Diabeties
-
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
నిత్యం కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నారా?
నిత్యం కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తున్నారా? దాంతో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో మొదటిది స్థూలకాయం. నిజానికి దాన్ని సమస్య అనుకుంటారుగానీ అదీ ఓ వ్యాధే. అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి అది. దాని కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల వంటి అనేక సమస్యలు వచ్చే ముప్పు పొంచి ఉంది. అదేపనిగా కూర్చొవడం వల్ల నడుము నుంచి కాళ్ల వరకు వెళ్లే అతిపెద్ద నరం అయిన సయాటికా నొక్కుకుపోతూ నడుము నుంచి కాలి వరకు తీవ్రంగా బాధ కలిగించే సయాటికా వ్యాధికి దారితీయవచ్చు. మెడనొప్పులూ రావచ్చు. మీరూకూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నారా? దాంతో వచ్చే ఆరోగ్యపరమైన అనర్థాలను అధిగమించడానికి ఈ కింది సూచనలను అనుసరించండి. ♦ మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. ఈ సమతులాహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ♦ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ జంక్‌ఫుడ్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇటీవల చక్కెర ఎక్కువగా ఉండే షుగరీ ఫుడ్స్ వినియోగం పెరిగింది. అటు ఘనాహారంగానూ, ఇటు కూల్‌డ్రింక్స్, సాఫ్ట్‌డ్రింక్స్ రూపంలో ఈ షుగరీ డ్రింక్స్ యువత ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటికి దూరంగా ఉండాలి. ♦ ఆల్కహాల్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు. ♦ నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ♦ నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్‌ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి. ♦ రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిదే. ♦ ఇక ఆఫీస్‌లో కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్ తీసుకొని అటు ఇటు నడవాలి. ♦ సామాజిక అంశాల వద్ద వస్తే... అందరితోనూ కలుపుగోలుగా ఉండటం, మిత్రులతో అరమరికలు లేకుండా హాయిగా నవ్వుతూ మాట్లాడటం, సామాజిక వేడుకల్లో పాల్గొనడం అన్ని విధాలా మంచిది. అలాగే మంచి కుటుంబ బంధాలు, పటిష్టమైన వైవాహిక బంధం చాలా ఒత్తిళ్ల నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ♦ సామాజిక సేవలో పాల్గొనడం వల్ల నలుగురికి మంచి చేయడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అదేంతో మానసికతృప్తిని కలగజేస్తుంది. ఫలితంగా మనసు ఆనందంగా ఉండటం వల్ల మనిషి ఉల్లాసంగా ఉంటాడు. ♦ ఈ అన్ని కార్యకలాపాల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం కలిగి మనుషులు దృఢంగా మారుతారు. వ్యాధుల పట్ల నిరోధకత పెరుగుతుంది. ♦ ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలన్నింటి కంటే వేగంగా నడక సాగించే ‘బ్రిస్క్ వాకింగ్’ మేలు. దీన్ని రోజుకు 30 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగించాలి. -
మొబైల్ మెసేజింగ్‌తో డయాబెటిస్ చెక్!
న్యూయార్క్: టెక్నాలజీని మనం ఎలా వాడకుంటే అలా ఉపయోగపడుతుంది. ఒకవైపు స్మార్ట్ ఫోన్లతో విచిత్రమైన జబ్బులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నా, మరో వైపు మొబైల్ ఫోన్లను సరైన పద్ధతిలో వాడితో రోగాలకు కూడా చెక్ పెట్టవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. మొబైల్ యూజర్లకి ఆహార , వ్యాయామ నిబంధనలను ఎప్పటికప్పుడు మెసేజ్‌ల రూపంలో పంపడం ద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గాయని ఓ అధ్యయనంలో తేలింది. కేవలం స్మార్ట్ ఫోన్లే కాకుండా, సాధారణ మొబైళ్ల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ఈ సర్వే ద్వారా తెలిసిందని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏంజెలా ఫిడ్లెర్ తెలిపారు. భారత్‌లోని సుమారు పది లక్షల మందిపై సర్వేలు జరిపిన తరువాత దాదాపు 40 శాతం మంది ఆరోగ్య పరిస్థితులు మొబైల్ సందేశాల ద్వారా మెరుగయ్యాయని వివరించారు. భారతదేశంలో 30-40 ఏళ్లలోపే డయాబెటిస్ బారిన పడుతున్నారని ఫిడ్లెర్ తెలిపారు.