
చల్లగ చూసే వనదేవత
పచ్చని అటవీ ప్రాంతం... ఎటు చూసినా చెట్టు చేమలు... చుట్టూ కొండలు, కోనలు... అక్కడక్కడా పారే సెలయేటి గలగలలు... పశ్చిమగోదావరి-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభువుగా వెలిసింది శ్రీశ్రీశ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి. బుట్టాయగూడెం మండలం కోర్సావారిగూడెం పంచాయతీ పరిధిలో ఉంది ఈ వనదేవత ఆలయం. గిరిజనులకు కొంగు బంగారంగా తరతరాలుగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మైదానప్రాంతాల భక్తులు కూడా పెద్దసంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు.
స్థలపురాణం: ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలోనే వెలిసినట్లు ప్రతీతి. సీతా రామలక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెబుతారు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరువలోని పురాతనమైన రెండు మామిడి చెట్లను రామలక్ష్మణులని భక్తులు పిలుచుకుంటారు. ద్వాపరయుగంలో పాండవులు కూడా అరణ్యవాస కాలంలో ఈ అడవిలో సంచరించినట్లు చెబుతారు. అప్పట్లో ఇక్కడ కొందరు రాక్షసులు సంచరించేవారట. రాక్షసులు వారిలో వారు కలహించుకున్నప్పుడు పెద్ద యుద్ధం జరిగిందట. రాక్షసుల పోరులో గుబ్బల మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. దీంతో కోపగించిన మంగమ్మ తల్లి రాక్షసులను సంహరించిందని, ఆమె ఆగ్రహజ్వాలలకు ప్రకృతి అల్లకల్లోలం కాగా, దేవతలంతా దిగివచ్చి, ప్రార్థనలు చేసి ఆమెను శాంతింపజేశారని స్థలపురాణం చెబుతోంది. నాటి నుంచి గలగల పారే సెలయేటి నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో మంగమ్మ తల్లి వెలిసిందని, అందుకే గుబ్బల మంగమ్మ తల్లిగా ప్రసిద్ధి పొందిందని చెబుతారు. మంగమ్మ తల్లికి తోడుగా ఇక్కడ గంగమ్మ, నాగమ్మ తల్లులు కూడా వెలిసినట్లు చెబుతారు.
నేపథ్యం: బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే ఆసామి 32 ఏళ్ల కిందట వెదురు కోసం అడవికి వెళ్లారు. వెదురు సేకరించి, ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమవుతూ ఉండగా, తోవలో బండి తిరగబడింది. ఇలా ఎందుకు జరిగిందా అని కృష్ణమూర్తి ఆలోచించినా, ఆయనకు కారణమేదీ అంతుచిక్కలేదు. ఆ రాత్రి ఆయన నిద్రించినప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించిందట. అడవిలోని సెలయేటి మధ్యనున్న గుహలో తాను కొలువై ఉన్నట్లు చెప్పిందట. ఆ కలతో మెలకువలోకి వచ్చిన కృష్ణమూర్తి తెల్లవారు జామునే గ్రామస్థులతో కలసి వెళ్లి చూడగా గుహలో కొలువై ఉన్న మంగమ్మ తల్లి దర్శనమిచ్చిందట. వెంటనే ఆయన మంగమ్మ తల్లికి పూజలు చేశారట. ఆ తర్వాత ఇక్కడ స్వయంభువుగా వెలసిన మంగమ్మ తల్లి గురించి ప్రచారం చేయడంతో భక్తుల రాక పెరిగింది. అప్పటి నుంచి ప్రతి ఆదివారం, మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడకు రావడం మొదలైంది. ఆలయానికి రద్దీ పెరుగుతుండటంతో దీనిని స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇక్కడి కొండరెడ్లు తామే ఈ ఆలయం బాగోగులు చూసుకుంటామని చెప్పడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీలు ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తూ ఉంటారు.
- డీవీ భాస్కరరావు
జంగారెడ్డిగూడెం , పశ్చిమగోదావరి
ఇలా చేరుకోవాలి
గుబ్బల మంగమ్మ ఆలయం జంగారెడ్డిగూడేనికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూర ప్రాంతాలవారు జిల్లా కేంద్రం ఏలూరు వరకు రైలులో రావచ్చు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని జంగారెడ్డిగూడెం వరకు బస్సులో చేరుకుని, అక్కడి నుంచి మంగమ్మ ఆలయానికి బస్సు లేదా ఇతర వాహనాల్లో రోడ్డుమార్గం గుండా చేరుకోవాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి విమానమార్గంలో వచ్చేవారు విజయవాడ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. ఇక్కడ రాత్రివేళ బస చేయరాదనేది ఆచారం. అందువల్ల ఆలయ సందర్శన పూర్తయిన తర్వాత జంగారెడ్డిగూడెం చేరుకుని, అక్కడి హోటళ్లలో బస చేయవచ్చు. జంగారెడ్డిగూడెంలో పర్యాటకులకు సౌకర్యవంతమైన బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.