
మీకు మళ్లీ మళ్లీ పెళ్లవుతోందా?!
స్వప్నలిపి
పెళ్లి వయసుకు రాని వాళ్లకు, వృద్ధులకు ‘పెళ్లి’ అయినట్లు కల వస్తుంటుంది. ‘‘ఈ వయసులో ఇలాంటి కలలు ఏమిటి?’’ అని ఆశ్చర్యపోతుంటారు.
కలలో ‘పెళ్లి’కి రకరకాల అర్థాలు ఉన్నాయి.
ఒకటి
కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు నచ్చకపోయినా ఆమోదించాల్సి వస్తుంది. కారణం ఏదైనా ‘‘ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాను? తీసుకోవాల్సింది కాదు...’’ ఇలా మనసులో ఆలోచనలు సుడి తిరుగుతుంటాయి. ఈ ఆలోచన తీవ్రత కలగా మారుతుంది.
కలలో... పెళ్లి పందిరి చుట్టుపక్కల ఆనందం వెల్లివిరుస్తుంటుంది. ఇందుకు విరుద్ధంగా వరుడి (లేదా వధువు) ముఖంలో విషాదం తాండవిస్తుంటుంది. ఇక్కడ ‘పెళ్లి’ అనేది ఒక నిర్ణయమైతే, దాని మీద ‘అనిష్టం’ అనేది వరుడు (లేదా వధువు) ముఖంలో కనిపించే ‘విషాదం’.
రెండు
మన జీవితంలో పెళ్లి అనేది అపురూపమైన విషయం.
‘‘నా పెళ్లి ఇలా జరగాలి. అలా జరగాలి’’ అని భావుకంగా ఊహించుకుంటాం. పరిస్థితులు కుదరక... మన ఊహల్లో లాగా నిజజీవితంలో పెళ్లి ఉండకపోవచ్చు. ఆ రకమైన అసంతృప్తి ఒకటి సున్నితంగా బాధ పెడుతుంటుంది.
‘‘పెళ్లి గురించి గొప్పగా ఊహించుకున్నాను. కానీ, పేలవంగా జరిగింది’’ అనే భావన అసంతృప్తుల జాబితాలో ఏదో ఒక మూల చేరిపోతుంది. కాలక్రమంలో దీన్ని మరిచిపోతాం. కానీ, అసంతృప్తి జాబితాలో ఉన్న ‘పేలవంగా పెళ్లి’ మళ్లీ కలలోకి వస్తుంది. అందుకే...ఒకవైపు పెళ్లిసందడి కనిపిస్తున్నా దాన్ని పట్టించుకోకుండా మరోవైపు వరుడి ముఖంలో విషాదం కనిపిస్తుంటుంది.
మూడు
కలలో పెళ్లి కనిపించడమనేది ఒక కొత్త ప్రారంభానికి సూచనప్రాయమైన వ్యక్తీకరణ కూడా.