
గ్రీన్ టీలోని ఓ రసాయనం గుండెపోటు రాకుండా నివారిస్తుందని లాంకస్టర్, లీడ్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ రసాయనాన్ని ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్నారని, తాజా పరిశోధనల్లో గుండెజబ్బులకు కూడా ఉపయోగపడుతుందని తెలిసిందని వారు చెప్పారు. ఎపిగాల్లోకాటెచిన్ –3 గాలేట్ (ఈజీసీజీ) అనే ఈ రసాయనం రక్తనాళాల్లో పేరుకుపోయే గార (ప్లాక్) కరిగిపోయేలా చేస్తుందని, అంతేకాకుండా మంట/వాపుల నుంచి రక్షణ కూడా కల్పిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన శాస్త్రవేత్త డేవిడ్ మిడిల్‌టన్ తెలిపారు.
అమిలాయిడ్ అనే పదార్థంతో ఏర్పడే గార నిర్మాణాన్ని ఈజీసీజీ మార్చేస్తుందని, ఈ క్రమంలో గార పేరుకుపోయేందుకు కారణమవుతున్న ప్రొటీన్‌పై కూడా ప్రభావం చూపుతుందని డేవిడ్ చెప్పారు. నాడీ సంబంధిత వ్యాధి అల్జీమర్స్‌లోనూ గారను తొలగించడం ద్వారా ఈ రసాయనం వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని వివరించారు. అంతా బాగుందనుకుని.. వెంటనే గ్రీన్ టీ తాగడం మొదలుపెట్టడం కూడా అంతమంచిదేమీ కాదని జాగ్రత్త చెబుతున్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన జెరెమీ పియర్‌సన్. ఈజీసీజీని మన శరీర వ్యవస్థ సులువుగా జీర్ణించుకోవడం దీనికి కారణమని ఆయన అన్నారు. అయితే ఈజీసీజీలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బులు, అల్జీమర్స్‌లకు మెరుగైన చికిత్స అందే అవకాశముందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment