ్మ తన మనవలకు కథ చెబుతూ ఉంటుంది. ఆ కథ ఎక్కడిదో.. ఎలా తన ఊహల్లో రూపుదిద్దుకుందో ఆ బామ్మకే తెలుసు. ఆమే దానికి స్క్రీన్‌ ప్లే డైరెక్టర్‌. ఆ కథ వింటున్న పిల్లలకు అందులోని ఊరు, ఆ వాతావరణం, పాత్రలు ఊహల్లో తిరుగుతూ ఉండగా కళ్లు విప్పార్చుకొని ‘ఊ’ కొడుతూ వింటుంటారు. అలా కథా శ్రవణం చేసే బామ్మలు ఇప్పుడైతే లేకపోవచ్చు గాని ‘మాల్గుడి డేస్‌’ మాత్రం నేటికీ సజీవంగా ఉన్నాయి. టీవీ సీరీస్‌ రూపంలో నాటి రోజులను ఇంకా తలుపుకు తెస్తూనే ఉన్నాయి. 80ల కాలం నాటి పిల్లలను ‘మాల్గుడీ డేస్‌’తో తన ముందు తిష్టవేసుక్కూర్చునేలా చేసింది బుల్లిపెట్టె. రెండేళ్ల వయసు పిల్లలనుంచి నూట రెండేళ్ల బామ్మల వరకు ఆ మాల్గుడి వీధుల్లో ఏడాది పాటు సంబరంగా తిరిగారు. ఎండాకాలం వచ్చిందంటే అమ్మమ్మ ఊరు అందం.. మూటగట్టి తెచ్చిన మామిడిపండ్ల రుచి ఎంత గొప్పగా ఉంటాయో ‘మాల్గుడి డేస్‌’ కథలు అంత మధురంగా ఉంటాయి. ఆర్‌.కె.నారాయణ్‌ ఊహల్లో రూపుదిద్దుకున్న ఆ అందమైన పట్టణాన్ని కన్నడ దర్శకుడు, నటుడు శంకర్‌నాగ్‌ చిన్నతెర మీద ఆవిష్కరించాడు. మొత్తం 54 ఎపిసోడ్ల ప్రాజెక్ట్‌. అత్యంతసాహసమైన ప్రక్రియ. ఆర్కేనారాయణ్‌ ఊహల్లో దూరి ఒక్కో కథ ఆత్మను పట్టి అలవోకగా దృశ్యంగా మలచిన తీరు ఇప్పటికీ అబ్బురపరుస్తుంటుంది. మాస్టర్‌ మంజునాథ్, గిరీష్‌కర్నాడ్, అనంత్‌నాగ్‌లను మూడు దశాబ్దాలైనా ఇప్పటికీ మరవలేరు నాటి జనం. అప్పటి వరకు హిందీ సీరియల్స్‌లో ఉత్తరాదివారే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సీరియల్‌తో దక్షిణభారత ప్రతిభనూ దేశమంతా గుర్తించింది.

మనలోనే మాల్గుడి
మాల్గుడి అనేది నారాయణ్‌ ఊహల నుంచి పుట్టిన ఊరు. అలాంటి ఊరునూ, అందులోని వీధులనూ, కనిపించే జనాన్ని ఈ దేశంలో ఎక్కడైనా చూడచ్చు. ఆ పాత్రలతో మనకూ పరిచయముంటుంది. బహుశ అవి మనమే అయ్యుంటాం. మన  కుటుంబంలోని వారే అయ్యుంటారు. మన ఊళ్లో, మన వాడలోని వారే అయ్యుంటారు. అందుకే అందరూ ఈ కథల్లో లీనమయ్యారు. ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు. ప్రతీపాత్ర ఏదో çసమస్యతో బాధపడుతూ ఉంటుంది. తనకు తానే పరిష్కరించుకుంటుంది. కొన్నిసార్లు రాజీపడుతుంది. మరికొన్నిసార్లు సమాధానపడుతుంది. మాల్గుడి డేస్‌లోని ఊరు ప్రపంచంలోని పాఠకులను ఎంత ప్రభావితం చేసిందంటే షికాగో యూనివర్శిటీ ప్రెస్‌ ఒక సాహిత్య పత్రాన్ని చిత్రించి, భారతదేశ చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్‌.కె.నారాయణ్‌ తన పుస్తకంలో రాసుకున్నారు. మాల్గుడి ప్లేస్‌ కోసం చాలా మంది వెతికారు. కొందరు తమిళనాడులోని కోయంబత్తూరు కావొచ్చునని, కర్ణాటకలోని లాల్గుడియే మాల్గుడి అని మరికొందరు అనుకునేవారు. 

కథల పందిరి
ఎనిమిదేళ్ల స్వామి ఉదయాన్నే మేల్కొవడంతోనే మొదటి ఎపిసోడ్‌ స్టార్ట్‌ అవుతుంది. ‘స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌’ కథ అది. బుద్ధిగా ప్రార్ధన చేసి, స్కూల్‌కి వెళతాడు. అక్కడ టీచర్‌ భగవంతుడి గురించి చెప్పే విషయాల్లో టీచర్‌తో ఎదురు మాట్లాడతాడు. దాంతో టీచర్‌ బెత్తం పుచ్చుకుని దులిపేస్తాడు. టీచర్‌ దండించిన విధానం గురించి తండ్రికి చెబుతాడు స్వామి. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని హెడ్‌మాస్టర్‌కి ఉత్తరం రాస్తే దాన్ని తానే స్వయంగా తీసుకెళ్లి ఇస్తాడు స్వామి. ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే తనకే ముందుగా చెప్పమంటాడు హెడ్‌మాస్టర్‌. భయం లేకుండా ఎదగడం ఎంత ముఖ్యమో స్వామి పాత్ర ద్వారా మన కళ్లకు కట్టిస్తారు రచయిత. స్నేహితులతో కలిసి ఆడిన బొంగరాల ఆట, నీళ్లలో వదిలేసిన కాగితపు పడవలు, బ్రిటిషర్ల హయాంలో ఉండే ఆజమాయిషీ.. ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. ఆ తర్వాతి ఎపిసోడ్లలో స్వామి అతని స్నేహితులు, కుటుంబం, బామ్మతో ముచ్చట్లు, స్వతంత్ర పోరాటం.. పోలీసుల దాడి ఘటనలు  చూస్తాం. స్వామి స్నేహితుడి కారణంగా అడవివైపుగా వెళ్లి తప్పిపోయి, తిరిగి ఇల్లు చే రుతాడు. అయితే, ఏ స్నేహితుడి వల్ల అయితే తను తప్పిపోయాడో అతనే మాల్గుడి నుంచి దూరమైనప్పుడు చాలా బాధపడతాడు స్వామి. ఇలా ఎనిమిది ఎపిసోడ్స్‌ వరకు స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ మాల్గుడి డేస్‌ను ఆక్యుపై చేశారు. ఆ తర్వాతి 13 ఎపిసోడ్స్‌ అనంత్‌నాగ్‌ మాల్లుడి డేస్‌లో అంతటా తానై కనిపిస్తారు. ది వెండర్‌ ఆఫ్‌ స్వీట్స్, ది వాచ్‌మ్యాన్, మిస్సింగ్‌ నెక్లెస్, గేట్‌మెన్‌ గిప్ట్స్, ఎ హీరో, ఎ విల్లింగ్‌ స్లేవ్, గోల్డ్‌ బెల్ట్, నిత్య, ది ఎడ్జ్, సాల్ట్‌ అండ్‌ సాడస్ట్, ఆస్ట్రాలజర్స్‌ డే, నైబర్స్‌ హెల్ప్, ది హోర్డ్, ది మిస్సింగ్‌ మెయిల్, డాక్టర్స్‌ వరల్డ్, లీలాస్‌ ఫ్రెండ్‌.. వంటి కథలు మాల్గుడి డేస్‌లో చూడొచ్చు. 

మాల్గుడి స్వామి
ఈ పేరు తలుచుకోగానే బాలనటుడు మంజునాథ్‌ కళ్లముందు దర్శనమిస్తాడు. అప్పటివరకు కన్నడ సినిమా ప్రేక్షకులకు మాత్రమే ఈ బాల నటుడు పరిచయం. మాల్గుడి డేస్‌ సీరియల్‌తో అతను దేశంలో అందరికీ సుపరిచితుడయ్యాడు. (ఆ తర్వాత స్వాతికిరణం సినిమాలోనూ కనిపించి తన  నటనతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు) అంతేకాదు, మంజునాథ్‌ గొంతు, నటన ప్రపంచంలోని మాల్గుడి వీక్షకులందరినీ కట్టిపడేసింది. ఈ సీరియల్‌తో మంజునాథ్‌ అరడజను అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. దాంతోబాటు స్వామి, అతని స్నేహితుల వస్త్రధారణ కూడా అప్పటి రోజులకు తగినట్టుగా చక్కగా అమరింది. ఈ సీరియల్‌ గురించి మంజునాథ్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతీ రోజూ స్కూల్‌కి వెళుతున్నట్టే ఉండేది. ఈ సీరియల్‌ పెద్ద హిట్‌ కావడంతో ఒక హోటల్‌లో పార్టీని ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. మిస్టర్‌ ఆర్కే నారాయణ్‌ అక్కడకు వచ్చారు. అక్కడున్నంత సేపు నాతో ఉన్నారు. నాతో మాట్లాడుతూ ‘మంజూ, నా ఊహల్లో స్వామిని కళ్లముందుకు తీసుకొచ్చావు’ అన్నారు. అది నా జీవితంలో అతి పెద్ద కాంప్లిమెంట్‌. దీనిని ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నారు. మాల్గుడి డేస్‌ సీరియల్‌ హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ వచ్చింది. ఆ విధంగా ప్రపంచ వీక్షకుల మన్ననలూ పొందింది. మీ పిల్లలు కథ చెప్పమని అడుగుతున్నారా.. పిల్లలకు కథ ఎలా చెప్పాలనే ఆలోచన మీకే వచ్చిందా అయితే.. ఆలస్యం చేయకుండా ‘మాల్లుడి డేస్‌’ టీవీ సీరిస్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ మాల్గుడి వీధుల్లో విహరించాల్సిందే. 
‘మాల్గుడి డేస్‌’ స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ ఎపిసోడ్‌లో  స్వామిగా మాస్టర్‌ మంజునాథ్, స్నేహబృందం 

దాదాపు వందేళ్ల ఏళ్ల క్రితం మద్రాసులో జన్మించిన ఆర్కే నారాయణ్‌ 1943లో ‘మాల్లుడి డేస్‌’ పేరుతో కథల పుస్తకం రాశారు. 1982లో ఈ పుస్తకం పునర్ముద్రణ పొందింది. ఈ పుస్తకం పేరుతోనే 1987 మార్చ్‌ 18న రాత్రి 8:30గంటలకు దూరదర్శన్‌ సీరియల్‌గా ప్రసారమైంది.  ప్రతి బుధవారం వచ్చే ఈ సీరియల్‌ మొత్తం 54 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. కన్నడ సినిమా డైరెక్టర్, నటుడు శంకర్‌నాగ్‌ 39 ఎపిసోడ్లుడైరెక్ట్‌ చేయగా ఆ తర్వాత సినీ దర్శకురాలు కవితా లంకేష్‌ 15 ఎపిసోడ్లు తీశారు. సీరియల్‌కి సంగీతాన్ని అందించింది కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎల్‌.వైద్యనాథన్‌. ∙ఆర్‌.కె.నారాయణ్‌ సోదరుడు ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్కే లక్ష్మణ్‌ ఈ కథలకు స్కెచ్‌ ఆర్టిస్ట్‌.ఈ సీరియల్‌కి ప్రొడ్యూసర్లు టి.ఎస్‌.నరసింహన్, ప్రధాన నటుడు అనంత్‌నాగ్‌లు. ∙హిందీ భాషలో వచ్చిన ఈ సీరీస్‌లో చాలా వరకు కర్ణాటక షిమోగా జిల్లాలోని అగుంబే గ్రామంలో షూట్‌ చేశారు. కొన్ని ఎపిసోడ్లు బెంగళూరు, దేవరాయనదుర్గాలో తీశారు. మాస్టర్‌ మంజునాథ్, శంకర్‌నాగ్, గిరీష్‌ కర్నాడ్, అనంత్‌నాగ్‌లు ఈ సీరియల్‌తో దేశమంతా పరిచయం అయ్యారు. 2018లో కన్నడ మాల్గుడి డేస్‌ తెలుగులో అల్ట్రా టీవీలో ప్రసారమైంది. 
– ఎన్‌.ఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement