సూ... ప...ర్ర్...పచ్చి | Green Mango special | Sakshi
Sakshi News home page

సూ... ప...ర్ర్ .పచ్చి

Published Fri, Apr 17 2015 10:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

సూ... ప...ర్ర్...పచ్చి

సూ... ప...ర్ర్...పచ్చి

పచ్చిమామిడి స్పెషల్

రీడర్స్ కిచెన్
గ్రీష్మం ఇలా పలకరించగానే గ్రీన్‌మ్యాంగో అలా ఊరించడం మొదలౌతుంది. ప్రతి ఇంటా కొత్త ఆవకాయ వాసన గుప్పుమంటుంది. అయితే పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు అంటున్నారు సాక్షి పాఠకులు. పచ్చిమామిడితో వంటకాలు చేసి పంపమంటే... పుల్లని మామిడితో మిఠాయిలు సృష్టించారు. స్నాక్స్ తయారు చేశారు. షర్బత్‌లూ తాగిస్తున్నారు. ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో పాఠకులు వండిన పచ్చిమామిడి ప్రత్యేక వంటకాల్లో నాలుగు ఉత్తమ వంటకాలివి...
 
గ్రీన్‌మ్యాంగో బిస్కట్స్
కావలసినవి : పచ్చి మామిడికాయ తురుము - 1 కప్పు, కొబ్బరి తురుము - 1 కప్పు, బియ్యపు పిండి - 2 కప్పులు, కార్న్‌ఫ్లోర్ - 2 చెంచాలు, పచ్చిమిర్చి - 5, కరివేపాకు - 4 రెమ్మలు, ధనియాల పొడి - అరచెంచా, బేకింగ్ సోడా - చిటికెడు, నూనె - తగినంత, ఉప్పు - తగినంత
తయారీ : మామిడి తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి మిక్సీలో వేయాలి. జారుడుగా అవ్వకుండా కాస్త గట్టి ముద్దలా రుబ్బుకోవాలి; ఓ బౌల్‌లో బియ్యపు పిండి, కార్న్‌ఫ్లోర్, బేకింగ్ సోడా, ధనియాల పొడి తీసుకోవాలి; ఇందులో మిక్సీ పట్టిన ముద్ద వేసి బాగా కలపాలి; కాస్త నీళ్లు కానీ పాలు కానీ చేర్చి చపాతీ పిండిలా కలుపుకోవాలి; పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల్లా ఒత్తుకుని, బిస్కెట్ ఆకారంలో ముక్కలు చేసుకోవాలి; చివరగా ఈ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి. వీటిని కొత్తిమీర చట్నీతో కానీ, పెరుగు చట్నీతో కానీ తింటే బాగుంటాయి.
 
పచ్చి మామిడి హల్వా
కావలసినవి : పచ్చి మామిడికాయ - 1, వెర్మిసెల్లీ - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, నీళ్లు - 2 కప్పులు, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు పొడి - 2 చెంచాలు, యాలకుల పొడి - 2 చెంచాలు
తయారీ : మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులు  వదులుతున్నప్పుడు దించేసుకోవాలి.
 
మ్యాంగో బనానా షర్బత్

కావలసినవి : పచ్చి మామిడికాయలు - 2, పంచదార - 1 కప్పు, అరటిపండు - 1, జీలకర్ర పొడి - 1 చెంచా, మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత
తయారీ : అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు పోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడపోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్  శరీరాన్ని చల్లబరుస్తుంది.
 
మ్యాంగో జామూన్స్
కావలసినవి : పచ్చి మామిడికాయ-1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా-అరకప్పు, పంచదార-1 కప్పు, నీర -1 కప్పు, నెయ్యి- 2 చెంచాలు.
తయారీ : మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి; ఈ పేస్ట్‌లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేత పాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.

Advertisement

పోల్

Advertisement