నిత్యం కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నారా? | Health Awareness non Routine Job | Sakshi
Sakshi News home page

నిత్యం కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నారా?

Published Mon, Jul 29 2019 10:47 AM | Last Updated on Mon, Jul 29 2019 10:47 AM

Health Awareness non Routine Job - Sakshi

నిత్యం కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తున్నారా? దాంతో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో మొదటిది స్థూలకాయం. నిజానికి దాన్ని సమస్య అనుకుంటారుగానీ అదీ ఓ వ్యాధే. అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి అది. దాని కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల వంటి అనేక సమస్యలు వచ్చే ముప్పు పొంచి ఉంది. అదేపనిగా కూర్చొవడం వల్ల నడుము నుంచి కాళ్ల వరకు వెళ్లే అతిపెద్ద నరం అయిన సయాటికా నొక్కుకుపోతూ నడుము నుంచి కాలి వరకు తీవ్రంగా బాధ కలిగించే సయాటికా వ్యాధికి దారితీయవచ్చు. మెడనొప్పులూ రావచ్చు. మీరూకూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నారా? దాంతో వచ్చే ఆరోగ్యపరమైన అనర్థాలను అధిగమించడానికి ఈ కింది సూచనలను అనుసరించండి.
మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. ఈ సమతులాహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్‌ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.
ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
జంక్‌ఫుడ్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇటీవల చక్కెర ఎక్కువగా ఉండే షుగరీ ఫుడ్స్‌ వినియోగం పెరిగింది. అటు ఘనాహారంగానూ, ఇటు కూల్‌డ్రింక్స్, సాఫ్ట్‌డ్రింక్స్‌ రూపంలో ఈ షుగరీ డ్రింక్స్‌ యువత ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటికి దూరంగా ఉండాలి.  
ఆల్కహాల్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు.
నిద్రపోవడానికి  రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.
నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్‌ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి.
రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిదే.
ఇక ఆఫీస్‌లో కంప్యూటర్‌ ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్‌ తీసుకొని అటు ఇటు నడవాలి.
సామాజిక అంశాల వద్ద వస్తే... అందరితోనూ కలుపుగోలుగా ఉండటం, మిత్రులతో అరమరికలు లేకుండా హాయిగా నవ్వుతూ మాట్లాడటం, సామాజిక వేడుకల్లో పాల్గొనడం అన్ని విధాలా మంచిది. అలాగే మంచి కుటుంబ బంధాలు, పటిష్టమైన వైవాహిక బంధం చాలా ఒత్తిళ్ల నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
సామాజిక సేవలో పాల్గొనడం వల్ల నలుగురికి మంచి చేయడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అదేంతో మానసికతృప్తిని కలగజేస్తుంది. ఫలితంగా మనసు ఆనందంగా ఉండటం వల్ల మనిషి ఉల్లాసంగా ఉంటాడు.
ఈ అన్ని కార్యకలాపాల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం కలిగి మనుషులు దృఢంగా మారుతారు. వ్యాధుల పట్ల నిరోధకత పెరుగుతుంది.
ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలన్నింటి కంటే వేగంగా నడక సాగించే ‘బ్రిస్క్‌ వాకింగ్‌’ మేలు. దీన్ని రోజుకు 30 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement